వనపర్తిలో ప్రచారం ప్రారంభించిన ప్రధాన పార్టీలు

వనపర్తిలో ప్రచారం ప్రారంభించిన ప్రధాన పార్టీలు

వనపర్తి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో హడావుడి చేస్తున్నారు. వనపర్తి నుంచి కాంగ్రెస్  టికెట్  ఆశిస్తున్న మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి  మూడు నెలలుగా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ తో కలిసి ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టి వచ్చారు. మంత్రి నిరంజన్ రెడ్డి గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీలోని అసంతృప్తులను చేరదీసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వివిధ పథకాల లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పార్టీ ముఖ్య నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. దీనికితోడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్  ఇటీవల నియోజక వర్గంలో పర్యటించారు. జిల్లా అధ్యక్షుడు ఘనపురం కృష్ణయ్య, నియోజకవర్గ ఇన్​చార్జి నాగనమోని చెన్నరాములు వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 

బీఆర్ఎస్ లో బుజ్జగింపులు..

మంత్రి నిరంజన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీలోని కీలక నేతలు కొందరు అసంతృప్తితో ఉండడంతో దీనిపై ఆయన దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వింగ్ ను ఏర్పాటు చేసి వారితో సంప్రదింపులు మొదలుపెట్టారు. గ్రామాల్లో పర్యటిస్తూ నేరుగా గ్రామ స్థాయి లీడర్లకు దగ్గరవుతున్నారు.  పల్లె నిద్రలు, సహపంక్తి భోజనాలు, సీఎంఆర్ఎఫ్  వంటి వాటిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మండలాల్లో నాయకుల మధ్య గ్రూప్  తగాదాలు, అసంతృప్తి తలనొప్పిగా మారింది. అభివృద్దే ఎజెండాగా ప్రచారం ప్రారంభించారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో మెజార్టీ ఓట్లు సాధించడంపై దృష్టిపెడుతున్నారు. 

చివరి అవకాశం అంటూ..

30 ఏండ్లుగా వనపర్తి అభివృద్ధికి కృషి చేసిన తనను ఈ సారి గెలిపించాలని మాజీ మంత్రి చిన్నారెడ్డి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. 2018 ఎన్నికల తరువాత సీనియర్లు దూరమైనా, కొత్త వారిని పార్టీలో చేర్చుకొని జనంలోకి వెళ్తున్నారు. డీసీసీ అధ్యక్షుడిగా శ్రీరంగాపూర్  జడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్ కు అప్పగించి  బీసీల్లో కొత్త ఉత్సాహం నింపారు. మరో పక్క జూపల్లి కృష్ణారావుతో పాటు పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన వనపర్తి టికెట్ ఆశిస్తున్నారు. అయితే తనకు ఈ సారి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని చిన్నారెడ్డి పీసీసీ చీఫ్  వద్ద మాట తీసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. 

పార్టీ కార్యక్రమాలతో..

కేంద్ర ప్రభుత్వ పథకాలను, పార్టీ విధానాలను ప్రచారం చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి తో పాటు ఆపార్టీ నాయకులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, సబిరెడ్డి వెంకట్ రెడ్డి, బి కృష్ణ, నారాయణ, అనుజ్ఞారెడ్డి తదితరులు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల బీజేపీ మాజీ చీఫ్  బండి సంజయ్  మదనాపురం, ఆత్మకూర్  పట్టణాల్లో పర్యటించి పార్టీ కార్యకర్తల్లో జోష్  నింపారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు ఇక్కడి నాయకులతో టచ్ లో ఉంటూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. 

ఫోన్ నెంబర్ల సేకరిస్తున్రు.. 

గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్ల ఫోన్  నెంబర్లను ఆయా పార్టీల నాయకులు సేకరిస్తున్నారు.ఈ సారి ఎన్నికల ప్రచారంలో ఫోన్ల పాత్ర పెరగడంతో నేరుగా ఓటర్లతో మాట్లాడేందుకు ఆయా పార్టీలు సిద్ధం అవుతున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తాయిలాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క మంత్రి, ఎమ్మెల్యేలు నేరుగా మాట్లాడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ గమనిస్తున్న జనం ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు మామూలుగా ఉండేలా లేవని అనుకుంటున్నారు.