మోసాలకు.. బాధితులూ బాధ్యులే .. జీనియస్ కన్సల్టెంట్స్ సర్వేలో వెల్లడి

 మోసాలకు.. బాధితులూ బాధ్యులే .. జీనియస్ కన్సల్టెంట్స్ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: ఉద్యోగ స్కామ్‌‌‌‌‌‌‌‌ల బారిన పడటానికి అభ్యర్థులు పాక్షికంగా బాధ్యులని మెజారిటీ ఉద్యోగులు భావిస్తున్నారు. డబ్బు చెల్లించడానికి ముందు వీళ్లు కంపెనీ వివరాలను పూర్తిగా తెలుసుకోకపోవడంతో మోసపోతున్నారని ఒక సర్వేలో తేలింది. అందుకే బాధితులే పాక్షికంగా బాధ్యులు అవుతున్నారని 75 శాతం మంది రెస్పాండెంట్లు తెలిపారు. దళారులు ఇచ్చిన వివరాల్లోని నిజానిజాలు తెలుసుకోవడం లేదని, సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తున్నారని విమర్శించారు.

ఉద్యోగం కోసం ప్రయత్నించేవారిలో చాలా మంది తమ యజమానులు లేదా రిక్రూటర్ల మోసాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని జీనియస్ కన్సల్టెంట్స్ నివేదిక తెలిపింది. ఈ సంస్థ ఎఫ్​ఎంసీజీ, టెక్నాలజీ, మానుఫ్యాక్చరింగ్, టెలికాం, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, బీఎఫ్​ఎస్​ఐ సహా పలు సెక్టార్లలోని 1,427 మంది ఉద్యోగులతో సర్వే చేసిన రిపోర్టును తయారు చేసింది. ఇటువంటి మోసాలను అరికట్టడానికి ప్రభుత్వాలు తీవ్రమైన చర్యలు తీసుకున్నాయని 28 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పగా, తగినంత ప్రయత్నాలు జరగలేదని 55 శాతం మంది అన్నారు. 

 జాబ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ను తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే స్కామర్లు ఎక్కువగా ఉద్యోగ మోసాలకు పాల్పడుతున్నారని 87 శాతం మంది రెస్పాండెంట్లు  చెప్పారు.    దాదాపు 70 శాతం మంది ఫేక్ జాబ్ పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లను ఎదుర్కొన్నారని చెప్పగా, లేని పోస్టులకు దరఖాస్తు చేసుకునేలా ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టించారని మరికొందరు తెలిపారు. 26 శాతం మంది తమను రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజెన్సీలు మోసం చేశాయని వెల్లడించారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు దండుకున్నారని, సున్నిత సమాచారం అడిగారని మూడుశాతం మంది బాధితులు పేర్కొన్నారు.