సంక్రాంతి అంటే సంక్రమణం. క్రాంతి అంటే వెలుగు. సంక్రాంతి అంటే కొత్త వెలుగు అనే అర్థాలతో మన పూర్వీకులు సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టతను చేకూర్చారు. సంక్రాంతి పండుగను వ్యవసాయ పండుగ, రైతుల పండుగగా పేర్కొంటారు. సంక్రాంతి నాటికి రైతులు పండించే పంటలు ఇంటికిచేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి ప్రీతికరమైన పండుగ. సంవత్సర కాలంలో సూర్యుడు 12 రాశులలో నెలకు ఒకరాశి చొప్పున సంచరిస్తాడని ఖగోళ శాస్త్రం చెబుతోంది. ఇలా సంచరించే సమయాన సూర్యుడు జనవరిలో మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు.
ఉత్తరాయణ కాలాన్ని పవిత్రమైన కాలంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే సూర్యుడు దక్షిణాయణకాలం ముగించుకొని ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు. ఇది సంక్రాంతి రోజునే ప్రారంభమౌతుంది. కనుక ఇది ఉత్తరాయణ పుణ్యకాలం అని పెద్దలు నిర్ణయించారు. అందుకనే మహాభారత యుద్ధంలో భీష్ముడు అంపశయ్యపై ఉండి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే నిర్యాణం చెంది కైవల్య ప్రాప్తిని పొందాడని మహాభారతం చెబుతోంది. సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ముత్యాల ముగ్గులు. హరిదాసుల సంకీర్తనలు. సంక్రాంతి పండుగను వరుసగా మూడురోజులు జరుపుకుంటారు.
మొదటి రోజు భోగి అనంతరం రెండోరోజు సంక్రాంతి, మూడోరోజు కనుమ (పశువుల పండుగ). కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజును కూడా ముక్కనుమ పండుగగా జరుపుకుంటారు. హరిదాసుల నగర సంకీర్తనలు ప్రజల్ని భగవంతుడిపై భక్తి పారవశ్యంలోకి తీసుకెళతాయి. నెత్తి మీద కలశం. భుజం మీద తుంబుర, మరో చేతిలో చిడతలు, జబ్బలకు, చేతులకు ఊర్ద్వ పుండ్రాలు ధరించి వీధివీధి తిరుగుతూ ‘రావమ్మా మహాలక్ష్మి రావమ్మా...’ అంటూ సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ సంకీర్తనలు పాడుతూ ప్రతి ఇంటిముందు ఆగుతూ వారిచ్చిన భిక్షను స్వీకరిస్తూ ‘కృష్ణార్పణం’ అంటారు హరిదాసులు, అలాగే. గంగిరెద్దులవారి సన్నాయి మేళాలు, కొమ్ము దాసరులు, జంగమ దేవరలు, బుడబుక్కల వారు తమ కళారూపాలతో సంక్రాంతి పండుగకు గ్రామ గ్రామాన అలరిస్తూ శోభాయమానం కలిగిస్తూ వినోదాన్ని పంచుతారు.
సంక్రాంతి సంబురాలు
సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఎడ్ల పందాలు, బరువు లాగుడు పందాలు, కోడిపందాలు, కబడ్డీ క్రీడలు, పతంగులు ఎగురవేయడంలాంటి సంబరాల్లో మునిగిపోతారు. ఇక ప్రతి ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు అతిథులను ఆహ్వానిస్తుంటాయి. ముగ్గుల మధ్యలో గొబ్బిళ్ళను అలంకరిస్తారు. వాటిపై గుమ్మడి, బంతి, చేమంతి, తంగేడు వంటి పూలను ఉంచి అలాగే నవ ధాన్యాలను పోసి పూజలు చేస్తారు. కాగా, నెల రోజులపాటు ఇంటిముందు వేసే ముగ్గుల్లో చివరి రోజు రథంముగ్గును వేస్తారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రకరకాల పిండివంటలు చేస్తారు.
ముఖ్యంగా చకినాలు, చకోడీలు, అరిసెలు, నువ్వుల గారెలు, అప్పాలు చేస్తారు. వంటకాల్లో నువ్వులు ఎక్కువగా వాడతారు. అలాగే నువ్వుల పులగం (పాయసం) చేసి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యంగా పెట్టిన అనంతరం ఆరగిస్తారు. మూడో రోజు కనుమ పండుగ జరుపుకుంటారు. కనుమ అంటే పశువు అని అర్థం. అంటే, ప్రధానంగా పశువులను ఆరాధించే రోజు. ఏరువాకతో జీవనాధారమైన గోవుల సంతతి అయిన పశువులను పూజించడం ఆచారం. కనుమ రోజు పశువులు ఉండే పాకలను శుభ్రం చేస్తారు. అలాగే పశువులకు స్నానం చేయించి వాటి కొమ్ములకు పసుపు, కుంకుమలు రాసి, నొసట బొట్టు పెట్టి అందమైన బంతిపూల మాలతో అలంకరించి ఆరాధిస్తారు.
దేశవ్యాప్తంగా ఉత్సవాలు
సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ప్రజలు వారి సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి ఉత్సవాలు జరుపుకుంటారు. కేరళలో ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలోని అయ్యప్ప దేవాలయం సమీపంలో ఉన్న పొన్నంబలమేడు కొండమీద మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామిని మకరజ్యోతి రూపంలో దర్శించుకొని భక్తులు తరిస్తారు. గుజరాత్‌లో ‘సిదా...మనానా’పేరుతో అలాగే ‘వాసి ఉత్తరాయణం’ పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతి కుటుంబంలోని సోదరుడు తన అక్కా, చెల్లెళ్లను పిలిచి కొత్త వస్త్రాలను బహూకరిస్తాడు. ఈ సంప్రదాయాన్ని వాళ్లు ‘సిదా’ అంటారు. అలాగే, మహిళలు తమ అత్త, మామలకు కానుకలు ఇస్తారు. దీన్ని ‘మనానా’ అని పిలుస్తారు.
పంజాబ్ రాష్ట్రంలో మకర సంక్రాంతిని ‘మాంగి’ అని పిలుస్తారు. రాజస్థాన్లో సంక్రాంతి పండుగను ‘భోజ్’ అంటారు. తమిళనాడులో ఈ పండుగను పొంగల్ (థోయ్,మట్టు) అంటారు. అస్సాంలో ‘మాగ్ బిహు’ లేదా ‘భోగాలి బిహు’ అంటారు. గోవాలో మహిళలు సంక్రాంతిరోజు హల్దీ, కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ పండుగను ‘కిచెరి’ అంటారు. ఒడిశాలో మకరచౌలా అంటారు. సంక్రాంతి పండుగ నాడు కోణార్మ్‌లోని ప్రసిద్ధ సూర్య దేవాలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బెంగాల్లో ‘పౌష్ సంక్రాంతి’, బిహార్, జార్ఖండ్ రాష్ర్టాల్లో ‘సాక్రాత్’ అంటారు. అస్సాంలో ‘సుగి’ లేదా రైతుల పండుగగా నిర్వహిస్తారు. పండుగ నాడు ఆవులను అలంకరిస్తారు. ఈ పూజా విధానాన్ని కించు హాయ్ శివుడు అని అంటారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ర్టాల్లో సంక్రాంతి పండుగను వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున జరుపుకోవడం వల్ల భారతీయ పండుగల్లో సంక్రాంతి పెద్ద పండుగగా ఆచరిస్తారు.
తాళ్లపల్లి యాదగిరిగౌడ్,
సీనియర్ జర్నలిస్ట్