జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని మకావ్ పబ్ ని సీజ్ చేసిన అధికారులు గంటల వ్యవధిలోనే రీ ఓపెన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైర్ సేఫ్టీ, సెట్ బ్యాక్ లేదన్న కారణంతో జీహెచ్ఎంసీ అధికారులు ఉదయం పబ్ను మూసివేశారు. ఫైర్ ఎన్ఓసీ గడువు ముగిసినా యాజమాన్యం పట్టించుకోలేదని, జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులకు సైతం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు. అయితే ఉదయం పబ్ ను మూసివేసిన అధికారులు మధ్యాహ్నం 1:30కు దాన్ని రీ ఓపెన్ చేశారు. సర్కారీ పెద్దల ఒత్తిడితోనే పబ్ తాళాలు తీశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే ఫైర్ ఎన్ఓసీ లేనందునే జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారని మకావ్ పబ్ ఓనర్ తనుజ్ చెప్పారు. ఎన్ఓసీ ఫార్మాలిటీస్ క్లియర్ చేయడంతో అధికారులు పబ్ను మళ్లీ రీఓపెన్ చేశారని అన్నారు. సెట్ బ్యాక్ లేదన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, అన్ని రూల్స్ పాటిస్తూ పబ్ నడుపుతున్నామని స్పష్టం చేశారు.