
వరంగల్: ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా హనుమకొండ-కరీంనగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హసన్ పర్తి పెద్ద చెరువు మూల క్రాసింగ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టూవీలర్ను టిప్పర్ లారీ ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో దుర్గం పవన్, పౌతు మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. హసన్ పర్తి నుంచి సీతంపేటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
హసన్ పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. సెల్ప్మిస్టేక్స్తో పాటు ఇతర కారణాల వల్ల యాక్సిడెంట్లు జరుగుతుండగా ఏటా వందల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. నేషనల్ హైవే-563లోని వరంగల్- కరీంనగర్ మార్గంలో ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.
హసన్ పర్తి నుంచి ఎల్కతుర్తి వరకు గతంలో కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరగగా అప్పటి అధికారులు ప్రమాదకరంగా ఉన్న తొమ్మిది మూలమలుపులను గుర్తించారు. ఆయా చోట్లా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కాలక్రమేణా బోర్డులు తొలగిపోగా.. ఆ తరువాత ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో ఈ మార్గంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
సూర్యాపేట జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. చివ్వెంల బీబీ గూడెం దగ్గర కారును బస్సు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొని భార్యాభర్త, 8 ఏళ్ల పాప ప్రాణాలు కోల్పోవడం పెను విషాదాన్ని నింపింది. చనిపోయిన వారిని గడ్డం రవీందర్, రేణుక, రితికగా గుర్తించారు. గాయాలైన వారిని స్థానిక ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనలో చనిపోయిన ఫ్యామిలీ సొంతూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం అని పోలీసులు తెలిపారు.