- గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో తగ్గిన డిపాజిట్ల గ్రోత్
- షార్ట్ టెర్మ్‌లో నెమ్మదించనున్న బ్యాంకుల క్రెడిట్ గ్రోత్: ఎస్‌బీఐ రిపోర్ట్
న్యూఢిల్లీ: బ్యాంకుల దగ్గరున్న మొత్తం టర్మ్ డిపాజిట్లలో సగం వాటా సీనియర్ సిటిజన్లకు చెందినవని ఎస్‌బీఐ ఎకనామిస్ట్‌లు పేర్కొన్నారు. యువత ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అసెట్స్ వైపు చూస్తున్నారని అన్నారు. డిపాజిట్లకు సంబంధించి ట్యాక్స్ విధానాల్లో మార్పు రావాలని, అప్పుడే బ్యాంకులు క్రెడిట్ గ్రోత్ మరింతగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎస్‌బీఐ రిపోర్ట్ ప్రకారం, 2021–22 ఆర్థిక సంవత్సరం తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.61 లక్షల కోట్లు పెరిగాయి.
ఇదే టైమ్‌లో బ్యాంకులిచ్చిన అప్పులు రూ.59 లక్షల కోట్లుగా ఉన్నాయి. అప్పుల గ్రోత్‌కు తగ్గట్టు డిపాజిట్ల గ్రోత్ లేదనడం అవాస్తవం. బ్యాంకులిస్తున్న అప్పులు పెరుగుతున్నంత వేగంగా ఇవి సేకరించే డిపాజిట్లు పెరగడం లేదని గత ఏడాది కాలంగా ఆందోళనలు పెరిగాయి. దీంతో బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించడానికి వడ్డీని పెంచుతున్నాయి. ఫలితంగా వీటి లాభాలు తగ్గే ఛాన్స్ ఉంది. 2022–23, 2023–24 లో మాత్రం అప్పులు పెరిగినంతగా, డిపాజిట్లు పెరగలేదని ఎస్‌బీఐ రిపోర్ట్ పేర్కొంది.
డిపాజిట్లు రూ.24.3 లక్షల కోట్లు పెరిగితే, బ్యాంకులు రూ.27.5 లక్షల కోట్ల అప్పులిచ్చాయి. వరుసగా 26వ నెలలోనూ బ్యాంకుల డిపాజిట్ల గ్రోత్ నెమ్మదిగా ఉందని ఎస్‌బీఐ రిపోర్ట్ పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ – అక్టోబర్ నాటికి క్రెడిట్ గ్రోత్ నెమ్మదిస్తుందని అంచనా వేసింది. అంతేకాకుండా కొత్త రూల్స్‌తో బ్యాంకులు లిక్విడిటీ నిల్వలను పెంచాల్సి ఉంటుంది. దీంతో షార్ట్ టెర్మ్‌లో క్రెడిట్ గ్రోత్ తగ్గే ఛాన్స్ ఉందని పేర్కొంది.