అంబర్ పేట కొత్త ఫ్లై ఓవర్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం

అంబర్ పేట కొత్త ఫ్లై ఓవర్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ అంబర్ పేట కొత్త ఫ్లై ఓవర్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ కింద రోడ్డు నిర్మాణ సామాగ్రి ఉంచిన రేకుల్ షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికులు ,ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఫ్లై ఓవర్ సంబంధించిన వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు.ఫ్లై ఓవర్ సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి  కారమని  చెబుతున్నారు.  స్థానికుల సమాచారంతో   ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇటీవలే ఫిబ్రవరి 26న శివరాత్రి  సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. నాలుగేండ్ల కింద మొదలైన పనులు ఈ మధ్యే పూర్తయ్యాయి. రూ.445 కోట్లతో గోల్నాక నుంచి ఛే నంబర్ జంక్షన్ మీదుగా ముఖ్రం హోటల్ వరకు 1.625 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మించారు. కోర్ సిటీలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నేషనల్ హైవే అథారిటీ నిర్మించిన మొట్టమొదటి ఫ్లై ఓవర్​ ఇది. అయితే భూసేకరణకు కావాల్సిన రూ. 140 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. 

ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను 2018లో శంకుస్థాపన చేయగా, 2021లో పనులు మొదలయ్యాయి. 2023 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట అంచనా వ్యయం రూ. 216 కోట్లుగా అనుకున్నారు. ఇందులో రూ.117 కోట్లు స్ర్టెచర్ కాస్ట్ కాగా, రూ.99 కోట్లు భూసేకరణ కోసం ఖర్చవుతుందని భావించారు. అయితే, రెండు వర్గాలకు చెందిన కట్టడాలపై నుంచి ఫ్లై ఓవర్​ కట్టడానికి ఒప్పుకోలేదు. దీంతో కొంతమేర రూట్ మార్చడం, భూసేకరణ ఎక్కువ కావడం, టైం కూడా మించి పోవడంతో రూ.445 కోట్ల అంచనాతో రివైజ్ చేశారు. ఇందులో రూ.265 కోట్లు స్ర్టెచర్ కాస్ట్ ,  రూ.180 కోట్లు భూ సేకరణ కోసం ఖర్చయ్యాయి. భూసేకరణ కోసం రూ.140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం  ఇచ్చింది.