మణికొండలో అగ్నిప్రమాదం ఘటన..సెల్ఫోన్ సైలెంట్ వారి ప్రాణాలు తీసిందా

మణికొండలో అగ్నిప్రమాదం ఘటన..సెల్ఫోన్ సైలెంట్  వారి ప్రాణాలు తీసిందా
  • మణికొండలో అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి
  • మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి 
  • గ్రౌండ్​ఫ్లోర్​ కిరాణ దుకాణం పక్కన షార్ట్​ సర్క్యూట్​ 
  • పైపోర్షన్లకు వ్యాపించిన మంటలు.. పేలిన 2 సిలిండర్లు
  • దగ్ధమైన కిరాణం షాపు, కారు
  • పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న కొందరు  
  • తాళ్లతో పిల్లలను కిందకు దించిన స్థానికులు

గండిపేట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మం డలం మణికొండలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపో యారు.  ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో వృద్ధురాలు, చిన్నారి, మహిళ ఉన్నారు. పుప్పాలగూడ పాషా కాలనీలోని ఓ అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌లో ఉస్మాన్‌‌‌‌.. కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. 

దీని పక్కన మెట్లుండే ప్రాంతంలో సాయంత్రం ఐదున్నర గంటలకు షార్ట్​సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. ఆ టైంలో షాపు మూసేసిన ఉస్మాన్​పైకి వెళ్లడంతో మంటలను గుర్తించలేకపోయాడు. మెట్ల పక్కన రెండు ఫుల్ ​సిలిండర్లు, ఒక ఖాళీ సిలిండర్​ ఉన్నాయి. అవి పేలడంతో మంటలు తీవ్ర రూపం దాల్చాయి. షాపు పక్కనే ఉన్న బ్యాటరీ కారు తగలబడింది. కిరాణా షాపు కూడా దగ్ధమైంది. 

మం టలు కింది నుంచి రెండో అంతస్తులోకి వ్యాపించాయి. అప్పుడు ఆ బిల్డింగులో మొత్తం11 మంది ఉన్నారు. ఇందులో మంటలను గుర్తించిన ఎనిమిది మంది  కేకలు వేస్తూ బయటకు పరిగెత్తారు. కిందకు వెళ్లడానికి మార్గం లేకపోవడంతో రెండో అంతస్తుకు పరుగులు తీశారు. తమను కాపాడమంటూ కేకలు వేశారు. అయితే, ఆ టైంలో మొదటి అంతస్తులోని ఒక రూంలో ఇద్దరు మహిళలు, మరో పాప గడియ పెట్టుకుని గాఢ నిద్రలో ఉన్నారు. 

వీరిని మిగతా కుటుంబ సభ్యులు కూడా గమనించలేదు. రెండో అంతస్తు నుంచి కేకలు విన్న స్థానికులు అగ్నిమాప క సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. ఈలోపు మంటలు ఆర్పేందుకు స్థానికులు నీళ్లు కొట్టారు. కొందరిని పైనుంచి కిందకు దించేందుకు ప్రయత్నించారు. కింద ఓ పరుపు పట్టుకుని కిందకు దూకాలని సూచించారు. రెండో ఫ్లోర్ నుంచి నలుగురు కిందకు దూకగా, ఒకరి కాలు విరిగిపోయింది. 

మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. పక్కింటి వాళ్లు తాళ్లను బిల్డింగ్​ పైకి  విసరడంతో వాటి ఆధా రంగా మరో ముగ్గురు కిందకు వచ్చారు. ఇంతలో వచ్చిన ఫైర్ ​సిబ్బంది.. ఫైర్ ​ఇంజిన్​ నిచ్చెనతో మరొకరిని కిందకు తీసుకువచ్చారు. 

గాఢనిద్ర, గమనించకపోవడమే కారణం

ప్రమాదం జరిగినప్పుడు మొదటి అంతస్తులోని గదిలో జమీలా ఖాటూన్​(70), సహానా ఖాటూన్​(38), సిజ్రా ఖాటూన్ (7) నిద్రపోతున్నారు. వాళ్ల దగ్గర సెల్ ​ఫోన్​ఉన్నా దాన్ని సైలెంట్​ మోడ్​లో పెట్టుకున్నారు. దీంతో మంటలు అంటుకున్నప్పుడు బయటకు పరిగెత్తిన వీరి బంధువులు.. కాల్​ చేయగా లిఫ్ట్  చేయలేదు. దీంతో బయట ఎక్కడో ఉండవచ్చని అనుకున్నారు. 

అయితే.. మంటలు వ్యాపించడం, భారీగా పొగ రావడంతో అది పీల్చిన వారు నిద్రలోనే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.   మంటలు తగ్గాక ఫస్ట్​ ఫ్లోర్​ రూమ్​కు వెళ్లి తలుపులు పగలగొట్టగా, ఆ ముగ్గురు అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వారిని దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు.