శబరిమలలోనే కాదు.. మన కోదాడలోనూ మకర జ్యోతి దర్శనం..

ఏటా 70 రోజుల పాటు అన్నదానం చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు. అంతేనా.. శబరిమలలోలాగా ఇక్కడ కూడా మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఇందుకోసం 108 క్వింటాళ్ల కర్పూరం ఉపయోగిస్తారట. సూర్యాపేట జిల్లా కోదాడలో అయ్యప్ప ఆలయం రెండెకరాల్లో ఉంది. దీన్ని భక్తులంతా కలిసి కట్టించారు. 2003లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకు అంటే పదిహేనేళ్లుగా నిత్య పూజలు చేస్తున్నారు. కార్తీక మాసంలో ప్రతి రోజు వేలమంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. ఇక్కడ ఏటా సంక్రాంతికి వైభవంగా వేడుకలు చేస్తారు.

శబరిమలలోలాగే మకరజ్యోతి దర్శనం కూడా ఉంటుంది. ఇందుకోసం 108 క్వింటాళ్ల కర్పూరాన్ని ఉపయోగిస్తారు. జ్యోతి దర్శనం తర్వాత స్వామిని వెన్నతో అలంకరిస్తారు. అంతేకాకుండా ఏటా మండల పూజ కూడా చేస్తారు. విశేషం ఏంటంటే.. మండల పూజ పూర్తిగా కేరళ సంప్రదాయం, శబరిమల ఆచారాలకు అనుగుణంగా ఉంటుంది. అంతేకా కుండా అయ్యప్ప స్వామి పుట్టినరోజు, ఇతర పర్వదినాల్లో వేడుకలు చేస్తారు.

ఆలయంలో వినాయక, నాగేంద్రస్వామి, మాలికాపురత్తమ్మ విగ్రహాలున్నాయి. దేశంలో అయ్యప్ప స్వామి దీక్షపై ప్రచారం చేసిన విమోచనానంద స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ. అయ్యప్ప నామాలతో కూడిన శరణుకోటి స్థూపాలనూ ఏర్పాటు చేశారు. ఆలయ సమీపంలో ఆవులను పెంచుతున్నారు. 'ప్రతిరోజూ అన్న దానం చేయాలన్నదే తమ సంకల్పమ'ని ఆలయ కమిటీ తెలిపింది.