బడ్జెట్ 2025 నుంచి ప్రధాన అంచనాలు..

బడ్జెట్ 2025 నుంచి ప్రధాన అంచనాలు..

బడ్జెట్ 2025-సమర్పణకు కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి పన్నుల మినహాయింపుపై అంచనాలు పెరిగాయి. బడ్జెట్‌కు ముందు అనేక ట్యాక్స్ ఎక్స్ పర్ట్స్,ట్యాక్స్ ఎడ్వయిజరీ సంస్థలు, పరిశ్రమలు యాజమాన్యాలు వేతన జీవులు, మధ్యతరగతి వారికి పన్ను రాయితీలను అందించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. బడ్జెట్ 2025 నుంచి టాప్  అంచనాల జాబితా మీకోసం.. 

మధ్యతరగతి అంచనాలు: 

ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చుల కారణంగా మధ్యతరగతి, వేతన జీవులు బాగా ఒత్తిడికి గురవుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు సరియైన పన్ను రాయితి ఇవ్వడం ద్వారా ఊరట కలిగించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ 2025 లో మధ్యతరగతి ప్రజల మనోవేదనలకు తీర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. 

మధ్యతరగతి ప్రజలకు సహాయపడే అంశాలు.. 

పన్ను స్లాబ్‌ల సవరణ: ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం. 30శాతం  పన్ను రేటు థ్రెషోల్డ్‌ను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం వలన మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుంది.

సెక్షన్ 80C ప్రయోజనాలు: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు పరిమితిని ప్రస్తుతం రూ.1.5 లక్షలకు పరిమితం చేయాలి. దీనిని రెట్టింపు రూ.3 లక్షలకు చేయడం ద్వారా ఎక్కువ పొదుపు ,పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

స్టాండర్డ్ డిడక్షన్: జీతం పొందే వ్యక్తుల కోసం స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50వేల నుంచి రూ.1 లక్షకు పెంచడం వల్ల పన్ను చెల్లింపుదారుల చేతిలో వినియోగ ఆదాయాన్ని ఉంచుతుంది.
చైల్డ్ ఎడ్యుకేషన్,హెల్త్‌కేర్ బెనిఫిట్స్: పిల్లల విద్య ,ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం అదనపు తగ్గింపులను అందించడం మధ్యతరగతి ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను నేరుగా పరిష్కరిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 

జీవిత బీమా మినహాయింపు: ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద జీవిత బీమా, ప్రత్యేకించి టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేకమైన పన్ను మినహాయింపు ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యం నెరవేరే అవకాశం ఉందని అంటున్నారు. పెద్ద జనాభా విభాగానికి ఆర్థిక రక్షణ ,సామాజిక భద్రత విస్తృతం చేయాలని చెబుతున్నారు. ఆ దిశగా బడ్జెట్ 2025 ఉంటుందంటున్నారు. 

హెల్త్ ఇన్సూరెన్స్ మినహాయింపు పరిమితి: కేంద్ర బడ్జెట్ 2025లో 80D రాయితీని పెంచడం.. పెరుగుతున్న ఆరోగ్య పరిరక్షణ, వైద్య ఖర్చుల క్రమంలో హెల్త్ ఇన్సూరెన్స్ పై రూ. 25వేల నుంచి 1లక్ష వరకు ఉన్న ప్రస్తుత రాయితీని రూ. 50వేల నుంచి రూ. 1.50 లక్షలకు పెంచుతారని అంచనా.  

 రూ.4 లక్షలకు హోమ్ లోన్ మినహాయింపు

హౌసింగ్ మార్కెట్ ప్రస్తుత స్థితిని పరిగణనలోకి తీసుకునే ముఖ్యమైన నిబంధనలు సమీక్షించి సవరణలు చేయడం రాబోయే బడ్జెట్ దృష్టి పెట్టాలని డిమాండ్లు వస్తు్న్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో హౌజింగ్ లోన్ వడ్డీకి ఉన్న ఆదాయం పన్ను మినహాయింపు రూ. 2లక్షల నుంచి రూ. 4లక్షలకు పెంచితే మధ్యతరగతి, వేతన జీవులపై భారం తగ్గుతుందనిఅంటున్నారు.