ఇద్దరు భార్యాభర్తలు గుడికి వెళ్లారట. భర్త దేవునికి మొరపెట్టుకుంటూ స్వామీ! నిన్న మా ఇంట్లో సూది పోయింది. అది దొరికితే రేపు గుడిలో 5 కేజీల చక్కెర పంచి పెడతాను అన్నాట్ట. వెంటనే భార్య అందుకొని ఏమయ్యా! నీకు బుద్ధుందా! సూది ధర ఒక్క రూపాయి, చక్కెర ధర 5 కేజీలకు రెండు వందల రూపాయలకు పైగా అవుతుంది. అదేం
మొక్కు ? అన్నదట. దానికి భర్త అది దొరికేదీ లేదు, నేను పంచేది లేదు అన్నాడట. ఇపుడు దేశమంతా కొత్త పార్టీలు, ఫ్రంట్లు పెట్టేవారు ఇలాగే ఆలోచిస్తున్నారు. మోదీని గద్దె దించడం దేశంలో ప్రధాన రాజకీయం అయితే, కేసీఆర్ ను గద్దె దించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో ప్రధాన అంశం.
2014, 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌సహా అన్ని ప్రధాన స్రవంతి పార్టీలు మోదీని ఎన్నికల్లో ఎదుర్కొనే కార్యాచరణ కన్నా అపఖ్యాతిపాలు చేయడానికే ఎక్కువ ప్రయత్నించాయి. ఈ వ్యతిరేక ప్రచారం అంతా మోదీకి కలిసొచ్చింది. హిందూ మతతత్వ భావజాలం ఉన్న వ్యక్తిగా మోదీపై బురదజల్లారు. దాంతో ఈ దేశంలో హిందూ మతతత్వంలో జీవించడం ఓ నేరమా! అని ప్రజలు ఆలోచించారు. ముఖ్యంగా చదువుకున్న యువకులు సామాజిక మాధ్యమాల్లో మోదీకి మద్దతుగా నిలిచారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మళ్లీ అదే ప్రహసనం మొదలైంది. మోదీ వ్యక్తిగతంగా ఏ తప్పూ చేయలేదని ఈ రోజుకూ ప్రజల్లో నమ్మకం ఉంది. కానీ నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి అపవిత్ర పనులు మోదీ లాంటి ఛాయ్‌వాలా ఎలా చేస్తాడు! అన్నట్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులు విషప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అద్భుత ఘనకార్యం ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీనో, మన్మోహన్ సింగ్ వంటి ఆర్థికవేత్తనో చేయాలి గానీ మోదీలాంటి వారు చేయడం దుర్మార్గం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దీనికితోడు కమ్యూనిస్టుల కనుసన్నల్లో నడిచే మాధ్యమాలు మోదీని వీలైనంత అపఖ్యాతి పాలు చేస్తున్నాయి.
తిట్టే వారికి ప్రాధాన్యమా?
మోదీ కుర్చీ లాగేయడానికి రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకొని మధ్యమధ్యలో దుష్ప్రచారం చేసి వస్తున్నాడు. కానీ కమ్యూనిస్టులు మాత్రం మొదటి రోజు నుంచీ అదే ప్రయత్నంలో ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో అనేక ఫ్రంట్లకు జీవం పోస్తున్నారు. ఒకవేళ ఫ్రంట్ నిర్మించలేని చోట మోదీని తిట్టేవాళ్లకు కొత్త రక్తం ఎక్కిస్తున్నారు. అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీలో బీజేపీని ఓడించి గద్దెనెక్కాక తనకు తానే అతి పెద్ద నాయకుడుగా, మోదీకి సమ ఉజ్జీగా ఊహించుకున్నాడు. రోహిత్ వేముల హత్య మొదలుకొని అనేక విషయాల్లో మోదీని అడ్డగోలుగా తిట్టిపోశాడు. ఆప్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మద్యం కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోవడంతో నిజస్వరూపం బట్టబయలైంది. అప్పుడప్పుడు మమతా బెనర్జీ మోదీని బాగా తిట్టగల సమర్థురాలైంది. ఆమెను ఆకాశానికెత్తేశారు. చివరకు కన్హయ్యకుమార్ మోదీని బాగా తిడుతున్నాడని అతనికీ విపరీత ప్రచారం కల్పించారు. ఢిల్లీ, బీహార్ తప్ప మోదీ, షా ద్వయం అన్ని రాష్ట్రాలను గణనీయంగా తమ ఖాతాలో వేసుకొంది.
మీడియా ప్రచారం
ప్రస్తుతం సీపీఎం రెండు గ్రూపులుగా మారి, ఎలాగైనా ఎన్టీయేను గద్దె దించాలని ఒక వర్గం, కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టాలని మరో వర్గం ఉవ్విళ్లూరుతున్నారు. సీపీఐ కూడా అదే మార్గంలో ఉంది. ఉన్న పార్టీలకే ‘సెక్యులర్’ అనే ముద్రవేసి కొత్త రుచులు తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇటీవల కొత్తగా అధ్యక్ష పదవి అలంకరించిన మల్లికార్జున ఖర్గే చొరవతో ‘ఇండియా’ పేరుతో ఓ కూటమికి శ్రీకారం చుట్టారు. ఇందులో నితీష్ పాత్ర గణనీయం అయినా, అది కాంగ్రెస్ ఆధిపత్యంతో నడుస్తోంది. ఈ యుద్ధంలో నేరుగా పోరాడలేక ఉత్తర -దక్షిణాల మధ్య గోడలు కట్టే ప్రయత్నం జరుగుతోంది. కర్నాటకలోని సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు ద్రావిడ పార్టీలు, కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం, అవసరాల కోసం రంగులు మార్చే టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నింటినీ కలిపి ఒకవర్గం మీడియా ఉత్తరాది వారిపై పోరాడే వీరభటులుగా చిత్రీకరిస్తున్నది. కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో ఎందుకు రాజకీయాలు మొదలుపెట్టాడో తెలియదు కానీ మీడియా మాత్రం మోదీపై ఉన్న అక్కసుతో అతనిని ముగ్గులోకి దించాలని చూస్తున్నది. నిజానికి మోదీ, షాలు కూడా పశ్చిమ భారత్ వారే. ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంత దూరమో గుజరాత్ నుంచి కూడా అంతే దూరం.
ఈవెంట్ మేనేజ్మెంట్లా రాజకీయం..
నిజానికి ఢిల్లీ ఆనుపానులు తెలుసుకోవడానికి మోదీ, షాలు కూడా అరుణ్ జైట్లీ లాంటి స్థానికులైన సీనియర్లపై మొదట ఆధారపడ్డారు. మరి గతంలో లాలూప్రసాద్, మమతాబెనర్జీ లాంటి రైల్వే మంత్రులు ఇక్కడి రాష్ట్రాలకు సున్నాజూపి తమ స్వరాష్ట్రాలకు అన్ని ప్రాజెక్టులను తరలించుకొని పోయినపుడు ఈ ఆత్మాభిమానం ఎక్కడికి పోయింది?1200 మందికి పైగా తెలంగాణలో యువకులు అమరులవుతుంటే కనీసం నోరు తెరిచి మాట్లాడని సోనియాపై ఎవరైనా పన్నెత్తి మాట్లాడారా? ఇటలీ నుంచి వచ్చి ఈ దేశంలో ఓ పార్టీకి వారసురాలు అయితే అంగీకరించిన మనవాళ్లు దక్షిణాది, ఉత్తరాది అంటూ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదం. అనధికార గణాంకాల ప్రకారం 7 జాతీయ పార్టీలు, 50 రాష్ట్ర పార్టీలు, 48 గుర్తింపులేని పార్టీలు, 730 రిజిస్టర్ అయి గుర్తింపు పొందని పార్టీలు దిక్కుదివాణం లేక అల్లల్లాడుతుంటే కొత్త పార్టీలు, ఫ్రంట్లు ఏ మేరకు ప్రభావం చూపుతాయో పరిశీలించాలి! ఇప్పుడు దేశ రాజకీయ వ్యవస్థ ‘ఈవెంట్ మేనేజ్మెంట్’ లా మారిపోయింది. ఒకప్పుడు వ్యక్తుల ఆధారంగా పార్టీలు నడిచేవి. మెల్లమెల్లగా వ్యక్తుల ‘బాడీ లాంగ్వేజ్’ ఎలా ఉండాలో పార్టీలు నిర్ణయించడం మొదలుపెట్టాయి.
ఇటీవల వ్యూహకర్తలు వ్యక్తులు ఎలా నడుచుకోవాలో వదిలేసి ఏ ఉద్వేగాలు వ్యాప్తిచేస్తే గద్దెమీద ఉన్నవాళ్లను డిస్ట్రబ్ చేయవచ్చో లేదా అధికారాన్ని కాపాడుకోవచ్చో చెబుతున్నారు. పట్టణం దాటి పక్షానికోసారి నియోజకవర్గాన్ని సందర్శించే నాయకుడు ప్రతి ఊరిలో అనుచరులను ఉత్పత్తి చేస్తున్నాడు. ప్రాంతాలను, కులాలను రెచ్చగొట్టి అవతలివారిపై మనసులో శతృత్వం నింపేసి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరేవాళ్లు ఎక్కువవుతున్నారు. జనం కూడా సదరు వ్యక్తి మాకు ‘ఆరాధనీయుడే’ అంటున్నారు. ఈ సందర్భంలో జాతీయ యవనికపై పాలిస్తున్న ఎన్డీయే కూటమి దానికి వ్యతిరేకంగా పుట్టిన ‘ఇండియా’ కూటమి ఏంచేయబోతోందని ప్రశ్న. అయితే ఇండియా కూటమి ఒక్కమాటలో చెప్పాలంటే ‘మోదీ’ వ్యతిరేక కూటమి అనే చెప్పొచ్చు.
మిగతా కూటముల్లోని పార్టీలు అవకాశవాదంతో ఎక్కడంటే అటువైపు తిరిగాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీతో పొత్తు పెట్టుకోని పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయా? ఇందులో కూడా తృణమూలు, కమ్యూనిస్టులకు, బెంగాల్ కాంగ్రెస్‌కు అస్సలు పడదు. కేరళలో కాంగ్రెస్, సీపీఎం వర్గ శత్రువులే. మాయావతి అందులో లేదు. కేసీఆర్ ఓవైపు అఖిలేష్ తో సహవాసం చేస్తూ కాంగ్రెస్ తో ఫైట్ చేస్తున్నా అంటున్నాడు. మరోవైపు అఖిలేష్ ‘ఇండియా’ భాగస్వామే. ఒవైసీ తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటిస్తున్నా వాళ్ళ పార్టీ నాయకుడు వారిశ్ పఠాన్ మమ్మల్ని పిలవడం లేదని వాపోయాడు. నితీశ్ కుమార్ గత 15 ఏండ్ల నుంచి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడకు దూకినవాడే. ఆప్ కేజ్రివాల్ ఢిల్లీలో మోదీ తన ముందర కాళ్లకు బంధం వేశాడని ఢిల్లీ, -పంజాబ్‌లో శత్రువైన కాంగ్రెస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. నవీన్ పట్నాయక్ అటువైపే చూడలేదు. దేవెగౌడ మళ్లీ మోదీని చూసి మురిసిపోతున్నాడు. శరద్‌పవార్ పెద్దమనిషి పాత్ర పోషిస్తున్నాడు. ఇన్ని భారాలు తలపై మోస్తూ కాంగ్రెస్ ‘ఇండియా’ కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తోంది. దీన్నే బీజేపీ అది ‘ఇండియా’ కాదు ఈస్ట్ ఇండియా అన్నది. దీంతో అది కాంగ్రెస్ స్పాన్సర్ అని తేల్చేసింది. మిగతావాళ్లను కుటుంబ పార్టీలుగా అభివర్ణించింది.
ఆ హింసపై చర్చ ఏది?
ఈ కూటమి ఫెయిల్ అయిందని చెప్పేందుకు ఉదాహరణ పార్లమెంట్ నడవకపోవడం. మణిపూర్ విషయంలో ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా మోదీ ప్రతిష్టకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే విపక్షాలు దేశంలో జరిగేవన్నీ వదిలేసి మణిపూర్ చుట్టూ తిరగడం బీజేపీకే లాభం. మొదట గిరిజన గిరిజనేతరుల మధ్య ఘర్షణగా చూపించిన వాళ్లు మైతీ హిందూ, కుకీ క్రైస్తవుల ఘర్షణ అని ఎక్స్పోజ్ ఇచ్చారు. ఇదంతా రైటింగ్‌కు అనుకూలమే. ‘ఇండియా’ కూటమి సోనియాగాంధీ నేతృత్వంలో నడుస్తోంది కాబట్టి ‘క్రైస్తవుల పక్షమే’ అన్న సంకేతం పరోక్షంగా ఇచ్చింది. దీంతో విలువైన పార్లమెంట్ సమయం పాడైంది. కానీ బీజేపీ తమకు కావాల్సిన బిల్లులు పాస్ చేయించుకుంటున్నది. దేశంలో ఇంకో చర్చ మొదలైంది. కమ్యూనిస్టు కేరళలో, బెంగాల్లో జరుగుతున్న హింసపై ఎందుకు చర్చ జరగడం లేదని జనం ఆలోచిస్తున్నారు. కేరళలో జరిగిన రైట్ వింగ్ కార్యకర్తల హత్యలు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హత్యలు, ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో బెంగాల్లో 25 మందికి పైగా హత్యలు జరిగాయి. దీనిపై ఎవరూ నోరు తెరవలేదు. హర్యానాలో 2500 మంది యాత్రగా గుడికి వెళితే వాళ్లను రాత్రంతా బంధించి భయభ్రాంతులకు గురిచేసిందెవరు? ఈ ప్రశ్నలన్నీ ‘ఇండియా’ కూటమిని బోనులో నిలబెడుతున్నాయి.
- డా. భాస్కరయోగి, సోషల్ ఎనలిస్ట్