జహీరాబాద్​పై ప్రధానపార్టీల గురి

జహీరాబాద్​పై ప్రధానపార్టీల గురి
  •     ప్రచారానికి రానున్న బడా లీడర్లు
  •     జోరందుకోనున్న ప్రచారం
  •     నేడు ప్రధాని మోదీ బహిరంగ సభ

కామారెడ్డి, వెలుగు: జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి.  సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో నియోజకవర్గంపై అగ్రనేతలు గురి పెట్టారు.  జహీరాబాద్​పార్లమెంట్ పరిధిలో  మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు  సంగారెడ్డి జిల్లాలో,  మరో నాలుగు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి.  ఒకచోట అగ్రనేతలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ముఖ్య నేతలతో సభలు, కార్నర్​ మీటింగ్​లతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. 

కాంగ్రెస్

జహీరాబాద్​ లో గెలుపుపై కాంగ్రెస్​ పార్టీ గట్టి ధీమాతో ఉంది.  బీసీ వర్గానికి చెందిన సురేశ్ షెట్కార్​ను అభ్యర్థిగా బరిలో  నిలిపారు. 4 రోజుల క్రితం శంకరంపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్​రెడ్డి హాజరయ్యారు.  ఇక్కడకు జహీరాబాద్, నారాయన్​ఖేడ్, అందోల్​తో పాటు సమీపంలో ఉన్న కామారెడ్డి జిల్లాలోని  జుక్కల్,  ఎల్లారెడ్డి నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. కామారెడ్డి జిల్లాలో కూడా రేవంత్​రెడ్డితో సభ నిర్వహించనున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కలిపి సభను ప్లాన్​ చేస్తున్నారు.  బాన్సువాడ, జుక్కల్​నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్యనేతలతో  కార్నర్​ మీటింగ్​లకు ప్రయత్నాలు చేస్తున్నారు.  పార్టీ అగ్రనేతలను తీసుకురావటం ద్వారా ఓటర్లను భరోసా కల్పించి మెజార్టీ ఓట్లను సాధించవచ్చని కాంగ్రెస్​ నేతలు భావిస్తున్నారు. 

బీజేపీ

అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగటంతో ఎంపీ స్థానం పరిధిలోని కామారెడ్డి సీటును బీజేపీ దక్కించుకుంది.  జుక్కల్​నియోజకవర్గం  మహారాష్ర్ట, కర్నాటక బార్డర్​లో ఉండటం, మోదీ చరిష్మా, అయోధ్యలో రామాలయం నిర్మాణ ప్రభావం అంశాలు ప్రభావం చూపనున్నాయి. వీటితో పార్లమెంట్​పరిధిలో ఓటర్లను ప్రభావితం చేయటం ద్వారా ఇక్కడ కాషాయ జెండా ఎగురుతుందనే  భావనలో బీజేపీ నేతలు ఉన్నారు. తమ పార్టీ అంతర్గత సర్వేల్లో ఇక్కడ గెలుస్తున్నామనే నమ్మకం ఆ పార్టీ నేతల్లో ఉంది. నేడు సంగారెడ్డి జిల్లాలోని అల్లాదుర్గ్​లో  భారీ సభ ఏర్పాటు చేస్తుండగా, ప్రధాని మోదీ వస్తున్నారు.  కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లను ప్రభావితం చేసేలా మరో అగ్రనేతలో సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. 

బీఆర్ఎస్​

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చతికిలబడిన బీఆర్ఎస్​ ఎంపీ ఎన్నికల్లో  మెజార్టీ స్థానాలు దక్కించుకొని తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.  వరుసగా 2 పర్యాయాలు జహీరాబాద్​లో  బీఆర్ఎస్​ అభ్యర్థి బీబీ పాటిల్ గెలిచారు. ఈయన బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తుండడంతో.. బీఆర్ఎస్​అభ్యర్థిగా గాలి అనిల్​కుమార్​ను బరిలో దించారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్​ చేపట్టిన బస్సు యాత్ర మే 7న కామారెడ్డికి రానుంది. జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్నర్​ మీటింగ్​లోనూ కేసీఆర్​పాల్గొననున్నారు. ​ మిగతా నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు  కేటీఆర్, హరీశ్​రావు ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే  కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పార్టీ మీటింగ్​లకు హరీశ్​హాజరయ్యారు. ఈ మేరకు అగ్రనేతల పర్యటనలతో ప్రచారం ఇక జోరుందుకోనుంది.