భద్రాచలం, సారపాక పంచాయతీలకు ఊరట

భద్రాచలం, సారపాక పంచాయతీలకు ఊరట
  • ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్​ శాఖ లేఖ
  • వార్డుల, ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ తాత్కాలికంగా నిలపాలని విజ్ఞప్తి

భద్రాచలం, వెలుగు  : భద్రాచలం, సారపాక మేజర్​ పంచాయతీలకు భారీ ఊరట లభించింది. గత ప్రభుత్వం ఈ పంచాయతీలను చీలికలు, పీలికలు చేస్తూ జీవో నంబర్​ 45ను తీసుకొచ్చింది. భద్రాచలంను భద్రాచలం, సీతారామనగర్​, శాంతినగర్, బూర్గంపాడు మండలంలోని సారపాక పంచాయతీని సారపాక, ఐటీసీలుగా విభజించాలని ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి గవర్నర్​కు పంపించింది. కానీ రెండు పంచాయతీల్లో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ‘విభజన వద్దు.. ఒకటే ముద్దు’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్​ పార్టీ ఒకటే పంచాయతీగా ఉంచుతామని హామీ ఇచ్చింది.

కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక అప్పటి బిల్లులకు గవర్నర్​ ఆమోదం తెలపడంతో ప్రజలు బెంబేలెత్తారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు గ్రీన్​ సిగ్నల్​ రావడంతో వార్డులు, ఓటర్ల జాబితాను తయారు చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజాభీష్టానికి తలొగ్గింది. తిరిగి ఒకటే పంచాయతీగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఈనెల 12న పంచాయతీరాజ్​ శాఖ కమిషనర్​ అనితా రామచంద్రన్​ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. భద్రాచలం, సారపాకలలో వార్డులు, ఓటర్ల జాబితా తయారీని ఆపాలని కోరారు. తిరిగి వీటికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి ఒకే పంచాయతీగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.