- పోటాపోటీగా ప్రధాన పార్టీల నేతల పర్యటనలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మండుటెండను లెక్క చేయకుండా లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే టైం ఉండడంతో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రాఘురాంరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ సుడిగాలి పర్యటన చేశారు.
మెజార్టీయే లక్ష్యంగా కాంగ్రెస్..
ఖమ్మం లోక్ సభకు కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తున్న రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో అభ్యర్థితో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెం లో పెట్టిన బహిరంగ సభతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది.
అభ్యర్థి రఘురాంరెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కలియ తిరుగుతున్నారు. మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో కలిసి ప్రచార వేగాన్ని పెంచారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహబూబాబాద్ లోక్ సభకు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న పోరిక బలరాం నాయక్‌తో కలిసి ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
మళ్లీ గెలవాలని..
ఖమ్మం లోక్ సభకు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు మళ్లీ గెల్చితీరాలని తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. నామాను గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే కొత్తగూడెంలో రోడ్ షో నిర్వహించారు. మరో వైపు నామా నాగేశ్వరరావు కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ప్రచార వేగాన్ని పెంచారు. బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో ఉన్న నాయకుల్లో ఆత్మ స్థైర్యం నింపుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు మంతనాలు సాగిస్తున్నారు. మంగళవారం కొత్తగూడెంలోని అడ్వకేట్స్‌తో పాటు పలు వర్గాలకు చెందిన నేతలతో నామా సమావేశమయ్యారు. ఎండలను పక్కనపెట్టి ఈ నాలుగు రోజులు ప్రచారం మరింత వేగం చేసేలా బూత్ స్థాయి నేతలతో కొత్తగూడెంలోని పార్టీ ఆఫీస్ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి మీటింగ్ పెట్టారు. మహబూబాబాద్ లోక్ సభకు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న మాలోత్ కవితతో కలిసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పినపాక నియోజకవర్గంలో పర్యటించారు.
బూత్‌స్థాయిలో ప్రచారానికి ప్రధాన్యత..
ఖమ్మం లోక్ సభకు పోటీ చేస్తున్న తాండ్ర వినోదరావు జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో నామినేషన్ టైంలోనే ఒక రౌండ్ ప్రచారం నిర్వహించారు. వీలు చిక్కినప్పుడల్లా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా బూత్ స్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు నాయకులతో మీటింగ్‌లు పెడుతున్నారు. రోడ్ షోలలో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
తాండ్ర వినోదరావును గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మహబూబాబాద్లోక్ సభకు బీజేపీ తరుఫున పోటీ చేస్తున్న సీతారాం నాయక్ తనదైన శైలీలో ప్రచారం కొనసాగిస్తున్నారు. బీఎస్పీ తరుఫున ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న యెర్రా కామేశ్కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.