- 20 రోజుల్లోనే ఆరు సంఘటనలు
- పోకిరీల ఆగడాలకు బలవుతున్న బాలికలు
- వరుస కేసులొస్తున్నా అప్రమత్తం కాని పోలీసులు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధిలో గ్యాంగ్ రేపులు, కిడ్నాప్ లు కలకలం రేపుతున్నాయి. అత్యాచార సంఘటనలూ ఆందోళన కలిగిస్తున్నాయి. పోకిరీలు మైనర్ బాలికను టార్గెట్ చేసి, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. 20రోజుల్లోనే ఆరు సంఘటనలు జరగడం చర్చనీయాంశం అయింది. ఇందులో ముగ్గురు, నలుగురు దళిత వర్గానికి చెందిన బాలికలు ఉండడం మరింత కలవరపెడుతోంది. కాగా, బయటకురాని సంఘటనలు సైతం చాలానే ఉన్నాయి.
పీఏతో మొదలు.. పోకిరీల వరకు..
- గతేడాది డిసెంబర్ 1న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రైవేట్ పీఏ శివ మరో ఇద్దరితో కలిసి ఓ దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు రావడంతో అతనితో పాటు మిగిలిన వారిని సైతం అరెస్ట్ చేశారు.
- వరంగల్ దయానంద్ కాలనీలో ఉండే ఓ దళిత మైనర్ బాలికపై ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కొడుకులైన ఇద్దరు అన్నదమ్ములు అజ్మత్ అలీ, అబూ గ్యాంగ్ రేప్ చేశారు. ఈనెల 5న ఈ ఇష్యూ బయటకు వచ్చింది.
- ఈ నెల 6న కాజీపేట పీఎస్ లో మైనర్ బాలికపై రేప్ కేసు నమోదైంది. పర్వతగిరి మండలం అన్నారానికి చెందిన వాంకుడోత్ చంద్ర ఓ అమ్మాయిని నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
- ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశిబుగ్గ సుందరయ్యనగర్‌లో నివాసం ఉండే ఓ మైనర్ బాలికపై.. ఫరీద్ అనే వ్యక్తి రేప్ చేయడంతో ఈ నెల 11న కేసు నమోదైంది.
- ఈ నెల 20న ఇదే స్టేషన్ పరిధిలో ఓ కిడ్నాప్ కేసు నమోదైంది. బాలాజీ నగర్‌కు చెందిన శీలపాక బన్నీ అదే ప్రాంతానికి చెందిన మైనర్‌ను కిడ్నాప్ చేసి, పెళ్లి చేసుకున్నాడనే ఫిర్యాదుతో నిందితునిపై ఫోక్స్ కేసు నమోదైంది.
- మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేశారు. నాగేంద్రనగర్‌కు చెందిన నాలుగో తరగతి స్టూడెంట్ ఇంట్లో సామాను కోసం ఓ షాపు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు అమ్మాయికి మత్తు మందిచ్చి కిడ్నాప్ చేశారు. ఆటోలో వెళుతుండగా గణపతి ఇంజినీరింగ్ కాలేజీ సమీపానికి వచ్చాక ఆ అమ్మాయి తెలివితో ఆటోనుంచి కిందకు దూకి అరిచింది.
- రిపబ్లిక్ డే అయిన 26న కూడా మిల్స్‌కాలనీ పీఎస్ పరిధిలోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన మరో మైనర్‌పై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. ఈ నెల 24న ముగ్గురు యువకులు అమ్మాయిని బయటకు తీసుకెళ్లి వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు.
బయటకు రానివెన్నో...
సిటీలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కానీ అవమానభారం భరించలేక చాలామంది బాధితులు బయటకు చెప్పుకోవడం లేదు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్ గడప తొక్కడం లేదు. దీంతో లోలోపల మానసిక వేదనకు గురవుతున్నారు. ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేసి, అక్రమార్కులకు భయం పుట్టించాలని జనం కోరుతున్నారు. పోకిరీల ఆగడాలు అరికట్టి, బాలికలకు భద్రత, భరోసా ఇవ్వాలని వేడుకుంటున్నారు.
ఫోకస్ పెట్టని పోలీస్ పెద్దలు..
వరుసగా అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు, కిడ్నాప్ కేసులు బయటపడుతున్నా పోలీసులు పెద్దగా అలెర్ట్ కావడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసినా, దర్యాప్తును త్వరగా తేల్చడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. స్పెషల్ టీంలను కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు కూడా లేవు. ఆయా ఘటనల్లో మైనర్లే ఎక్కువగా ఉన్నా.. పోలీసులు అప్రమత్తత కావడం లేదనే అపవాదు ఉంది. పూర్తి స్థాయిలో పెట్రోలింగ్ పెంచకపోవడం.. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని జనం ఆరోపిస్తున్నారు. వరంగల్ సిటీలోని కొన్నిప్రాంతాలు పోకిరీలకు, అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారుతున్నా పోలీసులు యాక్షన్ తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.