
- హైకోర్టులో మాలమహానాడు పిటిషన్
- విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్
- కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ షెడ్యూల్డ్ కులాల(రిజర్వేషన్ల సర్దుబాటు) చట్టం, 2025ను సవాలు చేస్తూ మాల మహానాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చట్టంలో కులాల మధ్య రిజర్వేషన్ల వర్గీకరణకు ఏక సభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌కు చట్టబద్ధత లేదని పేర్కొంది. ఈ కమిషన్ చట్టబద్ధమైన డేటా సేకరించలేదని తప్పుపట్టింది. 2011లో తీసుకున్న జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం చెల్లదని, ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన జనాభా లెక్కలను తెలంగాణ రాష్ట్రంలో ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల తీరని అన్యాయం జరుగుతుందని తెలిపింది. ఈమేరకు మాల మహానాడు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాల డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణకు చేపట్టింది. కమిషన్ రిపోర్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధమనే పిటిషనర్ వాదనపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కమిషన్ సరైన డేటా సేకరించలే..
మాల మహానాడు తరఫున సీనియర్ లాయర్లు వాదిస్తూ..‘‘ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కులాల మధ్య వెనుకబాటుతనానికి న్యాయం చేకూర్చే డేటాను కమిషన్ సేకరించలేదు. అశాస్త్రీయ డేటా ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. కమిషన్ 2011 ఏడాది డేటాను పరిగణనలోకి తీసుకోవడం చెల్లదు. కులాల మధ్య రిజర్వేషన్లను సర్దుబాటు చేయడానికి సరైన డేటా లేదు. ఫలితంగా వర్గీకరణ.. చట్ట వ్యతిరేకం అవుతుంది”అని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలను ఉపవర్గీకరించడంలో, షెడ్యూల్డ్ కులాల్లో కొన్ని సమూహాల వెనుకబాటుతనాన్ని నిర్ణయించడంలో అశాస్త్రీయ విధానాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. ఐదో ప్రతివాదిగా ఉన్న ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం 2025ని ప్రకటించడం చెల్లదని, ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు. దీన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉందన్నారు. రాజ్యాంగంలోని15, 16, 338, 341 అధికరణాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. 2015లోని చట్టాన్ని రద్దు చేసి, తెలంగాణ షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం 2025 తీసుకురావడం రాజ్యాంగ అధికరణాలకు వ్యతిరేకమన్నారు. పర్యావసానంగా న్యాయ శాఖ ఈ నెల 14న వెలువరించిన జీవో 9, షెడ్యూల్ కులాల శాఖ ఇచ్చిన జీవో 10, జీఏడీ ఇచ్చిన జీవో 99 చెల్లవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల14 నుంచి అమల్లోకి వచ్చే విధంగా వెలువడిన జీవోలు చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించేవిగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఉన్నాయన్నారు. షెడ్యూల్డ్ కులాలలో కొన్ని సమూహాల వెనుకబాటుతనం, తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం వంటి కీలక అంశాలపై ఏవిధమైన డేటా సేకరించకుండా కమిషన్ ఏకపక్షంగా నివేదిక ఇస్తే దానిని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చేవిధంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. వాదనల తర్వాత ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతామని ప్రకటించింది.