జగిత్యాల జిల్లాలోని రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

జగిత్యాల జిల్లాలోని రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
  • ఐదు వేల క్వింటాళ్ల ధాన్యం, 90 వేల గన్ని సంచులు దగ్ధం
  • రెండు కోట్లకు పైగా ఆస్తినష్టం
  • నాలుగు గంటలు కష్టపడి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది

మెట్ పల్లి, వెలుగు: రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు వేల క్వింటాళ్ల ధాన్యం, తొంభై వేల గన్ని సంచులు దగ్ధం అయి  రెండు కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగిన  సంఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ గ్రామానికి చెందిన జివిడి గంగారెడ్డి కొన్నెండ్ల నుంచి కొండ్రికర్ల శివారులో మహాలక్ష్మి ఇండస్ట్రీస్ పేరిట రైస్ మిల్లు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ మాదిరిగానే మిల్లులో రైస్ మిల్లింగ్ నిర్వహిస్తున్నారు.

శనివారం తెల్లవారుజామున  రైస్ మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే నిద్రిస్తున్న కూలీలు భయంతో అక్కడినుంచి బయటకు పరుగులు తీశారు. అనంతరం రైస్ మిల్ ఓనర్ గంగారెడ్డి కి సమాచారం అందించారు. గంగారెడ్డి సంఘటన ప్రాంతానికి చేరుకుని ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చే లోపు రైస్ మిల్ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో ఐదు వేల క్వింటాళ్ల ధాన్యం, తొంభై వేల గన్ని సంచులు కాలిబూడిద అయ్యాయి.

ఫైర్ సిబ్బంది సుమారు నాలుగు గంటలు కష్టపడి మంటలు అర్పారు. అగ్ని ప్రమాదంలో సుమారు రెండు కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు గంగారెడ్డి తెలిపారు. కాగా రైస్ మిల్లులో అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని ఫైర్ ఆఫీసర్ మల్లికార్జున్ తెలిపారు. అగ్ని ప్రమాదంలో రైస్ మిల్ కాలిపోయి రెండు కోట్లకు పైగా నష్టపోయిన బాధితుడు గంగారెడ్డి ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.