- ఒక్క కుటుంబం కోసమే ధరణి తెచ్చి దోచుకున్నరు
- పవర్‌ను ఎంజాయ్ చేసి.. రాష్ట్రాన్ని లూటీ చేశారు
- ఇప్పుడు తానా షాహీ నహీ చలేగీ అంటున్నరని ఫైర్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలన.. కచరా గవర్నెన్స్ అని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. “స్వరాష్ట్రంలో పదేండ్లు నియంతృత్వంగా పాలించారు. ఇప్పుడు సభలో తానాషాహీ నహీ చలేగీ (నియంతృత్వం నడవదు) అంటున్నారు. అందుకే ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారు’’ అంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సభ్యులకు ప్రజా సమస్యల కంటే ఒక కుటుంబ సమస్యే ముఖ్యమైందని, అందుకే అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారని అక్బరుద్దీన్ ధ్వజమెత్తారు. కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు నేర్పించిన సంస్కారం ఇదేనా? అని ప్రశ్నించారు.
ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి ఎమ్మెల్యేలు సభకు రావాలి కానీ, గందరగోళం సృష్టించడానికి కాదని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. వారిని (బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు) సీట్లలో కూర్చోవాలని పదే పదే కోరినా వినకపోవడంతో అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని అక్బరుద్దీన్డిమాండ్ చేశారు. ఈ రోజు అసెంబ్లీలో చీకటి రోజని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడు తరాలకు సరిపడా సంపాదించుకున్నరు
బీఆర్ఎస్నేతలు పదేండ్లు పవర్‌ను ఎంజాయ్ చేశారని, రాష్ట్రాన్ని లూటీ చేశారని, ఏడు తరాలకు సరిపడా సంపాదించుకున్నారని అక్బరుద్దీన్ ధ్వజమెత్తారు. ధరణిలో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయని, పోర్టల్ ను కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తీసుకొచ్చారని ఆరోపించారు. ‘‘ఒక కుటుంబం మాత్రమే బాగుపడింది. ఎన్నో అవకతవకలతోపాటు వేలకోట్ల నష్టం జరిగింది.
రైతులు వేల ఎకరాలు కోల్పోయారు. ఎస్సీ, ఎస్టీల, ఫారెస్ట్, అసైన్డ్ భూములు పోయాయి” అని వివరించారు. భూమి ఆడిటింగ్ పై పదేండ్లుగా డిమాండ్ చేస్తున్నానని, కానీ బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇప్పుడైనా కాంగ్రెస్ప్రభుత్వం భూములను ఆడిటింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము ప్రజా సమస్యలు చెబుతుంటే వినలేక వారు (బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు) బయటకు పోతున్నారని ఫైర్ అయ్యారు.
రాష్ట్రం మొత్తం కొత్తగా సర్వే చేయాలి
ధరణిపై వేసిన కోదండరెడ్డి కమిటీ రిపోర్టులోని రికమెండేషన్స్‌పై భూ భారతి బిల్లులో మరింత క్లారిటీ ఇవ్వాలని అక్బరుద్దీన్ కోరారు. కొత్త యాక్ట్ రాక ముందే వేల అనథరైజ్డ్ఎంట్రీలు అయ్యాయని అన్నారు. సాదా బైనామాలు 30 ఏండ్లుగా రెగ్యులర్ చేస్తున్నారని, నోటరీ డాక్యుమెంట్లను కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరారు. భూ భారతిని నిజామాబాద్ జిల్లాలో వైఎస్సార్ స్టార్ట్ చేశారని గుర్తుచేశారు.
రాష్ట్రం మొత్తాన్ని మళ్లీ కొత్తగా సర్వే చేయాలని, అప్పటిదాకా భూ సమస్యలు పరిష్కారం కావన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 91, 827 ఎకరాలపై స్పెషల్టాస్క్ఫోర్స్ఏర్పాటు చేస్తామని మంత్రి సురేఖ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 45 శాతం ఎండోమెండ్ ల్యాండ్ లీగల్ కేసులను పరిష్కరించాలని, వక్ఫ్ ల్యాండ్స్ ఆక్రమణలకు గురైందని, వాటిని పరిరక్షించాలని, కొత్త పోర్టల్‌లో పెట్టాలన్నారు. వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించాలన్నారు.