
బీజింగ్: చైనాలోని ఓ రెస్టారెంట్ లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 22 మంది చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లియోనింగ్ ప్రావిన్స్ లోని లియోయాంగ్ సిటీలో ఈ ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. రెస్టారెంట్ నుంచి దట్టంగా పొగలు వచ్చాయి. ఆ ప్రాంతమంతా నల్లని కారుమేఘాలు కమ్ముకున్నాయి. ఫైర్ ఫైటర్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారని కొన్ని గంటల తర్వాత రేడియో, టీవీల ద్వారా ప్రభుత్వం ప్రకటించింది.
ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు ఈ ప్రమాదంపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నెల 9న నార్త్ చైనాలో హెబీ ప్రావిన్స్ లోని ఓ నర్సింగ్ హోంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి 20 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు.