- నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీల నియామకం
- ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లతో మీటింగ్‌లు
మహబూబ్‌నగర్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. మెజార్టీ స్థానాలు దక్కించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగా మూడు రోజులుగా అధికార పార్టీతో పాటు బీజేపీ హై కమాండ్ నియోజకవర్గాల లీడర్లతో సమావేశం అవుతున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుపుతున్నాయి.
సత్తా చాటాలని కాంగ్రెస్..
అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎలక్షన్లలోనూ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి, అలంపూర్ పార్లమెంట్‌కు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులకు పార్టీ హైకమాండ్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో జూపల్లి కృష్ణారావు తన పార్లమెంట్ పరిధిలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు.
ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహించడంతో పాటు లోకల్ లీడర్లతో ఎన్నికలపై చర్చిస్తున్నారు. క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది? ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంది? అనే వివరాలను నోట్ చేసుకుంటున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ‘పాలమూరు’ స్కీంకు ఫండ్స్ ఇవ్వాలని, జాతీయ హోదా కల్పించాలని ఇటీవల ప్రధాని మోడీని కలిసి విన్నవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తన సొంత నియోజకవర్గాన్ని డెవలప్ చేసేందుకు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(కడా) ఏర్పాటు చేశారు. తాజాగా ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలపై సోమవారం హైదరాబాద్‌లో రివ్యూ నిర్వహించారు. సమీక్షలో పలు అంశాలపై సీఎం చర్చించారు. ప్రతి ఎమ్మెల్మేతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు.
ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఎవరిని పోటీకి దించాలనే విషయంపై చర్చించారు. ఇప్పటికే పాలమూరు స్థానం నుంచి పోటీ చేసేందుకు చల్లా వంశీచంద్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఆయన ఇటీవల పర్యటనలు ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ పారిశ్రామికవేత్త ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ కోసం ప్రయత్నించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ మందా జగన్నాథం కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.
బీజేపీలోనూ ఇన్చార్జీల నియామకం..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీకి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో రికార్డు స్థాయిలో ఓట్లు వచ్చాయి. తాజాగా ఆ పార్టీ హైకమాండ్ పార్లమెంట్ స్థానాలకు ఇన్చార్జీలను నియమించింది. మహబూబ్‌నగర్ కు మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావును, నాగర్‌కర్నూల్ కు మారం రంగారెడ్డిని నియమించింది. అయితే ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు బీజేపీలో పోటీ నెలకొంది. ఇది పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెంది దిలీపాచారి పాలమూరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
త్వరలో బీఆర్ఎస్ మీటింగ్..
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎంపీలుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మన్నే శ్రీనివాస్ రెడ్డి, పి.రాములు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ సిట్టింగులకే అవకాశం ఇస్తుందా? కొత్త వారికి చాన్స్ ఇస్తుందా? అనేది సస్పెన్స్‌లో ఉంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్‌పై రివ్యూ నిర్వహించనున్నట్లు తెలిసింది. అయితే ఆ పార్టీలో కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ ఉండే చాన్స్ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మహబూబ్‌నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.