- క్యాంపెయినింగ్‌కు కేవలం ఐదు రోజులే గడువు
- కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల విస్తృత ప్రచారం
- బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, ఇతర నాయకులు
- బీఆర్ఎస్లో చెమటోడుస్తున్న కేటీఆర్, హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఖమ్మం–నల్గొండ–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్ఈ నెల 27న జరగనుండగా, 25తో ప్రచారం ముగియనుంది. గెలుపును మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విద్యావంతులు, బుద్ధిజీవుల్లో తమకు పట్టు ఉందని నిరూపించుకునేందుకు పార్టీలు పోటీపడ్తున్నాయి. ఈ క్రమంలో మూడు పార్టీల నేతలు ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
బరిలో ఇద్దరు పాతోళ్లు
ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతున్నది. ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టిపెట్టాయి. కాంగ్రెస్ తరఫున చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి పోటీపడుతున్నారు.
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లాతో పాటు తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ తరఫున, గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన ప్రేమేందర్ రెడ్డి ఇప్పుడు కూడా అదే పార్టీ నుంచి బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి పల్లా స్థానంలో రాకేశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పలువురు విద్యావేత్తలు ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచినా, ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల నడుమే త్రిముఖ పోటీ కొనసాగే అవకాశం కనిపిస్తున్నది.
నిరుద్యోగులే లక్ష్యంగా ప్రచారం..
మూడు పార్టీల నేతలు నిరుద్యోగులే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్కలతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు రంగంలోకి దిగారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ఆడుకుందని, ఎన్నికల ముందు అరకొర నోటిఫికేషన్లు వేసి, పేపర్ లీకేజీలతో ఆగం చేసిందని గుర్తుచేస్తున్నారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, రానున్న రోజుల్లో మిగిలిన 1.70లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇస్తోంది. ఉద్యోగులకు సైతం ప్రతి నెలా ఫస్ట్ తారీఖునే జీతాలు ఇస్తున్నామని చెప్తూ ఓట్లు అడుగుతోంది. అటు ఈ ఎమ్మెల్సీని కాంగ్రెస్ ఖాతాలో వేసేందుకు సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పాటు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో రేవంత్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ గెలుపు కోసం దిశానిర్దేశం చేస్తున్నారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర నేతలు ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ.. గ్రాడ్యుయేట్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో మోదీని ఆదరిస్తున్నట్లే ఈ ఎన్నికల్లో కూడా కమలానికి ఓటు వేయాలని కోరుతున్నారు. నిరుద్యోగులను, ఉద్యోగులను రెండు పార్టీలు మోసగించాయని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకునేందుకు ఆ పార్టీ తరఫున మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు రంగలోకి దిగారు. ఆయా జిల్లాల్లోని ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలను పట్టుకొని పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాము పదేండ్ల కాలంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, కానీ ఆ విషయాన్ని చెప్పుకోలేకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని ప్రచారం చేస్తున్నారు. అయితే గ్రాడ్యుయేట్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది తేలాలంటే వచ్చే నెల 5 వరకు ఆగాల్సిందే!