
- పెండింగ్ స్థానాల్లో ఖరారు కాని అభ్యర్థులు
- అయోమయంలో పొలిటికల్ లీడర్లు
మెదక్, సంగారెడ్డి, వెలుగు: నామినేషన్ల తేదీ సమీపిస్తున్నప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు సెగ్మెంట్లలో ప్రధాన రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులెవరో ఖరారు కాలేదు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, నారాయణఖేడ్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వాలు తేలలేదు. అలాగే సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థిత్వాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మెదక్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. మిగితా స్థానాల్లో టికెట్లు డిక్లేర్ అయి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా పెండింగ్‌లో ఉన్న స్థానాల్లో ఆశావహులు ఇంకా టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా నర్సాపూర్ స్థానంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. మెదక్ స్థానంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారైనా బీజేపీ అభ్యర్థిత్వం ఇంకా పెండింగ్‌లో ఉంది. మెదక్ బీజేపీ టికెట్ రేసులో పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్థన్ రెడ్డి, తాళ్లపల్లి రాజశేఖర్, నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, సీనియర్ నాయకుడు నందారెడ్డి తదితరులున్నారు. ఫస్ట్ లిస్ట్‌లో ఎవరికి చోటు దక్కలేదు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ షురూ కావడానికి ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉన్నప్పటికీ ఇంత వరకు బీజేపీ అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో అటు ఆశావహుల్లో, ఇటు పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది.
ఆ రెండు పెండింగ్
కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన మొదటి విడతలో సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి (సిట్టింగ్ఎమ్మెల్యే), జహీరాబాద్ నుంచి మాజీ మంత్రి చంద్రశేఖర్, ఆందోల్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహకు టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. రెండో జాబితాలో పటాన్ చెరు, నారాయణఖేడ్ అభ్యర్థులకు చోటు దక్కలేదు. పటాన్ చెరు స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్ కు రెండు రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరిన నీలం మధు మధ్య పోటీ నడుస్తోంది.
ఇక్కడ ముదిరాజ్ కులస్తుల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని అధికార పార్టీకి అల్టిమేటం ఇచ్చిన నీలం మధుపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మధు కాంగ్రెస్ లో చేరడంతో ఆయనకు చాన్స్ దక్కవచ్చని అంటున్నారు. ఇక నారాయణఖేడ్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం సురేశ్ షెట్కార్, పట్లోళ్ల సంజీవరెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరు నేతలు ఖేడ్ లో బలంగా ఉండడం. . ఎవరికి టికెట్ ఇవ్వకపోయినా పార్టీ మారే అవకాశాం ఉండడంతో కాంగ్రెస్ హై కమాండ్ వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండో జాబితాలో నారాయణఖేడ్ అభ్యర్థిని ప్రకటించలేదన్న ప్రచారం జరుగుతోంది.
బీజేపీలో నాలుగు పెండింగే..
పటాన్ చెరు మినహా సంగారెడ్డి జిల్లాలో నాలుగు చోట్ల బీజేపీ క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉంది. బీఆర్ఎస్ ఐదు చోట్ల, కాంగ్రెస్ మూడు చోట్ల తమ అభ్యర్థులను రెండు జాబితాల్లో ప్రకటించగా, బీజేపీ మాత్రం వెనుకబడిపోయింది. సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్లలో క్యాండిడేట్లను ప్రకటించ లేదు. మొదటి జాబితాలో పటాన్ చెరు టికెట్ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కు కేటాయించింది. సంగారెడ్డి నుంచి టికెట్ ఆశిస్తున్న రాజేశ్వర్ రావు దేశ్ పాండే, పులిమామిడి రాజుతో పాటు విఠల్ పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఈ ముగ్గురి మధ్య పోటీ పెరగడంతో ఇక్కడ అభ్యర్థి ఖరారు సమస్యగా మారింది.
ఆందోల్ నుంచి పి.బాబుమోహన్, మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్యతో పాటు ఉదయ్ పేర్లు వినిపిస్తుండగా, బాబుమోహన్ ఆసక్తితో లేనట్టు ఇటీవల ప్రకటించడంతో మిగతా ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. జహీరాబాద్ నుంచి దామోదర్ రామచందర్ తో పాటు ఇటీవల బీజేపీలో చేరిన ఢిల్లీ వసంత్ పేర్లు చర్చకు రాగా పార్టీ హై కమాండ్ ఢిల్లీ వసంత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నారాయణఖేడ్ లో బీజేపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డితో పాటు, సంగప్ప ప్రయత్నిస్తుండగా అభ్యర్థిత్వం విషయంలో హైకమాండ్ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది.