గణేశుడికి నైవేద్యం చేయండిలా

బొజ్జ గణపయ్య భోజన ప్రియుడు. అందుకే ఈ రోజు ప్రతి ఇంట్లో ఆయనకి ఇష్టమైన ఉండ్రాళ్లు, మోదకాలు, పాయసం కనిపిస్తాయి. అయితే గణేశుడి పుట్టినరోజుని తియ్యదనంతో నింపే ఈ వంటకాలను ఆరోగ్యానికి కూడా మేలు చేసేలా ఇలా చేసుకుంటే బాగుంటుంది. 

కొబ్బరి పూర్ణం ఉండ్రాళ్లు

కావాల్సినవి

బియ్యప్పిండి– ఒక కప్పు
మైదా– అర టేబుల్​ స్పూన్​
నీళ్లు– రెండు కప్పులు
ఉప్పు– సరిపడా
పచ్చి కొబ్బరి పొడి– రెండు కప్పులు
చక్కెర– ఒక కప్పు
బెల్లం తురుము– ఒక కప్పు
యాలకుల పొడి– అర టీ స్పూన్​
నెయ్యి– అర టేబుల్ స్పూన్​

తయారీ

వెడల్పాటి పాన్​లో నెయ్యి కరిగించి, పచ్చి కొబ్బరి, బెల్లం తురుము, చక్కెర వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం  దగ్గరపడ్డాక చిటికెడు ఉప్పు, యాలకుల పొడి వేసి, కొద్దిగా నీళ్లు పోసి బాగా  కలపాలి.  ఆ మిశ్రమాన్ని ఓ మాదిరి మంటమీద ముదురు గోధుమ రంగు వచ్చేవరకు వేగించి, చల్లార్చాలి.  తర్వాత చిన్న సైజు ఉండలు చేయాలి.  మరో పాన్​లో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. రెండు నిమిషాల తర్వాత సరిపడా ఉప్పు, చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర పూర్తిగా కరిగాక బియ్యప్పిండి, మైదా వేసి ఉండలు కట్టకుండా బాగా కలిపి, స్టవ్​ ఆపేయాలి. చల్లారాక ఆ మిశ్రమాన్ని పూరీ  పిండి ముద్దలా చేసి పక్కనపెట్టాలి. చేతికి వెన్న లేదా నెయ్యి రాసుకుని పిండి ముద్దలో  కొంచెం పిండి తీసుకుని  చిన్న సైజు గారెలా చేయాలి.  దాని మధ్యలో కొబ్బరి ఉండ పెట్టి చివర్లు మూసేసి లడ్డులా చుట్టాలి.  పిండంతా ఉండలు చేయడం  అయ్యాక నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్​లో  ఓ మాదిరి మంట మీద కాసేపు ఉడికిస్తే పూర్ణం ఉండ్రాళ్లు రెడీ. 

డ్రై ఫ్రూట్​ మోదక్​

కావాల్సినవి

ఖర్జూరం(తాజా)– వంద గ్రాములు
బాదం, వాల్​నట్స్​– ఒక్కోటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున
జీడిపప్పు, కిస్​మిస్​–  ఒక్కోటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున
కొబ్బరి పొడి– ఇరవై ఐదు గ్రాములు
గసగసాలు– ఏడున్నర గ్రాములు
నెయ్యి– ఏడు గ్రాములు

తయారీ

పాన్​లో నెయ్యి కరిగించి బాదం, జీడిపప్పు, కిస్​మిస్​, వాల్​నట్స్​ని విడివిడిగా వేగించాలి. వాటన్నింటినీ పలుకులుగా దంచి గిన్నెలోకి తీయాలి. ఖర్జూర విత్తనాలు తీసేసి మిక్సీ జార్​లో వేసి పేస్ట్​ చేయాలి. డ్రై ఫ్రూట్​ పొడిలో ఖర్జూరం పేస్ట్, నెయ్యిలో వేగించిన కొబ్బరి పొడి​ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేత్తో మోదకాల మాదిరి చేయాలి. వాటిని గసగసాలతో గార్నిష్​ చేస్తే మోదకాలు రెడీ. కావాలనుకుంటే డ్రై ఫ్రూట్​ మిశ్రమంలో  కొంచెం చక్కెర పొడి కూడా కలుపుకోవచ్చు. 

జొన్నరవ్వ పాయసం

కావాల్సినవి

జొన్నరవ్వ– ఒక కప్పు
పాలు– అర లీటరు
పచ్చి కొబ్బరి తురుము– మూడు టీ స్పూన్​లు 
డ్రైఫ్రూట్స్​– ఇరవై గ్రాములు
బెల్లం తురుము– ఒక కప్పు
యాలకులు – కొన్ని
నెయ్యి– రెండు టేబుల్ స్పూన్లు

తయారీ

పాన్​లో నెయ్యి కరిగించి డ్రై ఫ్రూట్స్​, యాలకులు వేగించి పక్కనపెట్టాలి. అదే పాన్​లో జొన్న రవ్వని పచ్చి వాసన పోయేంత వరకు వేగించాలి. కుక్కర్​లో  సరిపడా నీళ్లు, వేగించిన జొన్నరవ్వ వేసి మూడు విజిల్స్​ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, పాలు కూడా పోసి ఇంకాసేపు మరిగించాలి. ఆ మిశ్రమం చిక్కబడ్డాక పైనుంచి కరిగించిన నెయ్యి, వేగించిన డ్రై ఫ్రూట్స్​, యాలకులు వేస్తే జొన్నరవ్వ పాయసం రెడీ.