- ముగిసిన ప్రచార పర్వం
వెలుగు, నెట్వర్క్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం భద్రాద్రి కొత్త గూడెంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు, ఖమ్మం జిల్లాలో 5 గంటలకు మగిసింది. చివరి రోజు ఆయా పట్టణాల్లో ప్రధాన పార్టీలు భారీ బైక్ ర్యాలీలు నిర్వహించాయి. ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ ఆర్ కళాశాల ఎదుట ప్రధాన రహదారిపై కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అభ్యర్థి రఘురాంరెడ్డి పాల్గొని కార్యకర్తలో జోష్ నింపారు.
ఖమ్మం రూరల్, కల్లూరు, పాల్వంచలోనూ కాంగ్రెస్, మిత్రపక్షాల నేతలుర్యాలీలు చేపట్టారు. కామేపల్లి మండలం అడవి మద్దులపల్లిలో మహబూబాద్ పార్లమెంట్కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ప్రచారం నిర్వహించారు. వైరా మండలం విప్పలమడక గ్రామంలో ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని ఆయన కుమారులు నామా పృధ్వి తేజ, భవ్య తేజ ఇంటింటి ప్రచారం చేశారు. కామేపల్లి మండలం తాళ్లగూడెంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు శెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని నినాదాలు చేశారు.
ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావును గెలిపించాలని ఖమ్మం, మధిర, కుసుమంచి, జూలూరుపాడు, కల్లూరు, ముదిగొండలో నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాగా ప్రచారం ముగియడంతో ప్రచార రథాలకు బైక్‌లు, ఫ్లెక్సీలు తొలగించారు. రెండు రోజులపాటు వైన్‌షాపులు బంద్ ఉండడంతో చివరి గంటలో మద్యం ప్రియులు పోటెత్తారు.