- ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్‌లోని మెజారిటీ ఇంట్రాడే ట్రేడర్లకు నష్టాలే
- వెల్లడించిన సెబీ స్టడీ
ముంబై: 2022-–23ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్‌లోని ప్రతి 10 మంది వ్యక్తిగత ఇంట్రా-డే ట్రేడర్‌లలో ఏడుగురు నష్టపోయారని సెబీ స్టడీ వెల్లడించింది. 2018–-19తో పోలిస్తే 2022–-23లో ఈక్విటీ క్యాష్ విభాగంలో ఇంట్రాడే ట్రేడింగ్‌లో పాల్గొనే వ్యక్తుల సంఖ్య 300 శాతానికిపైగా పెరిగింది. లాభం సంపాదించిన వారి కంటే నష్టపోయిన సగటు ట్రేడ్ల సంఖ్య ఎక్కువగా ఉంది.
సెబీ రిపోర్ట్ప్రకారం.. 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇంట్రా-డే ట్రేడర్ల వాటా ఈ కాలంలో గణనీయంగా పెరిగింది. ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్‌లో ట్రేడింగ్ చేసే ముగ్గురిలో ఒకరు ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తారని వెల్లడయింది. అంతేకాకుండా, 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న యువ ఇంట్రాడే వ్యాపారుల వాటా 2018–-19లో 18 శాతంతో పోలిస్తే 2022-–23లో 48 శాతానికి పెరిగింది.
తరచూ ట్రేడింగ్చేసేవారిలో నష్టపోయే వారి నిష్పత్తి 80 శాతానికి పెరిగింది. ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్లో షేర్లను నగదు లావాదేవీల ద్వారా కొనుగోలు చేసి అమ్ముతారు. ఈ విభాగంలో డెలివరీ ట్రేడింగ్ అని పిలిచే ఫిజికల్ షేర్ల డెలివరీ ఉండదు. లావాదేవీలు నగదు చెల్లింపుల ద్వారా పూర్తవుతాయి.