
- మక్తల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా
- స్తంభించిన ట్రాఫిక్
మక్తల్, వెలుగు: రైతులకు ఆఫీసర్లు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని అంతరాష్ట్ర రహదారిపై సోమవారం రాస్తారోకో చేపట్టారు. రైతులు గన్నీ బ్యాగుల కోసం సోమవారం ఉదయం మక్తల్ విండో ఆఫీసుకు రాగా, కార్యాలయ సిబ్బంది గన్నీ బ్యాగులు ఇవ్వలేదు. అధికారుల తీరుకు నిరసనగా రైతులు విండో ఆఫీస్ ఎదుట అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యాసంగి సీజన్లో వరి పంట చేతికొచ్చి ధాన్యం మొత్తం కల్లాలపై ఉన్నప్పటికీ రైతులకు గన్నీ బ్యాగులను ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం కురిసిన వర్షానికి వరి పంట కల్లాల్లోనే తడిసి పోయిందని వాపోయారు.
రాస్తారోకోతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న మక్తల్ సీఐ రాంలాల్ రైతుల వద్దకు చేరుకుని మాట్లాడారు. గన్నీ బ్యాగులు వచ్చేంతవరకు రాస్తారోకో విరమించేది లేదని రైతులు తేల్చి చెప్పారు. సీఐ జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు కావాల్సిన గన్నీ బ్యాగులను అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. మండలంలోని రైతులకు నాలుగున్నర లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, 25 వేల గన్నీ బ్యాగులు మాత్రమే ఉన్నాయని, ఈ గన్నీ బ్యాగులను ఎవరికి ఇవ్వాలో అర్థం కాక కార్యాలయంలోనే ఉంచామని పీఏసీఎస్ కార్యదర్శి రాములు తెలిపారు. అరగంట తర్వాత ఒక లారీ గన్నీ బ్యాగులు మక్తల్ చేరుకున్నాయి. దీంతో గన్నీ బ్యాగుల కోసం రైతులు ఎగబడడం కనిపించింది. గన్నీ బ్యాగుల కొరతను తీర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.