
ప్రపంచాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఆసియా ఖండంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. మయన్మార్, థాయిలాండ్ దేశాలలో వచ్చిన భూకంప విలయం నుంచి ఆ దేశాలు కోలుకోక ముందే ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు సంభవిస్తు్న్నాయి. శనివారం (ఏప్రిల్ 12) పాపువా న్యూ గినియాలో 6 తీవ్రతతో భూకంపం మరువక ముందే.. పాకిస్తాన్ లో మరో భారీ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో పాకిస్తాన్ ఒక్కసారిగా వణికిపోయింది. దేశ వ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
శనివారం (ఏప్రిల్ 12) మధ్యాహ్నం 5.8 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలతో రాజధాని ఇస్లామాబాద్ ఊగిపోయింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా ప్రకటించారు. ఈ ప్రకంపనలతో పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో భవంతులు నేలమట్టం అయినట్లు తెలుస్తోంది. ప్రాణనష్టం, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
►ALSO READ | పాపువా న్యూ గినియాలోని భూకంపం..రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ( (NCS) ప్రకారం కేవలం పది కిలోమీటర్ల లోతులో ఏర్పడిన భూకంప కేంద్రం రాజధాని ఇస్లామాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాలలో ప్రకంపనలకు గురిచేసింది. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండటం ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. లోతు తక్కువగా ఏర్పడిన భూకంపాల వలన ఎక్కువ నష్టం ఉండే అవకాశం ఉంటుంది. వీటి వలన భూమీ భారీగా చీలికలకు గురయ్యే ప్రమాదం ఉంది.
యూరేషియన్, ఇండయన్ టెక్టానిక్ ప్లేట్ల మధ్య పాకిస్తాన్ ఉంది. ఈ ప్రాంతం ఎక్కువగా భూకంపం సంభవించే రీజియన్ లో ఉంది. ప్లేట్స్ కదలికలు, సర్దుబాట్ల వలన అప్పుడప్పుడు పాక్ లో భూకంపాలు నమోదు అవుతూనే ఉంటాయి. బలూచిస్తాన్, ఖైబర్ కనుమలు, గిల్జిత్ బాల్టిస్తాన్ మొదలైన ప్రాంతాలు యూరేసియన్ ప్లేట్ కు దక్షిణంగా ఉన్నాయి. సింధు, పంజాబ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాతాలు ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ కు వాయువ్య (నార్త్ - వెస్ట్) దిశన ఉన్నాయి. ఈ రెండు ప్లేట్ల ఢీకొన్న ప్రతిసారీ ఈ ప్రాంతాలలో భూకంపం సంభవించే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ కేంద్రం తెలిపింది.
ఇటీవల మయన్మార్, బ్యాంకాక్ లో వచ్చిన భూకంప ప్రళయం సృష్టించిన సంగతి తెలిసిందే..3 వేల మందికి పైగాచనిపోగా..4 వేల మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మందిని ఇంకా బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు.