- వన్ మెన్ కమిషన్ ను కలిసిన మాల మహానాడు ప్రతినిధులు
ముషీరాబాద్, వెలుగు: శాస్త్రీయత లేని ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాల మాహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్‌బాబు చెప్పారు. మంగళవారం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ మెన్ కమిషన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ను మాల మహానాడు ప్రతినిధులు కలిశారు. షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధికి పలు సూచనలు చేస్తూనే వర్గీకరణను వ్యతిరేకిస్తూ వినతి పత్రం అందజేశారు.
అనంతరం రమేశ్ బాబు మాట్లాడుతూ.. కొందరు ఎలాంటి ఎజెండా లేకుండా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 22 శాతానికి పెంచాలని, రిజర్వేషన్ల ఫలితాలు అందినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి విరుద్ధమన్నారు. కమిషన్ ను కలిసిన వారిలో లింగం, కృష్ణమూర్తి, ఎ.శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.