ఎస్సీ వర్గీకరణ నివేదిక తప్పుల తడక

ఎస్సీ వర్గీకరణ నివేదిక తప్పుల తడక
  • ఉమ్మడి ఏపీ జనాభా లెక్కలను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు?
  • వర్గీకరణకు వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు చేస్తం:మాల సంఘాల నేతలు
  • మాలలకు తీరని అన్యాయం
  • గత పదేండ్లలో మాదిగలే ఎక్కువ బాగుపడ్డారని కామెంట్​ 

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీలో నిర్వహించిన 2011 సెన్సెస్ ప్రకారం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని  బీఎంఐ ( భీమ్ మిషన్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర అధ్యక్షుడు డి.సర్వయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ మాందాల భాస్కర్ అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ నివేదిక ఇవ్వడం సరికాదన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రెస్​నోట్​ రిలీజ్​చేశారు. షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్ నివేదిక తప్పుల తడకలా, ఏకపక్షంగా ఉందన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్నా ఇంకా ఉమ్మడి ఏపీ లెక్కలు చూపించడం తెలంగాణ సమాజాన్ని తప్పు దోవ పట్టించడమే అవుతుందన్నారు. “2011 జనాభా లెక్కలు తీసుకోవాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చెప్పలేదు. అలాంటపుడు 2011 జనాభా లెక్కలు ఎలా తీసుకుంటారు?  సుప్రీంకోర్టు ఎంపరికల్ డాటా తీసుకోవాలని చెప్పింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎంపరికల్ డాటా తీసుకోలేదు. 

2014 జూన్ 2 నుంచి ఎంపరికల్ డాటా సేకరించ కుండా నివేదిక ఇవ్వడం  అన్యాయం. గడిచిన పదేండ్లలో కేవలం మాదిగలు మాత్రమే బాగుపడ్డారు. ఒక వ్యక్తికి భయపడి, ఒక వ్యక్తిని సంతోష పెట్టడం కోసం లక్షలాది మంది మాలలకు, మాల ఉపకులాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం” అని నేతలు విమర్శించారు.

మాలలను అణిచివేసే కుట్ర: పిల్లి సుధాకర్

పార్లమెంట్ ద్వారా జరగాల్సిన వర్గీకరణ పక్రియను రాష్ట్రాలు చేయటం కరెక్ట్ కాదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు. ఇది మోదీ ఆడుతున్న గేమ్ అని, వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా కలిసి పోరాటాలు చేస్తామని మంగళవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లొద్దని సూచించారు. మాలలను సామాజికంగా, రాజకీయంగా ఆర్థికంగా అణిచే కుట్ర జరిగిందని పిల్లి సుధాకర్​అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఇతర రాష్ట్రాల్లో ఎందుకు చేస్తున్నారని నిలదీశారు.