
స్కిన్‌కి అయినా, జుట్టుకు అయినా ‘నేచురల్ ప్రొడక్ట్ బెస్ట్’ అని కొందరు.. ‘కెమికల్ ప్రొడక్ట్ అయితే త్వరగా పనిచేస్తుంద’ని మరికొందరు... ఒకరిని చూసి ఒకరు మార్కెట్లో కనిపించిన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడం ఈ మధ్య బాగా పెరిగింది. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు, ఫలానా సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ చేశారని, ఆ కంపెనీ కాబట్టి ఆలోచించాల్సిన పనిలేదని వెనకాముందూ చూడకుండా కొంటున్నారు. వాడుతున్నారు. ఆ తర్వాత ఇబ్బందులు ‘కొని’ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనం ఉన్న మార్కెట్ మాయాప్రపంచంలో ఏ ప్రొడక్ట్ మంచిది? ఏది కాదు? అని తెలియాలంటే కొన్ని విషయాల పట్ల మనకు అవగాహన రావాలి. ఆ విషయాలకు సంబంధించిందే ఈ స్టోరీ.
నా ఫ్రెండ్ శృతి స్కిన్ భలేబాగుంటుంది. ముఖం మీద ఒక్క మొటిమ ఉండదు. భూతద్దం పెట్టి వెతికినా చిన్న మచ్చ కూడా కనిపించదు. ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది ఆమె స్కిన్. నా స్కిన్ కూడా అలా ఉండాలంటే ఏం చేయాలి? ఏ క్రీమ్ వాడాలి? కెమికల్ ప్రొడక్ట్స్ వాడితే నా స్కిన్‌కి పడతాయో లేదో. ఎందుకొచ్చిన రిస్క్ నేచురల్ ప్రొడక్ట్ వాడడం బెటర్ అనిపిస్తుంది. అవి అయితే ఏం కాదట కదా. తెలిసిన వాళ్లు చాలామంది.. చాలాసార్లు వాడామని చెప్పారు’’ అని నేచురల్ ప్రొడక్ట్ వాడేందుకు డిసైడ్ అయింది మానస. నేచురల్ ప్రొడక్ట్స్ కొని, వాడడం మొదలుపెట్టింది. కానీ, అవి ఆమె చర్మానికి సరిపడలేదు. రియాక్షన్ వచ్చి స్కిన్ పాడైపోయింది.
‘పులిని చూసి నక్క వాతలుపెట్టుకున్నట్టు అయింది నా పరిస్థితి. ఇకమీదట సొంత ప్రయోగాలు చేయొద్దు’ అని డిసైడ్ అయ్యింది. కానీ స్కిన్ ఫెయిర్ గా కనిపించేలా చేసుకోవాలనే ఆలోచన మాత్రం మానుకోలేదు. అందుకోసం ఈసారి బ్యూటీపార్లర్‌కు వెళ్లి, స్కిన్ కేర్ ట్రీట్మెంట్ ఏదో చేయించుకుంది. కానీ ఇంటికొచ్చిన కాసేపటికే ముఖం మీద మార్పులు కనిపించాయి. వెంటనే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి పరుగెత్తింది.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు’ మానస లాంటి పరిస్థితి చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. ఇలాంటిది అమ్మాయిలకే కాదు... అబ్బాయిలకి కూడా అప్పుడో.. ఇప్పుడో.. అనుభవమయ్యే ఉంటుంది. చాలామంది ఎటువంటి అవగాహన లేకుండా సొంత ప్రయోగాలు చేస్తుంటారు . ఇలాంటి వాళ్లంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. చర్మ సౌందర్యంగా ఉండాలంటే చర్మ ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం అని. అలా ఉండాంటే సరైన కేర్ తీసుకోవాలి. అంతేకానీ మనసుకు తోచిన ప్రయోగాలు చేయకూడదు.
ఫేస్ వాష్‌ల ట్రెండ్
ఈ మధ్య ముఖానికి సబ్బుకంటే ఫేస్‌వాష్‌లు బాగా పనిచేస్తాయని ఎక్కువగా వాడుతున్నారు. వాస్తవానికి.. మన స్కిన్ టైప్ కంటే సబ్బుల్లో ఎక్కువ పీహెచ్ లెవల్స్ ఉంటాయి. అలాగే ఆల్కలీనిటీ ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ డ్రై అవుతుంది. ఇలాంటి కారణాలతో సబ్బును పక్కకు నెట్టి ఫేస్ వాష్‌లు వాడుకలోకి వచ్చాయి. అయితే ఫేస్ కోసం మైల్డ్ సోప్స్ లేదా స్కిన్ టైప్ పీహెచ్‌కి సరిపడే సోప్స్ వాడొచ్చు. ఫేస్‌వాష్‌ల తయారీలో సాల్సిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ వంటి కాంపొనెంట్స్ వాడతారు. కొన్నింట్లో చర్మం పై మలినాలు పోగొట్టడానికి మైల్డ్ స్క్రబ్ పార్టికల్స్ వంటివి కలుపుతారు. అలాగే రకరకాల ఫ్లేవర్స్, ఫ్రాగ్రెన్స్ల వంటి వాటివల్ల ఫేస్ వాష్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. సోప్స్ వాడాలనుకునే వాళ్లు చర్మ రకాన్ని బట్టి సూట్ అయ్యేవి వాడాలి.
నేచురల్ – ఆర్గానిక్ మధ్య తేడా
నేచురల్ అంటే మొక్కల నుంచి నేరుగా తయారుచేస్తారు. ఈ మొక్కల పెంపకంలో పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ వంటి రసాయనాలు వాడతారు. వాటినుంచి వచ్చే యాపిల్, అరటి వంటి పండ్లు, పూల వంటివి ‘నేచురల్’. కానీ, వాటిని పెంచేటప్పుడు కెమికల్స్ వాడతారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రిపరేషన్ నేచురల్ వాటికంటే కొంచెం వేరుగా ఉంటుంది. ఆ తేడా ఏంటంటే.. ప్రొడక్ట్ తయారీ కోసమే మొక్కలు, పండ్లు, కూరగాయలు వంటివి పెంచుతారు. వాటికి పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ వంటివేవీ వాడరు. అందుకే వాటిని ‘ఆర్గానిక్’ అంటారు.
ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్
పొల్యూషన్, ట్రావెల్, స్విమ్మింగ్, ఎండ, రేడియేషన్ తీవ్రత, స్క్రీన్ లైట్స్, గాడ్జెట్స్, టీవీ, కంప్యూటర్, ఫోన్స్.. ఇవన్నీ ఎన్విరాన్మెంట్ కిందకే వస్తాయి. అలాగే ఫుడ్, జుట్టు కూడా ఈ కోవలోకే వస్తాయి. పొల్యూషన్ వల్ల ఎర్లీ ఏజింగ్ సమస్య వస్తుంది. కొల్లాజెన్ ఎర్లీగా బ్రేక్ డౌన్ అవుతుంది. మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా కావడం వల్ల స్కిన్ ట్యాన్ అవడం, ముడతలు పడడం జరుగుతుంది. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల స్కిన్, హెయిర్ హెల్దీగా ఉంటాయి. అందుకోసం యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్–సి ఉండే ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు బాడీలో తయారయ్యే ఫ్రీ–రాడికల్స్ అనేవి న్యూట్రలైజ్ అయిపోతాయి.
స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొనే ముందు..
స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట మన స్కిన్ టైప్ ఏంటి? వాడే ప్రొడక్ట్ ఏంటి? అనేది తెలుసుకోవాలి. రెండోది సెన్సిటివ్ స్కిన్. అటోపిక్ డెర్మటైటిస్ టెండెన్సీ ఉన్నవాళ్లు మల్టిపుల్ ప్రొడక్ట్స్ వాడకూడదు. చాలా సింపుల్‌గా ఉండేవి వాడాలి. అలాగే ఘాటైన సువాసనలు, గాఢమైన కెమికల్స్ వాడకూడదు. అవి వాడడం వల్ల చర్మం మంట, పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్ బేస్డ్ కాంపొనెంట్స్‌లో స్టింగింగ్ టెండెన్సీ (గుచ్చుతున్నటువంటి) ఉంటాయి. కాబట్టి అలాంటి కాంపొనెంట్స్ ఉండేవి తక్కువగా వాడాలి. కొందరు పొడి చర్మానికి ఆయిలీ స్కిన్‌కి వాడే ప్రొడక్ట్స్ వాడుతుంటారు. దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆయిలీ స్కిన్ వాళ్లు, గట్టిగా, పోర్స్ (రంధ్రాలు) బ్లాక్ చేసే హెవీ ప్రొడక్ట్స్ వాడతారు. అలాంటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి చర్మం రకం, అప్పటికే వాడుతున్న ప్రొడక్ట్స్‌లో ఫేస్ వాష్, సీరమ్స్, ట్యాబ్లెట్స్ వంటివి ఏవైనా చూసుకుని ప్రొడక్ట్‌ని సెలక్ట్ చేసుకోవాలి.
...తయారీలో రసాయనం
నేచురల్ ప్రొడక్ట్ అనేది మార్కెటింగ్ కోసం చేసే అడ్వర్టైజ్మెంట్ అని గుర్తుంచుకోవాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఉదాహరణకు అలొవెరా జెల్. ఈ జెల్‌ను ఇంట్లో పెరిగే మొక్క నుంచి తీసుకోవచ్చు. అలాగని అలోవెరా జెల్ తీసి సీసాలో పెట్టి ఉంచితే ఎక్కువకాలం నిల్వ ఉండదు. అందుకే దాన్ని జెల్లా మార్చి, ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. అది ప్రాసెస్ చేసేటప్పుడు కచ్చితంగా అందులో ప్రిజర్వేటివ్ కెమికల్ వాడతారు. అలాగే వేపాకు కూడా. దాన్నీ డైరెక్ట్‌గా వాడట్లేదు. వేపాకునుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్లో, కెమికల్స్ కలిపి ఎక్కువకాలం పాడవ్వకుండా తయారుచేస్తున్నారు. అంటే కెమికల్స్ వాడుతున్నట్టే లెక్క కదా!
అందుకే వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే ఇక్కడ మూడు విషయాలు గమనించాలి. అవి సరైన సమతుల్యం, గాఢత, టైం. ఉదాహరణకు రెటినాయిడ్స్ వాడుతున్నప్పుడు అవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నవి వాడితే చర్మం పొడిబారిపోతుంది. దాంతో ఎండలోకి వెళ్తే ఇరిటేషన్ వచ్చి, స్కిన్ డార్క్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది ఫెయిర్‌నెస్ కోసం డాక్టర్స్ చెప్పారని ఫైటోక్వినోన్ బేస్ క్రీమ్స్ వాడతారు. అవి నాలుగు నుంచి ఆరు వారాల వరకు వాడమని అడ్వైజ్ చేస్తారు. కానీ, దాని రిజల్ట్ చూసి ఆ తరువాత డాక్టర్ని కలవకుండా వాళ్లంతట వాళ్లే ఆ క్రీమ్‌లు వాడతారు కొందరు. అలా వాడడం వల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు డెర్మటాలజిస్ట్‌లు.
స్కిన్ కేర్‌కి ఏజ్ లిమిట్ ఉండదు
స్కిన్ కేర్‌కి ఏజ్‌తో సంబంధం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ స్కిన్‌కేర్ అవసరమే. పిల్లలకు మాయిశ్చరైజర్స్, మైల్డ్ సోప్స్, మైల్డ్ షాంపూ వాడతారు. పదేండ్ల తర్వాత ఆయిల్‌ను విడుదల చేసే గ్లాండ్స్ యాక్టివ్ అవుతాయి. అప్పుడు నుదురు, ముక్కు, చెంపల మీద జిడ్డు కనిపిస్తుంది. చుండ్రు సమస్య కూడా మొదలవుతుంది. ఈ ఏజ్‌లో అబ్బాయిలకు ఎక్కువ జిడ్డు, చుండ్రు వస్తుంటాయి. స్పోర్ట్స్ ఆడేవాళ్లు తర్వగా ట్యాన్ అవుతారు. అప్పటి నుంచి స్కిన్ కేర్ మీద దృష్టి మళ్లుతుంది వాళ్లకు. వీళ్లు స్కిన్ కేర్ స్పెషలిస్ట్‌లను కలిస్తే... సాల్సిలిక్ యాసిడ్, లాక్టిక్ వంటి ఫేస్ వాష్‌లు, డాండ్రఫ్ షాంపూలు, యాంటీ ఫంగల్ లోషన్స్, మల్టిపుల్ కాంపొనెంట్స్ ఉండే సబ్బులు సజెస్ట్ చేస్తారు .
వాళ్లు చెక్ చేసుకోవాలి
ఇరవై ఏండ్లు పైబడిన వాళ్లకి స్కిన్‌కి సంబంధించి ఏవైనా క్రీమ్‌లు ఇచ్చేముందు కొన్ని విషయాలు చెక్ చేస్తారు. ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారా? ముఖ చర్మంపై పోర్స్ (రంధ్రాలు) ఎక్కువగా ఉన్నాయా? అనేదాన్ని బట్టి సన్ స్క్రీన్స్ వాడమని చెప్తారు డాక్టర్లు. పాతికేండ్లు పై బడిన వాళ్లలో రంధ్రాలు, పిగ్మెంటేషన్, స్కార్స్, పింపుల్స్ వల్ల మార్క్స్ వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటివాళ్లకు స్కిన్ బ్రైట్నెస్కోసం సీరమ్స్ ఇస్తారు. అలాగే ఏజింగ్ ఎఫెక్ట్ పడకూడదు అనుకుంటే సన్‌స్క్రీన్స్ వాడాలి. అప్పుడు కొల్లాజెన్ బ్రేక్‌డౌన్ ఎక్కువ జరగదు. చర్మం ముడతలు ఎక్కువగా పడదు. సీటీఎమ్(క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్) వాడకం అనేది ఈ మధ్య బాగా పెరిగింది. క్లెన్సర్ అన్ని రకాల స్కిన్ టైప్స్‌కి అవసరమే. కానీ డ్రై స్కిన్‌కి టోనర్ అవసరం లేదు. ఒకవేళ మాయిశ్చరైజర్స్ వాడితే వాటిలో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. అదే ఆయిలీ స్కిన్‌కి అయితే మైల్డ్‌గా ఉండేవి వాడాలి. ఏ ప్రొడక్ట్స్ వాడడానికి ఇష్టపడని వాళ్లు సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్, మైల్డ్ ఫేస్ వాష్, పౌడర్స్ వంటివి వాడితే సరిపోతుంది.
పార్లర్‌కి వెళ్తున్నారా?
ఇవ్వాళ రేపు ఆడ, మగ ఇద్దరిలో బ్యూటీ పార్లర్‌కి వెళ్లని వాళ్లను చేతివేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అయితే పార్లర్లో వాడే ప్రొడక్ట్స్ ఎప్పుడూ ఒకటే ఉండాలని లేదు. అవి తరచూ మారుతూ ఉండొచ్చు. వేర్వేరు కంపెనీల ప్రొడక్ట్స్ వాడొచ్చు. అవి కాకుండా ‘మేం సొంతంగా తయారుచేశాం’ అని వాళ్లు తయారుచేసిన ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నారు. ఆ ప్రొడక్ట్స్‌లో స్టిరాయిడ్ క్రీమ్స్, హైడ్రోక్వినోన్ ఆధారిత క్రీమ్స్ వంటివి ఎక్కువగా ఉంటున్నాయి. దానివల్ల స్కిన్ పాడవుతుంది. ముఖ్యంగా ఫెయిర్‌నెస్ కోసం, పిగ్మెంటేషన్ తగ్గడానికి అయితే డాక్టర్ సలహా ప్రకారమే క్రీమ్‌లు, లోషన్లు వాడాలి.
ఆయిలీ ఫుడ్ వల్ల యాక్నే వస్తుందా?
ఆయిలీ ఫుడ్ ఒక్కటే కాదు.. చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్, వేపుళ్ల వల్ల కూడా యాక్నే వచ్చే అవకాశం ఉంది. అలాగని వాటివల్ల మాత్రమే యాక్నే వస్తుందని కచ్చితంగా చెప్పలేం. హార్మోనల్ స్టిమ్యులేషన్ వల్ల నూనె గ్రంధులు యాక్టివ్ అయినప్పుడు యాక్నే వస్తుంది. ఆడపిల్లల్లో అయితే మెనుస్ట్రువల్ సైకిల్స్ ముందు లేదంటే బి12 సప్లిమెంట్స్ వల్ల పెరుగుతుంది. మగవాళ్లలో ప్రొటీన్ పౌడర్స్ తీసుకోవడం వల్ల యాక్నే పెరుగుతుంది. ఫుడ్ అనేది ఒక రీజన్ మాత్రమే.
* * *
అసలు కారణాలేంటంటే...
స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాక ఏం చేయాలి? అనేదాని కంటే ముందు.. ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి. చర్మ సమస్య రావడానికి ప్రధాన కారణాలు... తిండి, నిద్ర, లైఫ్ స్టయిల్. ఇప్పుడున్న లైఫ్ స్టయిల్లో చర్మాన్ని ఎఫెక్ట్ చేసే విషయాల్లో ఒకటి ప్రొఫెషన్. ఎండలో పనిచేసేవాళ్లకు సూర్యరశ్మి ఎక్కువగా తగులుతుంది. చర్మ తీరును బట్టి మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువై ట్యాన్ అవడం వంటివి జరుగుతాయి. అదే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్లకయితే రసాయనాలకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల రియాక్షన్స్ వస్తాయి. పూలతోటల్లో లేదా పూలకు సంబంధించిన పని చేసేవాళ్లకు పూలలో ఉండే పొలెన్స్ పడకపోవడం వల్ల సమస్య వస్తుంది.
వ్యవసాయం చేసేవాళ్లు పంటటకు పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వంటివి వాడినప్పుడు అవి చర్మం మీద రియాక్షన్ చూపిస్తాయి. అంతేకాకుండా పంట కోత కోశాక ఊక జల్లెడ పట్టేటప్పుడు వాటిలో నుంచి వచ్చే దుమ్ము, ధూళి చర్మం మీద పడి రియాక్షన్ కలిగిస్తుంది. ఇలాంటివన్నీ లైఫ్ స్టయిల్ వల్ల వచ్చే కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే చర్మాన్ని కప్పుకోవాలి. చేసే పనులను బట్టి డ్రెస్ కోడ్స్ ఉండేది ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసమే. రక్తంలో ఐరన్ కంటెంట్ వల్ల కూడా చర్మంలో తేడాలు వస్తాయి. రక్త హీనత (ఎనీమియా) ఉంటే చర్మం పాలిపోయి తెల్లగా కనిపిస్తుంది. అలాగే లివర్ ఫంక్షన్లో తేడా వచ్చినా, చర్మం రంగులో మార్పు కనిపిస్తుంది. ఉదాహరణ తీసుకుంటే పచ్చకామెర్లు (జాండిస్) వచ్చిన వాళ్ల చర్మం పసుపు రంగులోకి మారుతుంది. జాండిస్ అనేది లివర్‌కు వస్తుంది. కానీ, దాని ఎఫెక్ట్ చర్మం మీద స్పష్టంగా కనిపిస్తుంది.
నేచురల్ అనేది ఒట్టి మాట!
‘‘నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఎక్కువగా కొన్ని ఇంగ్రెడియెంట్స్ వాడతారు. వాటిలో హెయిర్ డైస్ కోసం గోరింటాకు, నీలి చెట్టు ఆకు, గుంటగలగర ఆకు (భృంగరాజ), కరక్కాయ వాడతారు. హోలీ రంగుల్లో మోదుగ పువ్వుతో చేసిన చూర్ణం వాడుతున్నారు. అయితే నేచురల్ డైస్, కెమికల్ డైస్ ఏవైనా సరే వాడే ముందు టెస్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం. శరీరానికి పడుతుందో లేదో చెక్ చేయాలి. చేతి మీద చిన్న ఏరియాలో కలర్ పూసి చూడాలి. రియాక్షన్ రాలేదంటే అవి సేఫ్ అని అర్థం. అప్పుడు చర్మానికి ఎలాంటి హాని కలుగదు. ఇదంతా ఒక ఎత్తయితే.. మరొకటి నేచురల్ లేదా కెమికల్లో ఏ ప్రొడక్ట్స్ అయినా కమర్షియల్‌గా ఆలోచిస్తారు. కంపెనీ తయారుచేసిన ఏ ప్రొడక్ట్ అయినా ఎక్కువ కాలం నిల్వచయాలి. కాబట్టి కచ్చితంగా వాటిలో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అంటే.. నేచురల్ ప్రొడక్ట్స్ అయినా నిల్వ ఉండడానికి కలిపేది రసాయనాలే. అవి కచ్చితంగా చర్మం మీద రియాక్షన్ చూపించే అవకాశం ఉంది.
ఇంట్లో చేసుకునేవైతే రెండు మూడు రోజులకంటే ఎక్కువ నిల్వ ఉండవు. కాబట్టి పర్వాలేదు అనుకోవచ్చు. ఉదాహరణకు శనగపిండినే తీసుకుంటే.. చాలామంది దీన్ని రెగ్యులర్‌గా ముఖానికి రాసుకుంటారు. అయితే శనగలు తెచ్చుకుని, వాటిని పట్టించి పిండి తయారుచేసుకుంటే అది నేచురల్. దానికి సబ్బులాగే క్షార గుణం ఉంటుంది. దాంతో మలినాలు పోతాయి. అలాకాకుండా షాపులో కొనే శనగపిండిలో వేరే పప్పుధాన్యాలు కూడా కలుస్తాయి. అవి మనం తినేవి కాకపోవచ్చు కూడా. అడవిలో ఎన్నో రకాల మొక్కలు, పప్పుధాన్యాలు ఉంటాయి. వాటిలో మనం తినేవి కొన్నే. మిగతావాటిని అవాయిడ్ చేస్తాం. అలాంటివి శనగపిండిలో కలిస్తే, ఆ పిండిని చర్మానికి రాసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా అవి చర్మానికి పడకపోతే రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది” అని చెప్పారు ఆయుర్వేద కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిలువేరు రవీందర్.
* * *
స్కిన్ కేర్ అంటే...
‘‘మన శరీరంలో అతి పెద్ద భాగం శరీరమే. అందరి చర్మం ఒకేలా ఉండదు. చర్మం రంగు కూడా ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. స్కిన్ కేర్ తీసుకోవడాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి స్కిన్‌కి ఏ సమస్యా రాకముందు, మరొకటి ప్రాబ్లమ్స్ వచ్చాక అని. చర్మ సమస్య వచ్చాక కేర్ తీసుకోవడం అంటే... అది సమస్యని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదే సమస్య రాకముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే హెల్దీగా ఉండటమే కాకుండా చర్మం బ్యూటిఫుల్‌గా కూడా కనిపిస్తుంది. స్కిన్ అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. ఇందులో నాలుగు రకాలు ఉంటాయి. నార్మల్, డ్రై, ఆయిలీ, కాంబినేషన్ అని. ఫేస్ వాష్ చేశాక జిడ్డుగా ఉందా? పొడిగా ఉందా? యాక్నే టెండెన్సీ ఎంత ఉంది? వంటి కొన్ని అంశాలను బట్టి స్కిన్ టైప్ చెప్పొచ్చు.
ఏ సమస్యా రాకుండా..
ఎండలో, నీడలో ఎక్కడ ఉన్నా అందరూ సన్ స్ర్కీన్ వాడడం తప్పనిసరి. అంతెందుకు ఎండ పడని చోట అంటే.. ఇంట్లో, ఆఫీస్‌ల్లో ఉన్నా అక్కడ ఉండే లైట్స్ కారణంగా మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో స్కిన్ పాడయ్యే ఛాన్స్ ఉంది. అందుకని బయటకు వెళ్లినప్పుడే కాదు నాలుగ్గోడల మధ్య ఉండి లైట్స్‌కి ఎక్స్పోజ్ అయినా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పగటిపూట సన్ స్క్రీన్ వాడాలి. అలాగే చాలామంది పింపుల్స్ తగ్గేందుకు క్రీమ్స్ వాడుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. డెర్మటాలజిస్ట్కి చూపించుకుని వాళ్లు చెప్పిన పద్ధతిని ఫాలో కావాలి. మీ సమస్యను బట్టి ఆయింట్మెంట్స్ ఇస్తారు. వాటిని వాళ్లు చెప్పిన టైమింగ్స్‌లోనే వాడాలి. కొన్ని రాత్రి పూట మాత్రమే వాడే మందులు ఉంటాయి. మచ్చలు, మంగు వంటివి ఉండేవాళ్లకు, వేరువేరుగా ఆయింట్ మెంట్స్ ఉంటాయి. వాటిని ప్రెగ్నెన్సీ టైంలో వాడొద్దంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
వీటన్నింటితో పాటు చర్మం మెరవాలంటే చేయాల్సిన సింపుల్ చిట్కా ఒకటి ఉంది. అదేంటంటే ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం. రోజుకు మూడు లేదా నాలుగు లీటర్ల ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు బాగా తినాలి. ఈ జాగ్రత్తలతో పాటు చర్మం రకాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొడి చర్మం ఉన్నవాళ్లు మైల్డ్ క్లెన్సర్స్ వాడాలి. డ్రై స్కిన్ ఉన్నవాళ్లకు హైడ్రేషన్ అవసరం. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. మొటిమలు ఎక్కువగా వస్తుంటే హార్మోనల్ ఇంబాలెన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడీ, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. అలాగే డ్రై స్కిన్ లేదా ఆయిలీ స్కిన్.. ఎలాంటి చర్మం ఉన్నవాళ్లైనా మాయిశ్చరైజర్ వాడాలి. ఆయిలీ స్కిన్ వాళ్లు మైల్డ్ ఎమోలియన్స్ వాడాలి. మొటిమలు ఎక్కువగా వస్తుంటే ఆయిల్ పర్సెంట్ ఎక్కువగా ఉన్న మాయిశ్చరైజర్ వాడకూడదు.
ఆ ఎఫెక్ట్‌తో జాగ్రత్త!
వాతావరణంలో వచ్చే మార్పులు చర్మం మీద కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఎక్కువ వేడి లేదా చలిగా ఉంటే చర్మం ఆ వాతావరణానికి రియాక్ట్ అవుతుంది. దానివల్ల కొన్నిసార్లు ఎక్కువ పొడిబారుతుంది. పొల్యూషన్ వల్ల కూడా చర్మం మీద ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఇబ్బందులన్నీ ఒక ఎత్తయితే చాలామంది ముఖాన్ని పదే పదే కడుగుతుంటారు. దానివల్ల నేచురల్ పీహెచ్ డిస్టర్బ్ అయితే స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పైగా డేటైంలో క్లెన్సర్స్ వాడటంతో పాటు ఎన్నిసార్లు నీళ్లతో ముఖాన్ని కడుగుతున్నారనేది కూడా ముఖ్యమే. లేకపోతే మొటిమలు వస్తాయి. చర్మం పొడిబారుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే చర్మం పాడవుతుంది” అంటున్నారు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ స్పందన.
కాబట్టి ఏ ప్రొడక్ట్ అయినా వాడే ముందు డాక్టర్ సలహా తీసుకుని, ఆ తర్వాత వాడడం బెటర్.
పోషకాల పాత్ర
స్కిన్ కేర్ విషయంలో పోషకాల పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ఎలాంటి న్యూట్రియెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే స్కిన్‌కి మేలో తెలుసుకోవాలి. అవేంటంటే... విటమిన్ ఎ, డి, ఇ, కె. ఈ నాలుగు విటమిన్స్ చర్మ ఆరోగ్యం, సౌందర్యం విషయంలో కీ రోల్ పోషిస్తాయి. అందుకని ఏ విటమిన్, ఏ ఫుడ్‌లో ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
విటమిన్ – ఎ : ఎరుపు, ఆకుపచ్చ రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో ఎ – విటమిన్ ఉంటుంది. ఉదాహరణకు యాపిల్, లిచీ, టొమాటో, ఆరెంజ్, బొప్పాయి, క్యారెట్, బీట్ రూట్, ఆకుకూరలు వంటివి తినాలి. రొటీన్‌గా ఏ ఫుడ్ అయినా బాగా ఉడికించి లేదా వేగించి తినడం మనకు అలవాటు. అయితే, క్యారెట్, బీట్ రూట్ వంటివి ఎక్కువగా వేగిస్తే వాటిలోని పోషకాలు పోతాయి. కాబట్టి రోజులో ఒక్కసారైనా పచ్చి కూరగాయలు తినాలి.
విటమిన్ – డి : ఎండ నుంచి డి – విటమిన్ పుష్కలంగా అందుతుంది. కాబట్టి సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయానికి ముందు ఎండ మీద పడేలా చూసుకోవాలి. ఇప్పుడంటే సూర్య రశ్మి తగిలేలా చూసుకోమని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. కానీ, పూర్వం రోజుల్లో లైఫ్ స్టయిల్లోనే సరిపడా సూర్యరశ్మి తగిలేది. పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చుకోవడం, ఆరుబయటకు వెళ్లడం, వ్యవసాయపనులు చేసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతున్నాయి. కానీ, ఈ రోజుల్లో సూర్య రశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం చాలా తగ్గిపోయింది. గంటలు గంటలు ఏసీల్లో పనిచేయాల్సి వస్తోంది. ఈ కారణాల వల్ల సహజ వనరుల్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అందుకే ఈ కాలంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి డి – విటమిన్ లోపం ఉంటోంది.
విటమిన్ – ఇ : మొలకెత్తిన విత్తనాల్లో, ఆకు కూరల్లో ఇ–విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్లో తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు తినడం మంచిది. వీటిని తినడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ సమస్య వచ్చాక తింటే ఆ సమస్య తగ్గడానికి ఉపయోగపడతాయి.
::: మనీష పరిమి