ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల అసెంబ్లీ ముట్టడి

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల అసెంబ్లీ ముట్టడి
  • అడ్డుకున్న పోలీసులు.. అసెంబ్లీ వైపు వెళ్లేందుకు యత్నించిన వారి అరెస్ట్

బషీర్ బాగ్​/ఖైరతాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గురువారం మాల సంఘాల జేఏసీ నాయకులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేయకుండానే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం పట్ల వారు మండిపడ్డారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అసెంబ్లీ వైపు వెళ్లేందుకు యత్నించారు. 

దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పోలీసులు మాల సంఘాల నాయకులను అరెస్టు చేసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేసిన మాలలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

ఎన్నికల సమయంలో బీజేపీని బలపరచి.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన వర్గాన్ని అక్కున చేర్చుకుని, మాలలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి మారకుంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాలలు ఉద్యమిస్తారని  చెన్నయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, చెరుకు రాంచందర్, నల్లాల కనకరాజు, గోపోజు రమేశ్, తాలూకా అనిల్ కుమార్, నక్క సృజన, శ్రీనివాస్, శ్రీకాంత్ లలిత , సరళ, రమ, మాల మహానాడు ప్రధాన కార్యదర్శి దుబ్బాక నవీన్ మహర్, పంజాగుట్ట భాను, కర్నాటక మారుతి తదితరులు పాల్గొన్నారు.