సుల్తానాబాద్, వెలుగు: మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జె.రాజమల్లు డిమాండ్ చేశారు. ఆదివారం సుల్తానాబాద్ లో నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.21 వేలు చెల్లిస్తోందని, ఇదే మాదిరిగా తెలంగాణలోనూ ఇవ్వాలన్నారు. కార్మికులందరికీ డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యం రావు మాట్లాడుతూ కార్మికులకు అందాల్సిన ఏరియర్స్, ఇతరత్రా ప్రయోజనాలు వెంటనే ఇవ్వాలని కోరారు. అంతకుముందు సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం నుంచి యశోద నరహరి ఫంక్షన్ హాల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు పాక మహేశ్, వెంకటస్వామి, అశోక్, అంజయ్య, రామ్మూర్తి, నాగమణి, నల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలి
సిరిసిల్ల టౌన్, వెలుగు : జిల్లాలోని దళితులందరికీ దళిత బంధు అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు డిమాండ్ చేశారు. ఆదివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో నిర్వమించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దళితబంధు ఇస్తామని హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రకటించారన్నారు. కేటీఆర్ నాయకత్వం వహిస్తున్న రాజన్న సిరిసిల్లలో 20 వేల కుటుంబాలు దళితులవే ఉన్నాయన్నారు. సిరిసిల్లలో యువత గల్ఫ్ దేశాలకు వలస పోకుండా ఉండాలంటే గ్రామీణ ప్రాంతంలోనే జీవనోపాధి కల్పించాలని, అందుకు దళితబంధే సరైనదని అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంతం రవి, సీపీఐ మండల కార్యదర్శి మంచికట్ల రమేశ్, నాగరాజు, రాజు పాల్గొన్నారు.
‘ముదిరాజులకు 14 శాతం వాటా ఇవ్వాలి’
గంభీరావుపేట, వెలుగు: రాష్ట్ర జనాభాలో 14 శాతం ఉన్న ముదిరాజులకు అన్ని రంగాల్లో 14 శాతం వాటా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు అన్నారు. ఆదివారం గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో ముదిరాజ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ లు అన్ని ఉద్యమాల్లో ముందుండి పోరాడారన్నారు. ముదిరాజులను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చాలని అన్నారు. వచ్చే జనరల్ ఎలక్షన్ లో ముదిరాజులకు అన్ని పార్టీలు సుముచిత స్థానం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రమేశ్, గ్రామాధ్యక్షుడు పిట్ల నర్సయ్య , ఏఎంసీ చైర్మన్ బాలవ్వ, రైతుబంధు కోఆర్డినేటర్ రాజేందర్ నాయకులు శ్రీమతి, లక్ష్మణ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
గాయత్రి హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్
సిరిసిల్ల టౌన్, వెలుగు : స్థానిక గాయ్రతి హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించినట్లు డాక్టర్ శ్రీరామరాజ, డాక్టర్ తిరుపతి ఆదివారం తెలిపారు. శనివారం యాక్సిడెంట్ జరగడంతో ఓ వ్యక్తి కడుపులో స్పినెక్టమీ(ప్లీహం) డ్యామేజ్ అయ్యింది. దీంతో 1.5 లీటర్ల రక్తం గడ్డకట్టిందని వైద్యులు పేర్కొన్నారు. పేషెంట్ కండిషన్ క్రిటికల్‌గా మారడంతో ఆపరేషన్ చేసి హిమోపెరిటోనియం తొలగించినట్లు డాక్టర్ శ్రీరామరాజ తెలిపారు.
రాజన్న ఆలయంలో భక్తుల సందడి
స్థానిక రాజన్న ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోడెమొక్కు చెల్లించుకుని రాజన్నను దర్శించుకున్నారు. కార్తీకమాసంతోపాటు సెలవురోజు కావడంతో అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.
- వేములవాడ, వెలుగు
అ‘పూర్వ’ సమ్మేళనం
కథలాపూర్, వెలుగు: స్థానిక జడ్పీ హై స్కూల్ లో 1996–-97 ఎస్సెస్సీ బ్యాచ్ ఆధ్వర్యంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. మండలకేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలో స్టూడెట్లు ఆప్యాయంగా పలకరించుకున్నారు. టీ చర్లు భూమాచారి, రాజేందర్, అంజయ్య, విద్యార్థులు నాగరాజు, రాజేశ్, శ్రీనివాస్, శ్రీధర్, శిరీష, సునంద, లావణ్య, గంగాజల పాల్గొన్నారు.
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
కోరుట్ల,వెలుగు: భార్యను చంపి మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి ఎస్సారెస్పీ కెనాల్ లో పడేసిన ఘటన కోరుట్ల పట్టణ విలీన గ్రామమైన ఏకీన్ పూర్ లో ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏకిన్ పూర్ కు చెందిన ఎర్ర చంద్రమోహన్, గంగరాజు భార్యభర్తలు. చంద్రమోహన్ తాగుడుకు బానిసై భార్య గంగరాజు(48) తో నిత్యం గొడవ పడేవాడు. శనివారం రాత్రి భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో చంద్రమోహన్రోకలి బండతో భార్య తలపై కొట్టగా ఆమె అక్కడిక్కడే చనిపోయింది. దీంతో గంగరాజు మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి ఎస్పారెస్పీ కెనాల్లో పడేశాడు. గంగరాజు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆదివారం చంద్రమోహన్ ను నిలదీశారు. అతడు సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మోహన్‌ను విచారణ చేయగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
హుజూరాబాద్, వెలుగు: పట్టణంలోని కేసీ క్యాంప్ కెనాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్లుకి చెందిన అమీనా భర్త రఫీతో కలిసి బైక్‌పై ఆదివారం హుజూరాబాద్‌లోని మైనార్టీ స్కూల్ హాస్టల్‌లో ఉంటున్న తన పిల్లలను చూడడానికి వెళుతుండగా కేసీ క్యాంప్ కెనాల్ వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహమ్మద్ అమీనా(28) అక్కడికక్కడే మృతి చెందింది. రఫీకి తీవ్ర గాయాలవడంతో హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆసిఫ్ తెలిపారు.
పన్నులు తగ్గించాలని మంత్రికి ఉత్తరాలు
చొప్పదండి, వెలుగు: పెరిగిన ఇంటి పన్నులు తగ్గించాలని కోరుతూ చొప్పదండిలోని 10వ వార్డు గణేశ్‌నగర్ మహిళా సంఘం సభ్యులు మినిస్టర్ కేటీఆర్ కు ఆదివారం పోస్ట్ కార్డులు రాసి నిరసన తెలిపారు. పన్నుల భారం తగ్గించాలని మహిళా సంఘం అధ్యక్షురాలు మమత కోరారు. కార్యక్రమంలో 10వ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.
జోడో యాత్ర కు కాంగ్రెస్ శ్రేణులు
కోరుట్ల, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగ రావు ఆధ్వర్యంలో లీడర్లు ఆదివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నర్సింగ రావు మాట్లాడుతూ రాహుల్ పాదయాత్రతో భవిష్యత్‌లో దేశంలో సంచనాలు నమోదవుతాయన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి రాహుల్ కు బహుమానంగా ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు, జలపతి రెడ్డి పాల్గొన్నారు.
రెనీ హాస్పిటల్ లో వైద్య విజ్ఞాన సదస్సు
కరీంనగర్ సిటీ, వెలుగు: నగరంలోని రెనీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి, ఐఎంఏ, కరీంనగర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అడ్వాన్స్ డ్ ట్రామా లైఫ్ సపోర్ట్ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో చల్మెడ మెడికల్ కాలేజీ డైరెక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడారు. యాక్సిడెంట్స్ జరిగినపుడు, అత్యవసర సమయాల్లో రోగులకు అందించే వైద్య సేవల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రెనీ చైర్మన్ స్వామి మాట్లాడుతూ హాస్పిటల్ లో వైద్యంతోపాటు ఏటా అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఉపేందర్ రెడ్డి, రవీంద్రా చారి, ఎల్.శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, కృష్ణ చైతన్య, బంగారి రజనీ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం
గంగాధర, వెలుగు: రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండల కేంద్రానికి చెందిన బండారి లక్ష్మీనర్సయ్య ఇటీవల మృతిచెందగా అతడి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల రైతు బీమా ప్రొసీడింగ్ కాపీని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా పథకాన్ని తెలంగాణలో అమలుచేస్తున్నారన్నారు. రైతు చనిపోయిన కుటుంబాలకు రైతుబీమా ఆర్థిక భరోసానిస్తుందన్నారు. అనంతరం ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుల్కం అనూరాధ-, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నవీన్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహిపాల్‌రావు, సర్పంచ్ లావణ్య- పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థులే కాలేజీకి మూల స్తంభాలు
తిమ్మాపూర్, వెలుగు: పూర్వ విద్యార్థులే జ్యోతిష్మతి కాలేజీకి మూల స్తంభాలని చైర్మన్ సాగర్ రావు అన్నారు. కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ‘యునక్తి-2022’ పేరుతో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీ 25 ఏండ్ల ప్రస్థానంలో తమ విద్యార్థులు 8 బంగారు పతకాలు సాధించారని, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు పొందారని అన్నారు. అనంతరం స్టూడెంట్లు చైర్మన్ కు జ్ఞాపిక అందజేసి సన్మానించారు. ప్రిన్సిపాల్స్ శ్రీనివాస రావు, వైశాలి, అల్యూమినీ కో ఆర్డినేటర్ ఎస్ గోపాల్ రెడ్డి, ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ విశ్వ ప్రకాశ్‌బాబు పాల్గొన్నారు.