ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ నెల 12న సీఎం కేసీఆర్​ జిల్లా పర్యటనను సక్సెస్​ చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కోరారు. కొత్తగూడెం క్లబ్​లో  బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సోమవారం మీటింగ్​ ఏర్పాటు చేశారు. సీఎంకు ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కంచర్ల చంద్రశేఖర్, కొత్వాల్​ శ్రీనివాసరావు, కె సీతాలక్ష్మి, వనమా రాఘవ, కాసుల వెంకట్, భుక్యా రాంబాబు, బత్తుల వీరయ్య, బరపాటి వాసుదేవరావు, కాంపెల్లి కనకేశ్, అన్వర్​పాషా, మండే హనుమంతరావు పాల్గొన్నారు. 

‘పాలేరు ప్రజలు నా వెంటే ఉన్నారు’

కూసుమంచి, వెలుగు: ఎమ్మెల్యే కందాల బర్త్​డే సోమవారం గ్రాండ్​గా జరిగింది. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో ప్రజలు, పార్టీ శ్రేణులతో కలిసి బర్త్​డే జరుపుకున్నారు. అంతకుముందు శివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకపూజలు చేశారు. అక్కడి నుంచి రాజన్న డప్పులు, కోలాటాలు, గిరిజన నృత్యాల నడుమ ర్యాలీ నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు బర్త్​డే విషెస్​ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరు ప్రజలంతా తన వెంటే ఉన్నారని తెలిపారు. రూరల్  ఏసీపీ బస్వారెడ్డి, సీఐ జితేందర్​రెడ్డితో పాటు నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

చాక్లెట్లు తీసుకెళ్లాలని టీచర్లకు ఆదేశాలు

నేలకొండపల్లి: ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బర్త్​డే సందర్భంగా నియోజక వర్గంలోని అన్ని గవర్నమెంట్​ స్కూల్​ స్టూడెంట్స్​కు చాక్లెట్లను పంపిణీ చేశారు. అయితే వాటిని ఎమ్మార్సీ కేంద్రాల్లో ఉంచి స్కూల్స్​కు తీసుకెళ్లాలని టీచర్లకు చెప్పడంతో కొంత మంది  టీచర్లు అభ్యంతరం తెలిపారు. మండలంలోని దూర ప్రాంతాల స్కూళ్లకు వెళ్లే టీచర్లు ఇబ్బందులు పడ్డామని వాపోయారు. ఎమ్మెల్యే బర్త్ డేకి టీచర్లను వాడుకోవడంపై విమర్శలువచ్చాయి.

స్కీం వర్కర్స్​ ధర్నా

ఖమ్మం టౌన్, వెలుగు: కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ సీపీడబ్ల్యూయూఎస్  స్కీం వర్కర్స్​ సోమవారం జడ్పీ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మ విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్లకు రూ.26 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఎ.వెంకయ్య, పి.రాంబాబు,బి.శ్రీను,ఎ.బాలకృష్ణ, మధుసూదన్ రెడ్డి, జె నరసింహారావు, తిరుపతిరావు, జి నరసింహారావు, మనోజ్, లక్ష్మణ్  పాల్గొన్నారు.

రైళ్లను పునరుద్ధరించాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాచలం రోడ్​ స్టేషన్​ నుంచి కొవిడ్​కు ముందు నడిచిన రైళ్లన్నింటినీ పునరుద్ధరించాలని కొవ్వూరు రైల్వే సాధన కమిటీ కన్వీనర్​ కొదుమసింహం పాండురంగాచార్యులు కోరారు. కొత్తగూడెంలోని రైల్వేస్టేషన్  ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలు నడిచేలా పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వే లైన్​ నిర్మించాలన్నారు. కాజీపేట్, డోర్నకల్​కు వెళ్లే ప్యాసింజర్​ రైలుతో పాటు కొల్హాపూర్​ రైలును తిరిగి నడపాలని కోరారు. గణేశ్, సతీశ్, పవన్, కల్యాణ్, సంతోష్, సాయిశంకర్, కృష్ణ పాల్గొన్నారు. 

కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు: శ్రీ చైతన్య సౌద క్యాంపస్ లో మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన చైతన్యకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్​ చేస్తూ పీడీఎస్​యూ ఆధ్వర్యంలో సోమవారం డీఐఈవో ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోని డీఐఈవో రవిబాబును సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేశారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. అనంతరం అడిషనల్​ కలెక్టర్ స్నేహలతకు వినతిపత్రం అందజేశారు. వడ్లమూడి సతీశ్, లక్ష్మణ్, కరుణ్, శ్రీకాంత్, మల్సూర్  పాల్గొన్నారు.

రామయ్యకు ముత్తంగి సేవ

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ జరిగింది. ముందుగా స్వామికి సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించాక మూలవరులకు, లక్ష్మీతాయారు అమ్మవారికి, ఆంజనేయస్వామికి ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవ చేశారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకొచ్చి కల్యాణ క్రతువు జరిపించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక జరిగాయి. మంత్రపుష్పం నివేదించాక మాధ్యాహ్నిక ఆరాధనలు నిర్వహించి రాజబోగం సమర్పించారు. దర్బారు సేవ జరిగాక రాజవీధిలోని విశ్రాంతి మండపానికి శ్రీసీతారామచంద్రస్వామిని తీసుకెళ్లారు. అక్కడ రామయ్య కల్కి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రత్యేక పూజలందుకుని తిరువీధి సేవకు గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లారు. అనంతరం ఆలయం వద్ద దొంగలదోపు ఉత్సవం చేశారు. ఈ వేడుకలో దొంగ వేషధారికి స్వామి శేషమాలికలు, వస్త్రాలు, ప్రసాదం అందించారు.

ఏఈవోలపై ఫిర్యాదు

చండ్రుగొండ, వెలుగు: వ్యవసాయ పనిముట్ల కోసం డబ్బులు కట్టి ఏండ్లు గడుస్తున్నా పట్టించుకోవడంలేదని, సరైన సమాధానం చెప్పకుండా ఏఈవోలు తిప్పించుకుంటున్నారని మండలంలోని పలు గ్రామాల రైతులు సోమవారం గ్రీవెన్స్ లో ఇద్దరు ఏఈవోలపై కలెక్టర్ అనుదీప్ కు ఫిర్యాదు చేశారు. పైపులు, తైవాన్ పంపుల కోసం బెండాలపాడు, తిప్పనపల్లి గ్రామాలకు చెందిన భద్రు, పెద్దులు, ధంజ్యా, రంగమ్మ, దాసు ఐదేండ్ల క్రితం ఏఈవోలు సాయిభాను, విజయ్ లకు రూ.58 వేలు చెల్లించారు. వారు డీడీలు తీస్తామని చెప్పి ఏండ్లు గడుస్తున్నా పనిముట్లు రాలేదని రైతులు తెలిపారు. డీఏవో అభిమన్యుకు కంప్లైంట్​ను అందజేసి ఎంక్వైరీ చేసి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 

‘డబుల్’ ఇండ్లు అందజేత

చండ్రుగొండ, వెలుగు: మండలంలోని తుంగారం గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్లను ఆక్రమించుకున్న మూడు కుటుంబాలను రెవెన్యూ ఆఫీసర్లు తొలగించారు. అనంతరం వాటిని అర్హులకు కేటాయించారు. డీటీ ప్రసన్న, ఆర్ఐ ముత్తయ్య, సిబ్బంది పాల్గొన్నారు. 

నేడు జిల్లాలో కేంద్ర మంత్రి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు:  కేంద్ర ఈశాన్య ప్రాంతాల సహకార, అభివృద్ది శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం12 గంటలకు కలెక్టరేట్​లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించి  మీడియాతో మాట్లాడనున్నారు. బోనకల్  బీసీ హాస్టల్ సందర్శించిన తరువాత వైరాలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 

ఆస్తి ఇవ్వకుంటే చంపేస్తమని బెదిరిస్తున్రు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆస్తి ఇవ్వకపోతే తమను చంపేస్తామని కొడుకు, కోడలు బెదిరిస్తున్నారని చుంచుపల్లి మండలం బదావత్​తండాకు చెందిన హరిలాల్​ దంపతులు సోమవారం కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్​లో సోమవారం కలెక్టర్​ అనుదీప్​ గ్రీవెన్స్​లో భాగంగా దరఖాస్తులను స్వీకరించారు. కొడుకు, కోడలి నుంచి తమకు రక్షణ కల్పించాలని హరిలాల్​ దంపతులు వేడుకున్నారు. గోదావరి వరదలతో తమ ఇండ్లన్నీ నీట మునిగినా తమకు పరిహారం రాలేదని చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన బాధితులు ఫిర్యాదు చేశారు. దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. 

క్రీడలతో భవిష్యత్తు

గుండాల, వెలుగు: క్రీడలతో మంచి భవిష్యత్తు అందుతుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క కొడుకు ధనసరి సూర్య అన్నారు. ఇటీవల మరణించిన ఎంపీటీసీ ఎస్కే సందాని జ్ఞాపకార్థం మండలకేంద్రంలో నిర్వహించిన క్రీడాపోటీలను ప్రారంభించారు. క్రీడల్లో రాణించిన వారికి స్పోర్ట్స్​ కోటాలో ఉద్యోగాలు వస్తాయన్నారు.  గుండాల ఎస్ఐ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఎన్ఓసీలు ఇచ్చేందుకు పీవో అంగీకారం

భద్రాచలం, వెలుగు: గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న టీచర్లకు ఉన్నత చదువుల కోసం ఎన్ఓసీలు ఇచ్చేందుకు ఐటీడీఏ పీవో గౌతమ్  పోట్రు అంగీకరించారని టీపీటీఎఫ్​ జిల్లా అధ్యక్షుడు బి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీ–2020 ప్రకారం వచ్చే ఏడాది నుంచి బీఎడ్​ కోర్సు నాలుగేండ్లకు పెంచుతున్నట్లు చెప్పారు. ఈ కోర్సు చేయకపోతే టీచర్లకు ప్రమోషన్లు రావని తెలిపారు. ఈ విషయాన్ని పీవో దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రధాన కార్యదర్శి జి హరిలాల్, మునిగడప రామాచారి పాల్గొన్నారు.

యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు

కారేపల్లి, వెలుగు: ప్రేమించాలని వెంటపడుతూ యువతిని వేధించిన మండలంలోని వెంకిట్యాతండాకు చెందిన ఆంగోత్ మహేందర్ పై కారేపల్లి పోలీసులు​సోమవారం కేసు నమోదు చేశారు. అదే తండాకు చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీఎంను కలిసేందుకు అపాయింట్​మెంట్​ ఇప్పించండి

కలెక్టర్​కు ​సర్పంచుల వినతి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ నెల 12న జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం కేసీఆర్​కు వినతిపత్రం ఇచ్చేందుకు తమకు అపాయింట్​మెంట్​ ఇప్పించాలని కోరుతూ కలెక్టర్​ అనుదీప్​కు సర్పంచులు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్​ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీలకు వచ్చిన ఫండ్స్​ను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్​ చేయడం సరైంది కాదన్నారు. చెక్కులు పాస్​ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డీజిల్​తో పాటు వెహికల్స్, ఇతరత్రా రిపేర్ల బిల్లులు, శానిటేషన్, ఎలక్ట్రికల్, ఆలమ్, బ్లీచింగ్, బోర్ల​రిపేర్ కు సంబంధించిన​ బిల్లులు రావడం లేదన్నారు. స్టేట్​ ఫైనాన్స్​ నిధులు ఆరు నెలలుగా రావడం లేదన్నారు.