భారీ వర్షాలు.. బురదల్లో చిక్కుకున్న యంత్రాలు.. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం నెలకొంది. మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లలోని నాలుగు ఓపెన్ కాస్ట్ లలో, శ్రీరాంపూర్,ఇందారం,రామక్రిష్ణపూర్, కళ్యాణి  నాలుగు ఓపెన్ కాస్ట్ గనులలో రోజుకు 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఓపెన్ కాస్ట్ క్వారీలలోకి వర్షపు నీరు చేరడంతో మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. 

మరోవైపు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని 4  ఓసీపీలలో రోజుకు 40 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. క్వారీల్లో వర్షపు నీరు చేరడంతో రహదారులు మొత్తం బురద మయం అయ్యాయి. దీంతో భారీ యంత్రాలు కదలకుండా స్తంభించిపోయాయి.  రామగిరి మండలం ఆర్ జి త్రీ పరిధిలోని ఓసీపీటు, ఓసీపీత్రీలలో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

Also Read :- దంచికొడుతున్న వానలు

ఓబి మట్టి తవ్వకాలలో అంతరాయం ఏర్పడటంతో రోజుకు 12 టన్నుల బొగ్గు మాత్రమే వెలికితీతలు జరుగుతున్నాయి. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ వానలు జోరుగా కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ఓపెన్ కాస్ట మైనింగ్స్ లో వర్షపు నీరు వచ్చి చేరడంతో బొగ్గు వెలికితీత పనుల్లో అంతరాయం ఏర్పడింది.