- ఏడాది పాలన, సంక్షేమ పథకాలను నమ్ముకున్న కాంగ్రెస్
- నాయకత్వలేమితో ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్
- ఓటమి తర్వాత కేడర్ కు దూరమైన మాజీలు
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. కమ్యూనిస్టు, బీజేపీ, టీడీపీ సహా అన్ని పార్టీలకు ఎంతో కొంత బలమున్నా.. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ఉండనుంది. పైకి ఈ రెండు పార్టీలు ఎలక్షన్లపై ధీమాగా కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం గుబులు పడుతున్నాయి. రెండు పార్టీలకు కొన్ని సానుకూల అంశాలతో పాటు, మరికొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల ఫలితాలను మర్చిపోయి, క్షేత్ర స్థాయిలో మళ్లీ పట్టు నిరూపించుకోవాలని ఒకవైపు బీఆర్ఎస్, సహా విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
అయితే కాంగ్రెస్ మాత్రం మొన్నటి అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకపక్షంగా వచ్చిన ఫలితాలను మరోసారి రిపీట్ చేస్తామని ధీమాగా చెబుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఏడాదిలో చేసిన అభివృద్ధి, కొత్తగా ప్రవేశపెట్టిన స్కీములను గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తెలియజెప్పేలా ప్లాన్ చేస్తోంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా దీనిపై పార్టీ కేడర్ కు సంకేతాలిచ్చారు. ఈనెల 15లోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలక్షన్లపై దృష్టిపెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉండడం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజీగా మారనుంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కేబినెట్ లో ఉండడంతో అన్ని నియోజకవర్గాల్లో తిరుగులేని ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ లీడర్లు ధీమాగా చెబుతున్నారు. ఇక పార్టీ గుర్తుల్లేకుండా కామన్ సింబల్స్‌తో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో గెలిచిన వారు అధికార పార్టీ వైపు చూసే అవకాశం లేకపోలేదు. ప్రధానంగా గత 14 నెలల్లో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను నమ్ముకొని ఎన్నికలకు వెళ్తోంది.
కొత్తగా అమలు చేస్తున్న నాలుగు స్కీములు ఇంకా అన్ని గ్రామాల లబ్దిదారులకు అందకపోవడం, మండలానికి ఒక గ్రామం చొప్పున మాత్రమే ఎంపిక చేయడం వలన ఎటువంటి ప్రభావం ఉంటుందనే ఆందోళన కొంత కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. పైకి అంతా తమ పార్టీకి సానుకూలంగా ఉందని చెబుతున్నా, రూ.2 లక్షలకు పైన ఉన్న రైతుల్లో ఇంకా రుణమాఫీ చాలా మందికి అమలుకాకపోవడంపై లోలోపల మాత్రం గుబులు పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో దారుణ పరిస్థితుల్లో బీఆర్ఎస్
ఇక ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. గత ఏడాదిన్నర క్రితం వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వందల మంది ప్రజా ప్రతినిధులతో బలంగా కనిపించిన ఆ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత బలహీనపడింది. భద్రాచలంలో గెలిచిన ఎమ్మెల్యే వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరగా, మిగిలిన చోట్ల ఓడిన లీడర్లు కూడా చాలా మంది గత ఏడాదిగా కేడర్ తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు తప్పించి మిగిలిన మాజీ ఎమ్మెల్యేలంతా ఎక్కువ శాతం హైదరాబాద్ కే పరిమితమవుతుండడం ఆ పార్టీకి మైనస్ గా మారుతోంది. ఇక నిన్న మొన్నటి వరకు ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు సహా స్థానిక ప్రజా ప్రతినిధుల పదవీ కాలం ముగిసింది. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాత్రమే ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా తమ కేడర్ ఇంకా పార్టీకే కట్టుబడి ఉన్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలనే అస్త్రాలుగా వాడుకుంటామంటున్నారు.
మిగిలిన పార్టీల్లో సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్, టీడీపీ కొన్ని మండలాల్లో ప్రభావం చూపించగలిగే పరిస్థితిలో ఉన్నాయి. అధికార పార్టీ వైఫల్యాలపైనే ఈ పార్టీలన్నీ దృష్టిపెడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నా బీజేపీ అర్బన్ ఏరియాలో తప్పించి, రూరల్ ఏరియాల్లో పట్టులేకపోవడం ఆ పార్టీకి మైనస్. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు పార్టీల కంటే, పోటీలో నిలబడిన వ్యక్తుల కేంద్రంగా జరిగే ఎలక్షన్లు కావడంతో ఫలితాలు ఎలా ఉంటాయనే ఆసక్తి ప్రజల్లో కూడా ఉంది. ఖమ్మం జిల్లాలో 577 పంచాయతీలు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో
481 పంచాయతీలున్నాయి.