భువనగిరి బల్దియా సీటుపై మూడు పార్టీల కన్ను

  •     కోరం లేక వాయిదా పడ్ద కౌన్సిల్ సమావేశం
  •     టూర్‌‌‌‌కు వెళ్లిన బీఆర్ఎస్​ కౌన్సిలర్లు
  •     మీటింగ్‌‌ బహిష్కరించిన బీజేపీ, కాంగ్రెస్​ కౌన్సిలర్లు
  •     అవిశ్వాసం డేట్​ ప్రకటించాలని డిమాండ్​
  •     చైర్మన్​, వైస్​ చైర్మన్​పదవులపై బీఆర్‌‌‌‌ఎస్‌‌, బీజేపీ చర్చ

యాదాద్రి, వెలుగు : భువనగిరి మున్సిపాలిటీ రాజకీయం రసకందాయంలో పడింది. బీఆర్ఎస్​ కౌన్సిలర్లు కూడా కౌన్సిల్‌‌కు రాకుండా టూర్‌‌‌‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీంతో శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడింది. అంతకుముందే ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు  మీటింగ్‌‌ను బహిష్కరించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే అవిశ్వాసం డేట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.  

కోరం లేక వాయిదా

భువనగిరి మున్సిపాలిటీ  మీటింగ్ ప్రారంభం కాగానే మున్సిపల్ చైర్మన్​ఎనబోయిన ఆంజనేయులు, వైస్​చైర్మన్​ చింతల కిష్టయ్య సహా ఇద్దరు కౌన్సిలర్లు, ఇద్దరు కో ఆప్షన్​ మెంబర్లు హాల్‌‌కు వచ్చారు.  మిగిలిన 16 మంది బీఆర్ఎస్​ కౌన్సిలర్లు మీటింగ్‌‌కు రాలేదు. దీంతో బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రజల విశ్వాసం కోల్పోయినందున తాము కౌన్సిల్‌‌ను బహిష్కరిస్తున్నట్టుగా బీజేపీ ఫ్లోర్​ లీడర్​ మాయ దశరథ ప్రకటించారు. కాంగ్రెస్​ కౌన్సిలర్లు కూడా హాల్‌‌లోకి రాకుండానే అవిశ్వాసం డేట్​ ప్రకటించాలని మున్సిపల్​ ఆఫీసు ఎదుట నినాదాలు చేశారు.

పాత మున్సిపాలిటీ చట్టం ప్రకారం12 మంది కౌన్సిలర్లు వస్తే మీటింగ్​నిర్వహించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో కోరం లేనట్టుగా పరిగణించి వాయిదా వేస్తారు. అరగంట తర్వాత కౌన్సిల్​నిర్వహించాలి. కానీ, కేవలం నలుగురు కౌన్సిలర్లు మాత్రమే రావడంతో కోరం లేనందున మీటింగ్​ను నిరవధికంగా వాయిదా వేసినట్టు కమిషనర్​ ప్రకటించారు. 

టూర్‌‌‌‌లో బీఆర్ఎస్​ కౌన్సిలర్లు

శుక్రవారం కౌన్సిల్​ మీటింగ్ ఉంటుందని తెలిసినా.. చైర్మన్​మీద అవిశ్వాసం పెట్టాలనే ఆలోచనతో  బీఆర్​ఎస్​కు చెందిన 16 మంది కౌన్సిలర్లలో 11 మంది గురువారం టూర్​కు వెళ్లినట్టుగా సమాచారం. వీరందరిని చైర్మన్​ పదవి ఆశిస్తున్న కౌన్సిలర్​అజీమ్​తీసుకెళ్లనట్టుగా ప్రచారం జరుగుతోంది. 11 మంది కౌన్సిలర్లు ఏపీలోని గుంటూరు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిసింది.

మరో ఐదుగురు భువనగిరిలోనే ఉన్నా.. కౌన్సిల్‌‌ మీటింగ్‌‌కు హాజరు కాలేదు. టూర్‌‌‌‌కు వెళ్లిన కౌన్సిలర్లు భువనగిరికి వచ్చిన తరవాత కౌన్సిలర్లు కలెక్టర్ హనుమంతు జెండగేను కలిసి మరోసారి అవిశ్వాసం డేట్ కోరే అవకాశాలు ఉన్నాయి.

బీజేపీ, బీఆర్ఎస్​ చర్చలు

మున్సిపల్​చైర్మన్​ పదవిని దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్​తో పాటు బీఆర్ఎస్‌‌లోని మరో వర్గం ప్రయత్నిస్తోంది. బీజేపీ తరపున ఆ పార్టీ ప్లోర్​లీడర్​ మాయ దశరథ చైర్మన్​ పదవి ఆశిస్తుండగా, కాంగ్రెస్​ తరపున తంగెళ్లపల్లి శ్రీవాణి, పోత్నక్​ ప్రమోద్​ కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, హేమలత, బీఆర్​ఎస్​ నుంచి అజీమ్​ ఆశిస్తున్నారు.  

అయితే బీఆర్ఎస్​లోని కొందరు కౌన్సిలర్లు అజీమ్‌‌ను చైర్మన్​గా ఒప్పుకోకుండా బీజేపీకి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు  తెలుస్తోంది. తమకు చైర్మన్​ పదవి ఇచ్చి, బీఆర్ఎస్​ వైఎస్​ చైర్మన్​ తీసుకోవాలని బీజేపీ ప్రతిపాదిస్తోంది. దీనికి సంబంధించి రెండు పార్టీల లీడర్లు చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. 

బీఆర్ఎస్​ మద్దతే కీలకం

బీఆర్ఎస్​ చైర్మన్‌‌ను పదవి నుంచి తప్పించినా.. ఆ పార్టీ మద్దతు ఉంటేనే బీజేపీ లేదా కాంగ్రెస్​కు చైర్మన్​ పదవి దక్కుతుంది. బీజేపీ బలం ఆరుగురు కాగా విప్​ జారీ చేస్తే బీఆర్ఎస్‌‌లో చేరిన కౌన్సిలర్​ ఓటు వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్​కు 9 మంది ఉండగా విప్​జారీ చేస్తే బీఆర్​ఎస్​లో చేరిన ఇద్దరు ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన బీజేపీకి మరో 13 మంది, కాంగ్రెస్‌‌కు 9 మంది మద్దతు లభిస్తేనే ఆయా పార్టీలకు చైర్మన్​ పదవి దక్కుతుంది.

అయితే కాంగ్రెస్​లో అశావహులు ఎక్కువ మంది ఉండడంతో ఏం జరుగుతుందో, ఎవరు మద్దతు కూడగట్టుకుంటారన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్​ ముఖ్య లీడర్ల మధ్య చర్చలు జరుగుతున్నందున అవి ఫలప్రదం అయితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. అంతా సవ్యంగా జరిగి అవిశ్వాసం నోటీసు పరిగణలోకి వస్తే 15 వర్కింగ్‌‌ డేస్​ లేదా నెల రోజుల్లో చైర్మన్​, వైస్​  చైర్మన్​పై అవిశ్వాసం ప్రవేశపెట్టి..కొత్త చైర్మన్​, వైస్​ చైర్మన్లను ఎన్నుకుంటారు. 

పార్టీల బలాబలాలు 

భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు ఉండగా ఎన్నికల సమయంలో బీఆర్​ఎస్​ 15 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్​ 11, బీజేపీ 7, ఇద్దరు ఇండిపెండెంట్​ కౌన్సిలర్లు గెలిచారు. ఆ తర్వాత ఇద్దరు ఇండిపెండెంట్లు బీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరడంతో ఆ పార్టీ చైర్మన్​, వైఎస్​ చైర్మన్​ పదవులు దక్కించుకుంది. ఆ తర్వాత ఇద్దరు కాంగ్రెస్, ఓ బీజేపీ​ కౌన్సిలర్​ కూడా బీఆర్ఎస్​లో చేరడంతో ఆ పార్టీ బలం ఇప్పుడు 20కి చేరింది.

పాత చట్టం ప్రకారం మూడేండ్లకు అవిశ్వాసం పెట్టే అవకాశం ఉండడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న కాంగ్రెస్​, బీజేపీ కౌన్సిలర్లతో పాటు ఇద్దరు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు అప్పటి కలెక్టర్​పమేలా సత్పతికి అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.  కానీ, మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం ప్రతిపాదించే కాలాన్ని మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచుతూ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రతిపాదించిన మున్సిపల్ చట్టం బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌‌లో ఉంది.