- రాష్ట్రంలో మాలల జనాభా 30 లక్షలు..
- తక్కువగా ఉన్నరని ప్రచారం చేస్తున్నరు: వివేక్ వెంకటస్వామి
- వచ్చే నెలలో హైదరాబాద్‌లో నిర్వహించే సభకు భారీగా తరలిరావాలని పిలుపు
- మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో చెన్నూరు ఎమ్మెల్యే
ఆదిలాబాద్, వెలుగు: మాలలు అభివృద్ధి చెందాలంటే ఎలాంటి విభేదాలు లేకుండా అంతా ఒకేతాటిపైకి రావాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్‌లో మాల, మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. జాతి ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో మాలల సంఖ్య తక్కువని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీంతో ఏ అంశంలోనైనా మాలలను మేనేజ్ చేయొచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మాలల జనాభా 30 లక్షలు ఉందని తెలిపారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా మాలల జనాభా తక్కువుందని అంటే తాను ఒప్పుకోకుండా వాస్తవ జనాభా గురించి చెప్పానని గుర్తుచేశారు. మాలలు ఐక్యంగా ఉండి సత్తా చాటాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇందిరా గాంధీ హయాం నుంచి మాలలు కాంగ్రెస్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. మాలలు బయటకు వచ్చి మాట్లాడకపోవడం వల్లనే వర్గీకరణ విషయంలో కొంతమంది కుట్రలు చేశారని ఆరోపించారు.
సబ్ కమిటీ వేస్తే అసలు విషయం తెలుస్తుందని.. దీనిపై తాను సీఎం రేవంత్ రెడ్డిని కోరానని చెప్పారు. కులవివక్ష కారణంగానే ఇప్పటివరకు ఎస్సీ కాలనీల అభివృద్ధి జరగడం లేదని, అందుకే తాను ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి కోసం 25 శాతం నిధులు ఖర్చు పెడతానన్నారు. నవంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించే మాలల గర్జనకు మాలలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సమత సైనిక్ దళం జాతీయ కార్యదర్శి దిగంబర్ కాంబ్లే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల రవీందర్, మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి సుధాకర్, కోశాధికారి ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్ యేరా సుధీర్, సహాయ కార్యదర్శి రాజేశ్వర్ , వ్యవస్థాపక అధ్యక్షుడు బేర దేవన్న తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలే పార్టీకి బలం..
కార్యకర్తలే పార్టీకి బలమని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు ఆఫీసు వచ్చిన వివేక్‌కు ఆదివారం ఆయన ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. సీఎం, మంత్రులతో మాట్లాడి ఆదిలాబాద్‌కు భారీగా నిధులు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. రాబోయే ఎన్నికలు ఏవైనా సరే కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకాలంలో ఆదిలాబాద్‌లో పర్యటించానని, ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక సాయం అందించామని గుర్తుచేశారు. గతంలో ఎమ్మెల్యే వస్తున్నారంటే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను అరెస్టు చేసేవారని, కాంగ్రెస్ వచ్చాక ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తను కూడా అరెస్టు చేయలేదన్నారు. మరోవైపు, ఉట్నూర్ మండల కేంద్రంలోని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను ఆయన నివాసంలో వివేక్ వెంకటస్వామి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా వివేక్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, సత్కరించారు. ఎమ్మెల్యేలు ఒకరినొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ అలయ్ బలయ్ చేసుకున్నారు.
నల్లాల ఓదెలుకు వివేక్ పరామర్శ..
హైబీపీతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. శనివారం ఆయన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మెడ్‌లైఫ్ ఆసుపత్రిలో ఓదెలును కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెన్నూరు మున్సిపాలిటీలోని కొత్తగూడెం, కిష్టంపేట గ్రామంలో సీసీ రోడ్లకు వివేక్ శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో వాహన, ఆయుధ పూజలు చేశారు. పలు మండపాల్లో దుర్గామాత అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.
సింగరేణి దసరా సంబురాల్లో వివేక్ వెంకటస్వామి దంపతులు
కోల్‌బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం రూ.500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, వీటి ఫలాలు త్వరలోనే ప్రజలకు అందుతాయని చెప్పారు. శనివారం రాత్రి మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన దసరా పండుగ సంబురాలు, రాంలీలా వేడుకలకు వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అలాగే, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్ దంపతులు, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు.
అనంతరం వివేక్ మాట్లాడుతూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగ జరుపుకుంటామని చెప్పారు. సింగరేణి కార్మిక ప్రాంతాల ప్రజలు కాకా కుటుంబాన్ని 50 ఏండ్లుగా ఆదరిస్తున్నారని, కార్మికుల సహకారంతో కాకా వెంకటస్వామిని చాలా సార్లు ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. ఏఐటీయూసీ స్టేట్ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఎక్కడా లేని విధంగా కేవలం సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తోందని చెప్పారు. దసరా సంబురాల్లో భాగంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి- దంపతులను సంస్థ జీఎం దేవేందర్, వాసిరెడ్డి సీతారామయ్య సన్మానించారు.