
- సామాజిక సమీకరణలే అడ్డువస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తా
- ఆ స్థానంలో బీసీని గెలిపించుకుంటం: మల్ రెడ్డి రంగారెడ్డి
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు కేబినెట్లో స్థానం కల్పించేందుకు సామాజిక సమీకరణలే అడ్డుగా మారితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీసీని గెలిపించుకుంటానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. గతంలో రంగారెడ్డి జిల్లా నుంచి ఆరుగురు మంత్రులు ఉండేవారని, కానీ ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ఈ జిల్లా నుంచి మంత్రి పదవి ఇచ్చేందుకు ఒకవేళ సామాజిక సమీకరణలే అడ్డుగా నిలిస్తే, తాను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకొని కాంగ్రెస్లో ఉన్న బీసీ కార్యకర్తను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవిని అయినా వదులుకునేందుకు సిద్ధమని, ఈ కారణంతో జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరారు. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రెండు జిల్లాలకు మంత్రి పదవులివ్వాలని కోరారు. పార్టీలోకి నిన్న, మొన్న వచ్చిన వారికి మంత్రి పదవులిచ్చి, ఎప్పటినుంచో ఉన్న వారిని పక్కన పెడితే కార్యకర్తలు, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు.