ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపుమేరకు సిద్దిపేట బస్ డిపో వద్ద బస్సులు బయటకు రాకుండా ధర్నా చేపట్టారు. బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
SC రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ భద్రాచలంలో మాలమహానాడు నేతలు ఆందోళనకు దిగారు. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట... వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ధర్నా చేపట్టారు. వర్గీకరణతో ఎస్సీ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందన్న నాయకులు...కేంద్రం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిరిసిల్లలో ధర్నా చేపట్టారు. సిరిసిల్ల బస్ డిపో ఎదుట బస్సులు బయటకు వెళ్లకుండా నాయకులు ఆందోళనకు దిగారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రం పునరాలోచించాలని ఐద్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. నిరసన చేపట్టిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం డిపో ఎదుట ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు ఆందోళనకు దిగారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పునరాలోచించాలని మాలమహానాడు సంఘం నేతలు కేంద్రాన్ని కోరారు. బస్ డిపో ఎదుట ఆందోళన చేపట్టిన నేతలను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించటంతో వాగ్వాదం జరిగింది.
ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల ఉపకులాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఉట్నూర్,ఇంద్రవెల్లి,నార్నూర్, జైనూర్,సిర్పూర్,లింగాపూర్ మండలాల్లోని అన్ని దుకాణాలు సంపూర్ణంగా బంద్ పాటించాయి. పలు వ్యాపార,ప్రైవేట్ విద్యాసంస్థలు వీరికి మద్దతు తెలిపాయి.