మకర సంక్రాంతి ఫలితాలు.. పండగ రోజు ఇలా చేస్తే మంచి జరుగుతుంది

మకర సంక్రాంతి ఫలితాలు.. పండగ రోజు ఇలా చేస్తే మంచి జరుగుతుంది

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్యమాస బహుళ ఏకాదశి బుధవారం అనురాధ నక్షత్రం సింహలగ్న సమయంలో తేది 14.01.2026 రా. 8.45 ని.లకు గండ యోగంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించును. రాత్రి ప్రవేశం కావున మరునాడు 15.01.2026 గురువారం సంక్రాంతి పండుగ. మకర సంక్రాంతి ఉదయం నుండి మ. 1.00 వరకు పుణ్యకాలం.

ఈ సంక్రాంతి పురుషుడు మంద నామదేయంతో వరాహ వాహనం పైన ఎక్కి ప్రయాణం చేయుట వలన శాస్త్ర సాంప్రదాయాలు పాటించుటలో ప్రజలు విఫలమవ్వగలరు. మంద నామదేయం వలన రాజులకు అరిష్టము. కుంకమోదక స్నానం వలన స్త్రీలకు అరిష్టము. చణకాక్షత దారణము వలన మెట్ట పంటలకు అరిష్టము. రక్త వస్త్రం ధరించుట వలన యుద్ధభయం.

చందనం ధరించుట వలన ఆరోగ్యము బాగుంటుంది. జాజి పువ్వు ధరించుట వలన కీర్తిప్రతిష్ఠలు బాగుంటాయి. నీలధారణ వలన క్షేమము. వెండి పల్లెంలో భోజనం చేయుట వలన దుర్భిక్షం. అరటి పండు తినుట వలన ఆరోగ్యము. వరాహం (పంది) వాహనం అగుట వలన అడివి మృగములకు ప్రాణ నష్టము. వాలాయుధం ధరించుట వలన రాజులకు అరిష్టం. రక్తచ్చత్రం ధరించుట వలన యుద్ధభయం. ఖడ్గధారణ వలన దక్షిణ దేశ ప్రజలకు అరిష్టం.

క్రోద ముఖం వలన ప్రజలకు కీడు. కూర్చుని ప్రయాణం చేయుట వలన అనుకూలం. కృష్ణపక్షం అగుట వలన క్షేమం. బుధవారం అగుట వలన శుభం. అనురాధ నక్షత్రం వలన గోవులకు అనేకరకాల వ్యాధులు రాగలవు. పుష్యమాసము వలన శుభ ఫలితములు. సంక్రాంతి పండుగ రోజు స్వయంపాకం, బూడిద గుమ్మడికాయ ఆకుకూరలు, పచ్చని కూరగాయలు దానం దక్షిణ తాంబూలంతో పూజారికి ఇవ్వండి.

ఇంకా శక్తి కలవారు వస్త్రములు, వెండి, బంగారం, గోదానం, భూదానం ఇవ్వటం వలన పిల్లల వివాహం, విద్యార్థులకు విద్య, వ్యాపారులకు అనుకూలత. ప్రతి ఒక్కరికి ఆరోగ్య భోగభాగ్యాలు కలగాలని గాయత్రి మాతను ప్రార్థిస్తున్నాము.