ముషీరాబాద్, వెలుగు : హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత ఫౌండేషన్ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భరతమాత మహా హారతి కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హారతి ఇస్తుండగా.. పటాకులు పేల్చడానికి హుస్సేన్‌సాగర్‌లో సిద్ధంగా ఉంచిన రెండు బోట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు బోట్లలో పటాకులు నిల్వ ఉంచి పేలుస్తుండగా నిప్పురవ్వలు పటాకులపై పడ్డాయి. దీంతో బోట్లకు మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో రెండు బోట్లలో సుమారు 10 మంది వరకు ఉన్నారు.
వీరిలో ఏపీలోని తూర్పుగోదావరికి చెందిన గణపతి తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరం దాదాపు 80 శాతం వరకు కాలిపోగా, సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఇతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అలాగే హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన చింతల కృష్ణ, హుజూరాబాద్‌కు చెందిన సాయిచంద్‌కు స్వల్పంగా మంటలంటుకుని గాయపడడంతో యశోదలో ట్రీట్మెంట్చేస్తున్నారు.
వీరితో పాటు డి.సునీల్, ప్రణీత్ ఐదు, పది శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్ లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. మరో ముగ్గురి కండ్లలో నిప్పు రవ్వలు పడడంతో మెహిదీపట్నంలోని సరోజిని దవాఖానకు తరలించారు. బాధితులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు పరామర్శించారు.అండగా ఉంటామని హామీ ఇచ్చారు.