- కాలి బూడిదైన దాదాపు 200 క్వింటాళ్ల పత్తి.
జైనూర్, వెలుగు: జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటన ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సీసీఐ ద్వారా కొనుగోలు చేసి మిల్లులో నిల్వ ఉంచిన పత్తి కాలి బూడిదైంది. దాదాపు 200 క్వింటాళ్ల పత్తి కాలిపోగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో జైనూర్ లోని సర్రన్ జిన్నింగ్ మిల్లులోంచి పొగ రావడం చూసిన స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు.
ఉట్నూరు నుంచి ఫైరింజన్ రావడానికి గంటన్నర పట్టింది. మరో గంటకు ఆసిఫాబాద్ నుంచి ఒకటి, ఆదిలాబాద్ నుంచి మరో ఫైరింజిన్ వచ్చాయి. అప్పటికే సగం పత్తి కాలిబూడిదైంది. మంటలను అదుపు చేయడానికి ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి ప్రమాదానికి కారణాలను తెలియచేస్తామని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ లేదా మెషీన్ల హీటింగ్ తో జరిగి ఉంటుదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.