- అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: కార్తీక మాస దీపోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కార్యనిర్వహణాధికారులు, అసిస్టెంట్ కమిషనర్లను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కార్తీక మాస దీపోత్సవ వేడుకలు కన్నుల పండువగా నిర్వహించాలని తెలిపారు.
కార్తీక మాసం సందర్భంగా అన్ని ఆలయాల్లో ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దీపోత్సవ వేడుకలు నిర్వహించాలని, ఇందులో పాల్గొనే భక్తులకు మట్టి ప్రమిదలు, నూనెలు, ఒత్తులు ఉచితంగా అందించాలని సూచించారు. ప్రతి రోజు సాయంత్రం కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. కార్తీకదీపాలను వదిలేందుకు నీటి కొలనులను ఏర్పాటు చేయాలని సూచించారు. అవకాశమున్నచోట ప్రత్యేక 'నది హారతి' కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నవంబర్ 4వ తేదీన కీసర శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే వేడుకల్లో మంత్రి సురేఖ పాల్గొంటారు.
కాపుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నం
కాపుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని కాపు, మున్నూరు కాపు సంఘాల నాయకులు, ప్రతినిధులు, జేఏసీల ప్రతినిధులు శనివారం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖను జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాపుల సమస్యలు, ప్రభుత్వం వారికి అందించాల్సిన సహాయ, సహాకారాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బీసీల ఉన్నతి, కాపు సమాజ పురోగతికి ప్రభుత్వం, వ్యక్తిగతంగా మంత్రి సురేఖ అందిస్తున్న చేయూతను ప్రశంసించారు.