న్యూఢిల్లీ: బిహార్‌పై కేంద్ర సర్కారు బడ్జెట్లో వరాల జల్లు కురిపించింది. ఎన్డీయే కూటమిలో నితీశ్ సర్కారు ఉండడంతో.. ఎయిర్‌పోర్ట్ నుంచి మఖానా బోర్డు వరకూ కీలక కేటాయింపులన్నీ ఆ రాష్ట్రానికే చేసింది. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం బిహార్‌లో మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ఇక్కడ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థికసాయం అందించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుతోపాటు ఐఐటీ పాట్నాలో హాస్టల్, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించనున్నట్టు ప్రకటించారు. పాట్నా ఎయిర్‌పోర్ట్ విస్తరణ, బిహ్తా వద్ద బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.
బిహార్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూతో కలిసి బీజేపీ అధికారంలో ఉంది. బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. ఎన్నికల ముందు కీలక కేటాయింపులు చేసింది.