
- ఇయాల్టి నుంచి హీటెక్కనున్న పాలిటిక్స్
- ప్రచారంలో హోరెత్తించనున్న పార్టీలు
- భారీ సభలు..అగ్రనేతల టూర్లకు ప్లాన్
మెదక్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల పాలిటిక్స్ మరింత హీటెక్కనున్నాయి. గురువారం ఎన్నికల నోటిఫికేషన్వెలువడనుంది. నామినేషన్ల దగ్గర నుంచి పోలింగ్ వరకు ప్రచారాన్ని పరుగులు పెట్టించేందుకు మూడు ప్రధాన పార్టీల క్యాండిడేట్లు రెడీ అవుతున్నారు. అగ్రనేతల పర్యటనలు, భారీసభలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గెలుపే టార్గెట్‌గా ప్రచారంలో ఎక్కడ తగ్గకుండా ముందుకెళ్లాలని భావిస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ జారీ అయినప్పటినుంచే మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసి క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు విస్తృతంగా కార్యక్రమాలు చేస్తున్నాయి.
నేడు బీజేపీ భారీ ర్యాలీ
ఎన్నికల షెడ్యూల్రాకముందు నుంచే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావ్ తన కార్యక్రమాలను ప్రారంభించారు. మెదక్టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఆయన అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మీటింగ్‌లు నిర్వహించారు. టికెట్ ఖరారయిన తర్వాత మరింత యాక్టివ్ అయ్యారు. సెగ్మెంట్, మండల స్థాయి మీటింగ్ లు కొనసాగిస్తూ క్యాడర్ ను ఎన్నికలకు సిద్దం చేశారు. స్వయంగా వివిధ వర్గాల ప్రముఖులను, ఓటర్లను కలిసి మద్దతు కోరుతున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న 2,112 బూత్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కోఆర్డినేటర్లతో మెదక్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు.
బూత్ కమిటీలు ఎలా పనిచేయాలి, బీజేపీ విధానాలను, మోడీ విజయాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు ఎలా వివరించాలి అన్న విషయాల్లో బూత్‌కమిటీలకు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే గురువారం నాడే రఘునందన్ రావ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బీజేపీ బలాన్ని చాటేలా మెదక్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేశారు.
సీఎం సభకు కాంగ్రెస్ ప్లాన్
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. అసెంబ్లీ సెగ్మెంట్లలోని లీడర్ల మధ్య సమన్వయం కుదర్చడంతోపాటు చేరికలపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు పెద్ద సంఖ్యలో చేరుతుండడం ఆ పార్టీలో జోష్ పెరిగింది. బీఆర్ఎస్కు చెందిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మెన్ చంద్రపాల్ తో పాటు పలువురు ఎంపీపీ, జడ్పీటీసీ మెంబర్లు, మాజీ ఎంపీపీ,జడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు , ఇతర ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌నుంచి పలువురు సీనియర్ బీఆర్ఎస్లీడర్లు
సంగారెడ్డి బీజేపీ ఇన్చార్జి పులి మామిడి రాజు కూడా కాంగ్రెస్ లో చేరారు. మెదక్ లోక్ సభ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి కొండా సురేఖ పటాన్ చెరు, సంగారెడ్డి, నర్సాపూర్ సెగ్మెంట్లలో మీటింగ్‌లు పెట్టి నాయకులకు, క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ సందర్భంగా మెదక్ లో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజు భారీ స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగసభ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
త్వరలోనే కేసీఆర్ బస్సుయాత్ర
లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ మీటింగ్‌లు నిర్వహించింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ హైకమాండ్ సర్వశక్తులు ఒడ్డుతోంది. మాజీ మంత్రి హరీశ్ రావ్ ఇప్పటికే నియోజకవర్గమంతటా పర్యటించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతోపాటు పార్టీ క్యాడర్ ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తు బీఆర్ఎస్ దేనని, తొందరపడవద్దని నచ్చచెప్తున్నారు.
బుధవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్లో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పాల్గొన్నారు. నామినేషన్ల అనంతరం నియోజకవర్గంలో కేసీఆర్ బస్సుయాత్ర ఉంటుందని చెప్తున్నారు. బీజేపీ , కాంగ్రెస్‌లకు ధీటుగా వెంకటరామిరెడ్డి నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించాలని భావిస్తున్నారు.