హైదరాబాద్: పాతబస్తీ ప్రజలను ఎవరైనా వేధిస్తే ఉక్కు పాదంతో అణచి వేస్తామని నేరస్థులకు మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్ ఇచ్చారు. ఓల్డ్ సిటీలో రోజురోజుకీ పెరుగుతున్న హత్యలపై ఆందోళన చెందుతూ మత పెద్దలతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. యువకులు గ్యాంగులు ఏర్పాటు చేస్తూ.. రౌడీయిజం, దాదాగిరి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటిని సహించేది లేదని.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాంటి వ్యక్తులను మత పెద్దలు, ప్రజలు సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు.
‘పాతబస్తీలో ప్రతి చిన్న విషయానికి ఇరువర్గాలు కొట్టుకుంటూ హత్యలు చేసుకుంటున్నారు. ప్రజల్లో మార్పు కోసం తల్లిదండ్రులు, మత పెద్దలు ముందుకు రావాలి. యువకులు గ్యాంగులుగా తిరుగుతూ అమాయకులను వేధించి హత్యలకు పాల్పడితే వారిని అస్సలు వదలను. అలాంటి వ్యక్తుల ఓట్లు కూడా మా పార్టీకి అవసరం లేదు. ఆ వ్యక్తులను గుర్తించి వారిలో మార్పు కోసం ప్రయత్నించాలి. అలా కుదరకపోతే పోలీసులకు సమాచారం అందించాలి’ అని విజ్ఞప్తి చేశారు.