గురువు 22.03.2023 నుంచి 21.04.2023 వరకు మిశ్రమ ఫలితాలు. తదుపరి 08.04.2024 ఉగాది వరకు చతుర్ధ మందు లోహమూర్తిగా సంచారం. శని 22.03.2023 నుంచి 08.04.2024 వరకు ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం. రాహువు 22.03.2023 నుంచి 30.10.2023 వరకు చతుర్ధంలోనూ తదుపరి ఉగాది వరకు రజితమూర్తిగా సంచారం. కేతువు 30.10.2023 నుంచి తదుపరి ఉగాది వరకు నవమంలో లోహామూర్తిగా సంచారం.
ఈ రాశి స్త్రీ పురుషులకు చాలా అనుకూలం. ప్రతి విషయంలో బాధ్యతగా ఉండాలి. అధికారుల ఒత్తిడి ఉంటుంది. అనేక విధాలుగా ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వాటిని లౌక్యంగా తొలగించుకోవాలి. రైతు సోదరులకు ఆదాయం కనిపించాలనుకుంటే ముహుర్తం, తిథి, వారం, నక్షత్రం ప్రకారం అరక దున్నండి. వివాహ శుభకార్యములకు సరైన సమయం. భూములు, ఫ్లాట్స్, వస్తు, వాహన యోగములు కలిగి ఉంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగం చేసేవారికి అనుకూలం. డాక్టర్లకు, లాయర్లకు అధిక ఆదాయం. కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే కాలం. రాజకీయ నాయకులకు సమాజంలో అందరితో కలిసి కలుపుగోలుగా ఉండటం, అన్ని సంఘాలు, వర్గాలకు అనుకూలంగా ఉండుట వల్ల వారికి అనుకూలంగా ఉంటుంది. వెండి, బంగారం, కాపర్, స్టీల్, సిమెంట్, టింబర్ ధరలు నిలకడగా ఉండవు. చిన్న పరిశ్రమల వారికి అనుకూలం. పెద్ద పరిశ్రమల వారికి కూడా ఆదాయ వనరులు సంతృప్తికరంగా ఉంటాయి. పాడి పరిశ్రమలు, మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీ వారికి ఆదాయ వనరులు బాగుంటాయి. చిట్స్, ఫైనాన్స్, షేర్లు సామాన్యం. నూతన పెట్టుబడులకు ఇది మంచి సమయం. కార్యసాధన మొదలుపెట్టేటప్పుడు శుభ ముహుర్తం చూసుకోండి. ముహుర్త బలంతో ముందుకు సాగండి. కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అనవసర విషయాల్లో తల దూర్చొద్దు. తల్లిదండ్రుల విషయంలో చాలా నియమాలు కలిగి నడుచుకోవాలి. జీవితంలో అనేక మార్పులు వచ్చి, ముందుకు దూసుకుపోతారు. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉన్నారా.. మీ సంపద అంతా గాలిలో కలిసిపోతుంది. సంపద ఎలాగైతే పెరుగుతుందో, అదే విధంగా కర్పూరంలా కరిగిపోతుంది. రాహు గ్రహం వల్ల స్థాన చలనం, అనారోగ్యంతో పాటు కొన్ని ఇబ్బందులు వస్తాయి. మానసిక సమస్యలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కోర్టు విషయాలకు సంబంధించి రాజీ మార్గానికి అవకాశాలు ఉన్నాయి. ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా.. వారికి గ్రహలు అనుకూలంగా లేకపోతే కిందకి దిగిరాక తప్పదు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు జాతి కెంపు ధరించాలి. ఆదిత్య పారాయణం, అష్టోత్తర స్తోత్రాలు, సూర్య నమస్కారాలు, సూర్య దండకం చదవాలి. శ్రావణ నక్షత్రం వారు జాతి ముత్యం ధరించాలి. దుర్గాదేవి అష్టోత్తర సహస్ర నామాలు పఠించాలి. అమ్మవారికి కుంకుమ పూజలు తప్పనిసరిగా చేయండి. చంద్రపూజా ఫలదీపికలు శివాలయంలో పంచాలి. వాటిని తీసుకున్న వారు చదివినందు వల్ల అందులో పేరు వస్తుంది. మీకు ఎలా అంత మంచి పేరు వస్తుందో చాలామందికి అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో తెలియకుండా డిప్రెషన్‌కు గురవుతారు. ధనిష్ట నక్షత్రం వారు జాతి పగడం ధరించగలరు. ప్రతి మంగళవారం కందులు 450 గ్రాములు నానబెట్టి ఎరుపు గోవుకు దానాగా పెట్టండి. శ్రీ సుబ్రమణ్యేశ్వర పూజా ఫలదీపికలు సికింద్రాబాద్‌లోని స్కందగిరి టెంపుల్లో పంచండి. సంతానం లేని వారికి సంతానం కలుగును. భార్యాభర్తల మధ్య దోషాలు తొలగి, ఆనందంగా ఉంటారు. అదృష్ట సంఖ్య 8.
మకర రాశి మాస ఫలితాలు
చైత్ర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలం. ఆదాయ వనరులకు లోటు ఉండదు. మానసిక ఒత్తిడి. వాహన, గృహ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో కొంత వ్యతిరేకత. తక్కువగా మాట్లాడాలి. నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు చేయడం మంచిది.
వైశాఖ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు విందు వినోదాలు, బంధుమిత్రుల కలయికతో ఆనందంగా ఉంటారు. ప్రతి విషయంలో అనుకూలంగా ఉండటం వల్ల ఆకస్మిక ధన లాభం. తొందరపాటు వల్ల ఉద్రేకానికి లోను కాకూడదు. మీ ఆర్భాటం చూసి చాలామంది అసూయ పడతారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి.
జ్యేష్ఠ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు దూర ప్రయాణాలు కలిసి రావు. జాగ్రత్తగా శకునం చూసి, బయటకు బయలుదేరాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవరికీ ఎలాంటి హామీ ఉండొద్దు. జాయింట్ వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. గృహంలో నిత్యదీపారాధన వల్ల శాంతి కలుగుతుంది.
ఆషాఢ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు వాయిదా వేయటం మంచిది. అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేసి, కొన్ని పనులు ప్రారంభించాలి. మహాన్యాస రుద్రాభిషేకం చేయండి.
అధిక శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి. వాయిదా వేయుట మంచిది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు ఆపడం చాలా కష్టం. కానీ, ఏ విధంగా చేస్తే ఖర్చులు తగ్గుతాయో ఆలోచించాలి. దక్షిణామూర్తికి, దుర్గాదేవీకి పూజలు చేయండి.
నిజ శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలం. ఎలాంటి సమస్యనైనా అమ్మ అనుగ్రహంతో సామరస్యంగా పరిష్కరించుకోగలరు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఆనందం. రాజీ మార్గంలో అన్నీ శుభాలే. అమ్మవారి పూజలతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
భాద్రపద మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలం. ప్రధానంగా వినాయకుడికి పూజలు చేసిన తర్వాత లక్ష్మీవిఘ్నేశ్వర హోమం చేయండి. శత్రుశేషం ఉంది. సుదర్శన హోమం చేస్తే ఆర్థికంగా శక్తిమంతులు అవుతారు. అనుమానంతో ఏ పనిచేసినా ఫలితం ఉండదు.
ఆశ్వయుజ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ఆకస్మిక ధనలాభం ఉన్నది. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించండి. పెండింగ్‌లో ఉన్న ప్రతి పని నెరవేరుతుంది. రాజీ మార్గంతో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలోచన చేయండి.
కార్తీక మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. తొందరపాటు లేకుండా కార్యదీక్షతో ఆ పార్వతీ పరమేశ్వరుల దయతో పూర్తి చేసుకోగలరు. ఆకస్మిక నిర్ణయాలు కాకుండా జాగ్రత్తగా ఆలోచన చేసి, నిర్ణయాలు తీసుకోండి. ఈ నవరాత్రుల పూజలాగా ఒక కళ్యాణం చేయండి.
మార్గశిర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సాధారణం. ఆదాయం ఉంది. ప్రతి విషయం నిదానంగా పూర్తవుతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. చక్కటి ఫలితాలు. దూర ప్రయాణాల్లో అనుకూలంగా ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి.
పుష్య మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు విందువినోదాలతో పాటు బంధు మిత్రుల కలయికతో అంతా పండుగ వాతావరణంలా ఆనందంగా ఉంటారు. కాలక్షేపానికి సరైన సమయం. శివారాధనతో పాటు శివాలయ ప్రదక్షిణాలు చేయడం వల్ల ఆకస్మిక ధనాదాయం ఉంటుంది.
మాఘ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కావాల్సిన ధనం సమకూరుతుంది. ఆర్భాటాలకు ఇది సమయం కాదు. పొదుపు గురించి ఆలోచన చేయండి. అనుకున్న పనులు కరెక్ట్ సమయానికి పూర్తి చేయలేకపోతే, అన్ని సమస్యలు ఒకేసారి మీద పడే అవకాశం ఉంది. సత్యదేవుడి వ్రతం చేయండి. ఆనందంగా ఉంటారు.
ఫాల్గుణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రతి విషయం ఆలస్యంగా జరుగును. అన్ని విషయాల్లో ఇప్పటిదాకా అనుకూలంగా ఉంటుంది. కానీ, ఇప్పుడు అలా ఉండదు. ప్రతి పని చాలా నెమ్మదిగా పూర్తవుతుంది. తల్లికి అనారోగ్య సమస్యలు.