ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన జనం

ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన జనం

జకార్తా: ద్వీప దేశం ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది. ఉత్తర సులవేసి ప్రావిన్స్‎లో రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రవతో భూ కంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం (ఫిబ్రవరి 26) ఉదయం 6:55 గంటలకు భూ కంపం సంభవించిందని  ఇండోనేషియా వాతావరణ సంస్థ, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని యూఎస్‎జీఎస్ తెలిపింది. ఈ భూ కంప ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం లేదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. 

తెల్లవారుజూమున అప్పుడే నిద్రలోంచి మేల్కొంటున్న క్రమంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో అసలేం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరికొందరు ఇండ్ల నుంచి భయంతో బయటకు పరుగులు పెట్టారు. భూకంపం నేపథ్యంలో ఇండినేషియా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహయక బృందాలను మోహరించింది.  భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దేశీయ విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసిన భద్రతా ఆదేశాలను పాటించాలని ప్రజలకు సూచించారు. 

కాగా, తాజాగా భూ కంపం సంభవించిన సులవేసి ప్రావిన్స్‎లో గతంలోనూ భయంకరమైన భూకంపాలు సంభవించాయి. 2021 జనవరిలో భారీ భూకంపం సులవేసి ప్రావిన్స్‎ను అతలాకుతలం చేసింది. రిక్టర్ స్కేల్‏పై 6.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం వల్ల 100 మందికి పైగా మృతి చెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అలాగే.. 2018లో ఇదే సులవేసిలోని పాలూలో 7.5 తీవ్రతతో భయానక భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల భారీ సునామీ వచ్చింది. భూకంపానికి సునామీ తోడవడంతో దాదాపు 2,200 మందికి పైగా మృతి చెందారు. మరికొందరు గల్లంతు కాగా.. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులుగా మిగిలిపోయారు.