- ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రాజెక్టులకు డ్రిప్ ద్వారా మహర్దశ
- రిపేర్లు, ఆధునీకరణకు భారీగా నిధులు
- టేల్ ఎండ్ వరకు సాగునీరందించే లక్ష్యం
- కడెంకు మినహాయింపు
నిర్మల్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులకు మహర్దశ పట్టనుంది. ఇక్కడి ప్రధాన ప్రాజెక్టుల అభివృద్ధికి డ్రిప్ ( డ్యాం రిహాబిలిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్) కింద పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కానున్నాయి. ఆయా ప్రాజెక్టుల అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిర్మల్ జిల్లాలోని గడ్డన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టులు, ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగు, పాల్వాయి పురుషోత్తం రావు ప్రాజెక్టు, ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టులకు డ్రిప్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నిధులతో వరదల నుంచి డ్యాంలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. అలాగే కొత్త గేట్లు ఏర్పాటు చేయడం, ప్రస్తుతమున్న గేట్లకు రిపేర్లు చేయడంతో పాటు ఆనకట్టలను ఆధునీకరించి బలోపేతం చేయడం వంటి పనులు చేపట్టనున్నారు.
కడెం ప్రాజెక్టుకు మినహాయింపు
డ్రిప్ పథకంలో మొదట కడెం ప్రాజెక్టు సైతం భాగమైనప్పటికీ ఆ తర్వాత మినహాయించారు. కడెం ప్రాజెక్టు రిపేర్ల కోసం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, పనులు సైతం పూర్తిచేసింది. ప్రాజెక్టు ఆధునీకరణ కోసం డ్రిప్ కింద రూ.16 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాజెక్టు రిపేర్ల కోసం రూ.7 కోట్లు విడుదల చేసింది. అలాగే ఈ ప్రాజెక్ట్ దిగువన కొత్తగా మరో 4 గేట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కొత్త గేట్ల కోసం దాదాపు రూ.9 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు డ్రిప్ నుంచి కడెం ప్రాజెక్టును మినహాయించారు.
కరకట్టల నిర్మాణం, బండ్ రిపేర్లు..
డ్రిప్ పథకం ద్వారా నిధులు మంజూరు కానుండడంతో ప్రాజెక్టులకు మహర్దశ పట్టనుంది. గడ్డన్న వాగు ప్రాజెక్టు రిపేర్ల కోసం అధికారులు రూ.18 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. నిధులు మంజూరు కాగానే కొత్త కరకట్ట నిర్మాణం, బండ్ రిపేర్లు వంటి పనులు చేపట్టనున్నారు. స్వర్ణ ప్రాజెక్టు రిపేర్లకు రూ.9 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ నిధులు మంజూరు కాగానే ప్రాజెక్టుకు కొత్తగా ఆరు గేట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. మిగతా ప్రాజెక్టుల రిపేర్లకు సైతం డ్రిప్ పథకం ద్వారా మోక్షం లభించనుంది.
కట్టలకు రిపేర్లు, ప్రస్తుతమున్న గేట్ల ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో అమలు కానున్న డ్రిప్ పథకం కింద చేపట్టనున్న పనులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, కేంద్రం 70 శాతం నిధులు అందించనుంది. స్వర్ణ ప్రాజెక్టు కింద 10 వేల ఎకరాలు, గడ్డన్న వాగు ప్రాజెక్టు కింద 14 వేలు, సాత్నాల ప్రాజెక్టు కింద 24 వేలు, వట్టివాగు ప్రాజెక్టు కింద 25వేలు, పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు కింద 11 వేల ఎకరాలకు మొదట్లో సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఎప్పటికప్పుడు ప్రాజెక్టులు, కాల్వలకు రిపేర్లు చేపడుతుండడం, నిర్వహణ లోపం లాంటి కారణాలతో నిర్దేశించిన లక్ష్యం కన్నా సగం వరకు కూడా సాగునీరు అందించలేని పరిస్థితులున్నాయి. డ్రిప్ కింద నిధులు విడుదల కాగానే పనులు మొదలుపెట్టి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందించాలని అధికారులు భావిస్తున్నారు.