
భారతదేశ ఆర్థిక వ్యవస్థ గత దశాబ్దంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2025 నాటికి 4.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే, దాదాపు రెట్టింపు వృద్ధి. తాజాగా వెలువడ్డ ఈ గణాంకాలు భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినట్లు సూచిస్తున్నాయి.
అయితే, ఈ ఆర్థికవృద్ధి సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను ఎంతవరకు మెరుగుపరిచింది, పేదరికం, ఉద్యోగ కల్పన, ధరల పెరుగుదల వంటి అంశాల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపింది.. ఈ అంశాలను విశ్లేషిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థ వాస్తవ స్థితిని ఒకసారి పరిశీలించి భవిష్యత్తు కోసం అవసరమైన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జీడీపీ రెట్టింపు కావడం అనేది ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి సామర్థ్యం పెరిగినట్లు సూచిస్తుంది. సేవల రంగం (7.2% వృద్ధి), వ్యవసాయం (3.8% వృద్ధి), పరిశ్రమల విస్తరణ ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) డేటా ప్రకారం.. భారతదేశం గత 10 ఏళ్లలో 105% వృద్ధిని సాధించింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) 2025లో 55.6 బిలియన్ డాలర్లకు చేరడం, సామాజిక ఖర్చు 15% పెరగడం వంటివి కూడా ఈ వృద్ధిని బలపరుస్తున్నాయి. అయితే, ఈ సంఖ్యలు సమగ్ర చిత్రాన్ని ప్రతిబింబించవు. జీడీపీ వృద్ధి అనేది ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మొత్తం విలువను సూచిస్తుంది, కానీ, అది ఆదాయ విభజన, జీవన ప్రమాణాలు లేదా సామాజిక సంక్షేమం గురించి స్పష్టంగా చెప్పదు.
గణనీయంగా తగ్గిన పేదరికం
భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గినట్లు అనేక నివేదికలు సూచిస్తున్నాయి. నీతి ఆయోగ్ డేటా ప్రకారం, గత 5 ఏళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరిక రేటు 29.5% నుంచి 17.5%కి తగ్గింది. 2014 నుంచి 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు కూడా అంచనా. అయితే, ఈ తగ్గుదల ఉన్నప్పటికీ, ఇప్పటికీ దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు కనీస జీవన ప్రమాణాల కంటే తక్కువ స్థాయిలో జీవిస్తున్నారు.
జీడీపీ వృద్ధి ఎక్కువగా పట్టణ ప్రాంతాలు, సేవల రంగం, సంపన్న వర్గాలకు ప్రయోజనం చేకూర్చింది. కానీ, గ్రామీణ ప్రాంతాలు, అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ ప్రయోజనాల నుంచి దూరంగా ఉన్నారు. ఆదాయ అసమానతలు పెరగడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. జీడీపీ వృద్ధి ఉన్నప్పటికీ, ఉద్యోగ కల్పన ఆశాజనకంగా లేదు. 2025లో నిరుద్యోగ రేటు 3.2%కి తగ్గినట్లు కొన్ని అంచనాలు చెప్పినప్పటికీ, అసంఘటిత రంగంలో అండర్- ఎంప్లాయ్‌మెంట్ (పూర్తిస్థాయి ఉద్యోగం లేకపోవడం) ఇప్పటికీ పెద్ద సమస్య.
యువతకు నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు సరిపడా లభించడం లేదు. సాంకేతికత, ఆటోమేషన్ వంటివి ఉత్పత్తిని పెంచుతున్నా ఉద్యోగాల సంఖ్యను తగ్గిస్తున్నాయి. వ్యవసాయ రంగం ఇది దేశంలోని సగానికి పైగా జనాభాకు జీవనాధారం. కేవలం 3.8% వృద్ధి రేటుతో నిదానంగా ఎదుగుతోంది. దీనివల్ల గ్రామీణ యువతకు పట్టణాల్లోకి వలస వెళ్లడం తప్ప వేరే గత్యంతరం లేకపోవడం శోచనీయం.
సంపన్న వర్గాలకే ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు
ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు సంపన్న వర్గాలకే ఎక్కువగా అందుతున్నాయి. నాణ్యమైన ఉద్యోగాల సృష్టి తక్కువగా ఉంది. ముఖ్యంగా యువతకు. పేదరికం తగ్గినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ తీవ్రంగా ఉంది. ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని పెంచుతోంది. రవాణా, విద్య, ఆరోగ్య రంగాల్లో ఇంకా అభివృద్ధి అవసరం. పరిష్కార చర్యలుగా సమగ్ర వృద్ధి విధానం అవసరం.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ముఖ్యం. ఉద్యోగ సృష్టి కోసం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, MSMEలకు మద్దతు ఇవ్వడం, లేబర్- ఇంటెన్సివ్ రంగాల్లో పెట్టుబడులు పెంచడం అవసరం. ద్రవ్యోల్బణ నియంత్రణ కోసం సరఫరా గొలుసును మెరుగుపరచడం, ఆహార ధరల స్థిరీకరణకు బఫర్ స్టాక్‌లను నిర్వహించడం చేయాలి.
సామాజిక ఖర్చును విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణంలో గణనీయంగా పెంచాలి. సాంకేతికత వినియోగం ద్వారా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలను ఉద్యోగ సృష్టికి వినియోగించడం కీలకం. భారత ఆర్థిక వ్యవస్థ 2025లో బలమైన వృద్ధి దిశలో ఉన్నప్పటికీ, ఈ వృద్ధి సమగ్రంగా మరియు స్థిరంగా ఉండాలంటే పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించడం కీలకం.
జీడీపీ రెట్టింపు కావడం ఒక సానుకూల సంకేతం అయినప్పటికీ, ఈ వృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను, ఉద్యోగ అవకాశాలను, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో విజయవంతం కావాలి. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, సమాజం సమష్టిగా కృషి చేస్తేనే భారతదేశం నిజమైన ఆర్థికశక్తిగా అవతరించగలదు.
2025లో 4.9% ద్రవ్యోల్బణం
2025లో ద్రవ్యోల్బణం 4.9% వద్ద ఉన్నట్లు అంచనా వేయడమైంది. ఇది ఆర్‌బీఐ లక్ష్యం (4%) కంటే ఎక్కువ. ఆహార ధరలు, ఇంధన ఖర్చులు, సరఫరా గొలుసు సమస్యలు ఈ ద్రవ్యోల్బణానికి కారణాలు. జీడీపీ పెరిగినప్పటికీ, సామాన్య ప్రజల కొనుగోలు శక్తి ఈ ధరల పెరుగుదల వల్ల తగ్గుతోంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలపై ఈ భారం ఎక్కువగా పడుతోంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు వారికి అందడం లేదు.
తాజా లెక్కల ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ వృద్ధి సమగ్రంగా కాదు. పట్టణ ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక రంగం, పెద్ద సంస్థలు వేగంగా ఎదుగుతున్నాయి. కానీ, గ్రామీణ భారతం, అసంఘటిత రంగం, చిన్న వ్యాపారాలు వెనకబడి ఉన్నాయి. ఆదాయ అసమానతలు, పేదరికం, ఉద్యోగ లేమి, ధరల పెరుగుదల వంటి సమస్యలు ఈ వృద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సామాజిక ఖర్చు పెరిగినప్పటికీ, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు ఇంకా సరిపడా లేవు. ప్రధాన సమస్యలుగా ఆదాయ అసమానతలు, ఉద్యోగ లేమి, పేదరికం, ధరల పెరుగుదల, మౌలిక సదుపాయాల కొరత ప్రముఖంగా కనిపిస్తోంది.
- శ్రీనివాస్ గౌడ్ ముద్దం-